మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు.

కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” అని కొందరు అనువదించినా ఆ అనువాదము సంపూర్ణము కాదు. ఎందుకంటే పొగను విడిచే వాహనాలు ఎన్నో వున్నాయి. అదేవిధంగా ప్రతి సామాన్యుడికీ అర్ధమయ్యే రైలు అనే పదాన్ని పై విధంగా అనువదించటం కూడా సరి కాదు. అంతెందుకు..? మనం రోజూ చేసే బ్లాగింగు అనే ఆంగ్ల పదాన్ని అదే విధంగా తెలుగులో ఉపయోగించట్లేదా..? ఇంకా వాటిపై చమత్కార చణుకులు జల్లి, బ్లాగరి, బ్లాగర్లు, బ్లాగ్లోకం ఇలా ఎన్నో తెలుగులో లేని పదాలను సృష్టించుకున్నామే, మరి ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ లాంటి పదాలను అదే పేరుతో తెలుగులో ఉపయోగిస్తే తప్పేముంది..?

మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు. కానీ, అదే పనిగా ప్రతీ పరభాషా పదాన్నీ ముక్కలుగా తెగ్గోసి తెలుగులోకి అనువదించటం వల్ల బ్లాగులు సామాన్యుడికి అర్ధం కాని విధంగా తయారవుతాయని నా అభిప్రాయం. భారతీయ పదాలైన “యోగా”, “దేశీ”, “గురు” లాంటి వాటిని ఆంగ్లంలో ఉపయోగిస్తున్నప్పుడు “ఇంటర్‌నెట్” లాంటి పదాలను తెలుగులో అదే విధంగా వాడుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. అంతే తప్ప “వెబ్”ను “సాలెగూడు” గానూ “హార్డ్ డిస్క్” ను “కఠిన చట్రం” గానూ అనువదిస్తూపోతే తెలుగు బ్లాగులు హాస్యాస్పదంగా తయారవుతాయి. మరి మీరేమంటారు..? 

11 comments on “మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

  1. రవి వైజాసత్య అంటున్నారు:

    “ధూమశకట వాహనము” ఉదాహరణ ఒక క్లీషేలాగా తయారయ్యింది. దాన్ని చూపి కొత్తగా సృష్టించే పదాలను కొట్టివెయ్యటం బాగాలేదు. అలా వాడితేనే ఒక పదం తెలుగులో తగలడిందని జనాలకు తెలుస్తుంది. నలుగురికి నచ్చినవి పైకితేలతాయి..మిగిలినవి ధూమశకటంలాగే చస్తాయి. అంతేగానీ పుట్టేముందే ఇలా చంపటం ఎందుకు?

  2. teresa అంటున్నారు:

    ఆ మాత్రం తెలుగు మీద ఇంటరెస్టున్న వాళ్ళే కదా ఈ బ్లాగులు చదూతారు, హాస్యస్పదమేమీ కాదనుకుంటాను.

  3. Giri అంటున్నారు:

    ఈ మధ్యకాలంలో పుట్టి ఆంగ్లానికి ఎగుమతి అయిన తెలుగు పదం ఒకటి చెప్పండి?

    మనము తెలుగులోకి పరభాషా పదాల దిగుమతి కొత్తవాటికే కాదు, ఇంచక్కగా ఉన్నవాటికీ చేస్తూ వాడుకలో తెలుగుని ఆంగ్లంతో ప్రతిక్షేపిస్తున్నాము..

    తెలుగుకి ఇంలాంటి దుస్ధితి ఎదురైనప్పుడు, ఎదురీదుతున్న వారిని చేతనైతే ప్రోత్సహిద్దాం..

    మీరేమంటారు?

  4. vbsowmya అంటున్నారు:

    Hmm… yeah… మరీ అన్నింటికీ కాదు కానీ… కొంత వరకూ అవసరమే అనిపిస్తుంది ఈ అనువాద ప్రక్రియ కూడా. నేను మొన్నమొన్నటి దాకా ప్రతి ఆంగ్ల పదానికీ ఓ కొత్త తెలుగు పదం అవసరమా అనుకుంటూనే ఉన్నాను. కానీ, ఈ మద్యనే పిన్లాండ్ వెళ్ళిన నా స్నేహితుడు ఫిన్నిష్ భాష లో రాసిన దాన్ని స్వీడిష్ భాష లో వాళ్ళ పదాలనే ఉపయోగించుకుని ఎలా రాస్తారో చెప్పాక నాలో కూడా ఆలోచన మొదలైంది… అయితే, ఒక భాష లో పదం ప్రాచుర్యం పొందాక ఇప్పుడు కొత్త పదాలు కనిపెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా? – అన్నది నా సందేహం.
    PS: This template is same as mine. సడెన్ గా చూసి ఏమిటి నా బ్లాగు లో ఏవేవో టపాలు ఉన్నాయి? అనుకున్నా!! :))

  5. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

    లేదండీ అన్ని పదాలూ హాస్యాస్పదం గా ఎందుకుంటున్నాయి ?

    ఉదాహరణ: Post కి టపా అని వాడుతున్నాము. ఇది ఎంతగా అందరి నోళ్ళలో నానుతుందో నే వివరించి చెప్పక్ర్లేదనుకుంటాను.

    అలాగే వాడుక పదాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ? వాడటం మొదలెడితేనే కదా ?
    అవి సరయిన పదాలు కావనుకోండి కాలానుగుణంగా అవే మరుగున పడిపోతాయి. జనాలు ఊరికే పదాలు ఉపయోగించరు కదా.

    ఇందులో తప్పేమీ లేదని నా ఉద్దేశ్యం.

    ఇంకా తెలుసుకోవాలని ఉంటే telugupadam గూగుల్ గుంపులో చేరండి. అక్కడ ఈ విషయాలై ఎంతో చర్చ జతుగుతుంది. ఏ విధంగా అనువదిస్తే పదాలు బాగుంటాయో పలువురు సూచిస్తున్నారు. ఎంతో సమాచారం తాబాసు వంటి వారు అందిస్తున్నారు.

    ఉపయోగించే పదం బాగాలేకపోతే ప్రత్యామ్నాయం సూచించండి. అది బాగుంటే అదే వాడదాము.

  6. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    నేను రాసిన ఈ క్రింది వాక్యం చదివారా..?

    “మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు.”

    ఎక్కడైనా నేను ఆంగ్ల పదాలను అస్సలు తెలుగులోకి అనువదించకూడదు, అలాగే వదిలివేయాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసానా..? “statistics” కు “గణాంకాలు” అనీ, “probability”కి “సంభావ్యత” అనీ ఇలా తెలుగు పదాలు ఉన్నాయి. వీటిని వాడటాన్ని నేను ప్రోత్సహిస్తాను. కానీ కొన్ని పదాలకు, ముఖ్యముగా పేర్లను సూచించే పదాలకు ఈ అనువాదంనుంచి మినహాయింపు ఉంటే బాగుంటుందన్నదే నా అభిప్రాయం.

    ఉదాహరణకు నా పేరు “రాజారావు” ను ఆంగ్లములో “king doesn’t come” గా అనువదిస్తే బాగుంటుందా..? అదే విధంగా “Internet” ను కూడా తెలుగులోకి “అంతర్జాలం” అని మార్చకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయమే తప్ప నేనేదో మొత్తం ఈ అనువాద ప్రక్రియకే శత్రువు అయినట్టు వ్యాఖ్యానించటం సరి కాదు. ఆ మాటకొస్తే నేను రాసిన పై టపాలో అవసరం ఉన్న చోట తప్ప మరెక్కడైనా ఆంగ్ల పదాలు దొర్లటం మీరు చూసారా..?

    ఈ రకమైన మనస్తత్వం గురించే ఎవరో వారు రాసిన టపాలో ప్రస్తావించారు. మనం ప్రతీ విషయాన్నీ “generalize” చేసి మాట్లాడేస్తున్నామే తప్ప విడిగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించట్లేదు.

    కొంతమంది పెద్దలు చెప్పినట్టు, నేను కూడా telugupadam గూగుల్ గుంపులో చేరి నా తరపు వాదనలను వినిపించటానికి ప్రయత్నిస్తాను.

  7. కొత్తపాళీ అంటున్నారు:

    రాజారావు గారూ, ఈ వాదన బ్లాగర్ల గుంపులో పలుమార్లు జరిగింది. ఒకసారి తీరిగ్గా ఉన్నప్పుడు పాత చర్చలు చూడండి. రెండువేపులా బాగా తరచి చూసుకున్నాకనే ఇలా సాంకేతిక పదాలకి సాధ్యమైనంతగా తెలుగు వాడాలని నిర్ణయించుకోవడమే కాక క్రియలో కూడా చూపిస్తున్నారు మన సభ్యులు. ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతై? statisticsకీ probabilityకీ తెలుగుపదాలు “ఉన్నయ్యి” – అన్నారు. ఆ “ఉన్న” పదాలు కూడా ఎవరో పనిగట్టుకుని అంటగట్టినవే. కొత్త తెలుగు పదాలు సృష్టించి వ్యాప్తిచెయ్యడం అవసరమా అంటే అవసరమే అంటున్నారు ఆచార్య వేమూరి వెంకటేశ్వర రావు గారు. సిలికానాంధ్రా వారి సుజనరంజని జాల పత్రికలో వారు నడిపే వీరతాళ్ళు శీర్షిక ఒకసారి చూడండి – ఈ పదాల సృష్టిలోకి ఎంత ఆలోచన పెట్టుబడీ పెడుతున్నామో తెలుసుకోవచ్చు.

  8. nidalu అంటున్నారు:

    ఇది ఇప్పుడే చూచాను. కొంచం కొత్త.
    కొంతకాలం క్రితం, మలేసియానించి ఒకరు నాకు ఒక మైలు అంపించారు. ఆయన ప్రతివారం ఒకరెడియో కార్యక్రమం ఒక్క ఆంగ్లమాట కూడా లేకుండా నడుపుతాననీ, ఎవరైనా ఆయవమాటల్లో ఆంగ్లం చూపగలిగితే 100,000 రూప్యములు ఇచ్చేదననీ చెప్పారు. చూడంది. ఆమైలు మల్ల కనిపిస్తే మీకు ఇస్కాను.

  9. Padma I. అంటున్నారు:

    >> “కానీ కొన్ని పదాలకు, ముఖ్యముగా పేర్లను సూచించే పదాలకు ఈ అనువాదంనుంచి మినహాయింపు ఉంటే బాగుంటుందన్నదే నా అభిప్రాయం.

    ఉదాహరణకు నా పేరు “రాజారావు” ను ఆంగ్లములో “king doesn’t come” గా అనువదిస్తే బాగుంటుందా..? అదే విధంగా “Internet” ను కూడా తెలుగులోకి “అంతర్జాలం” అని మార్చకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయమే తప్ప నేనేదో మొత్తం ఈ అనువాద ప్రక్రియకే శత్రువు అయినట్టు వ్యాఖ్యానించటం సరి కాదు.”
    >>>
    very good points, indeed. Firefox, Greasemonkey లాంటి మాటలని ముక్కలు చేసి చేసిన అనువాదాలు (“మంటనక్క”, “జిడ్డుకోతి” లాంటివి) వినడానికి చాలా వెగటు/చిరాకు పుట్టిస్తాయి, ఎందుకు? firefox అనే browser కీ మంటకీ, నక్కకీ ఏమీ సంబంధం లేదు కాబట్టి.(అలాంటి అనువాదాలు హాస్యానికి (tongue in cheek) చేసినవే అనుకుందాం.) “firefox”, “మంటనక్క” లకి ఉన్న సంబంధం కన్నా, “internet (interconnected network)”, “అంతర్జాలం” ల కి దగ్గిర సంబంధం ఉంది. ఆ విధంగా “అంతర్జాలం” సమంజసమే. కానీ, కారు, బస్సు లాంటి ప్రాచుర్యంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి తెలుగు మాటలు (సృష్టించినా కూడా) ఎలాగైతే ప్రచారంలోకి రాలేదో, అలాగే, అంతర్జాలం కూడా ప్రచారం పొందకపొవచ్చు. ఏ మాటైనా పదిమంది నోళ్లలో నానినప్పుడే “పాడియై ధరజెల్లుతుంది”.

    >>> “ఆ మాటకొస్తే నేను రాసిన పై టపాలో అవసరం ఉన్న చోట తప్ప మరెక్కడైనా ఆంగ్ల పదాలు దొర్లటం మీరు చూసారా..? ”
    >>>
    ఇది చాలా అభినందనీయం! ఇలాగే కొనసాగించండి.

  10. phani అంటున్నారు:

    రాజా రావు గారు మీరన్నది నిజమే, ఐతే ఇతర సభ్యుల అభిప్రాయాలతో కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మన తెలుగులో పదాలను పరిచయం చేయడం లో తప్పేం లేదు కానీ, నా సూచన ఏంటంటే అలాంటి సాంకేతిక పదాలను వడేతప్పుదు పక్కన ఆంగ్ల పదం కూడా బ్రాకెట్లో చేరిస్తే అందరికీ అర్థం అవుతుంది అలాగే కొత్త పదాలు ప్రాచుర్యం పొందుతాయి.

    ఫణి

వ్యాఖ్యానించండి