నేను అమెరికాలో చూసినన్ని ఉడుతలు ఇండియాలో ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఉద్యానవనాలు, సహజ సిద్ధమైన వనాలు, విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉండడం వల్లనేమో ఉడుతల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తరచుగా ఇలాంటి ఉడుతలు పొరపాటునో, ఆహారాన్వేషణలోనో వాహనాలు తిరిగే రోడ్లపైకి రావడం, రివ్వున దూసుకుపోయే ఏ కారు చక్రాల కిందో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. నేనూ, నా భార్యా ఏ పని మీద బయటకు వెళ్ళినా, ఎక్కడో ఒక చోట ఇలా చనిపోయిన ఉడుతను చూడడం, దాని అల్పాయుష్షును తలచుకొని బాధ పడడం, అతి వేగంతో వాహనాన్ని నడిపిన వాడిని తిట్టుకోవడం మామూలయిపోయింది. ఎప్పుడు కారు నడిపినా ఏ మూలనుంచో ఏ ఉడతో, పిల్లో కారుకి అడ్డం పడుతుందేమోనని అతి జాగ్రత్తగా కారు నడపడం, ఒక్కోసారి హఠాత్తుగా కారును పక్కకి తిప్పి తప్పించడం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఉగాదినాడు జరిగిన సంఘటన మా హృదయాలను కలచి వేసింది. నేను ప్రతి రోజూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళడం అలవాటు. అలాగే ఉగాదినాడు కూడా ఇంటికి వచ్చి, భోజనం పూర్తి చేసుకొని మరల ఆఫీసుకు బయలుదేరాను. మా గృహసముదాయం దాటగానే రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుకొనేందుకు కొన్ని పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ నిండుగానే ఉంటూంటాయి. వాటి మధ్యగా నేను కారును పోనిస్తూండగా ఎక్కడినుంచో ఒక ఉడుత ఆ నిలిపిఉన్న కార్ల మధ్య నుంచి రోడ్డు మీదకి ఒక్కసారి దూకి నా కారుకు అడ్డుపడింది. అక్కడ వేగ పరిమితి 25 మైళ్ళు ఉంటుంది. నేను దాదాపుగా అదే వేగంతో ప్రయాణిస్తున్నాను. అనుకోకుండా అడ్డుగా ఉడుత కనపడడంతో, దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు స్టీరింగును పక్కకు తిప్పాను. నా కారు ముందు చక్రాలు రెండూ ఉడుతను దాటేయడంతో, ఇక దాని ప్రాణానికి ముప్పు తప్పిందని సంతోషించి ఒక్క సెకను కూడా గడిచిందో లేదో, నా కారు వెనుక చక్రం దేని మీదో ఎక్కడం, ఒక చిన్ని శబ్దం వినిపించడం జరిగింది. ఒక్కసారి కారు బ్రేక్ వేసి వెనుకకు చూసేసరికి ఆ ఉడుత నా కారు వెనుక చక్రాల కింద పడి చనిపోయిఉంది. అంత బరువైన కారు, అంత అల్ప ప్రాణి మీదుగా వెళ్తే ఎక్కడ తట్టుకోగలదు..? అప్పటివరకూ చెంగు చెంగు మంటూ పరుగెత్తిన ఆ ఉడుత ఒక్క క్షణంలో విగతజీవి కావడం, అదీ దాని ప్రాణం పోవడానికి నేను కారణం కావడం ఎంతో బాధను కలిగించింది. ఇందులో నా తప్పు లేకున్నా, నావంతు ప్రయత్నం నేను చేసినా, దానిని కాపాడలేక పోయానే అన్న క్షోభను, మనస్తాపాన్ని రోజంతా అనుభవిస్తూనే ఉన్నాను. జరిగిన విషయం తెలిసిన నా భార్య కూడా కన్నీరు కార్చింది. ఇద్దరం కలసి శ్రీనివాసునికి నమస్కరించి ఆ ఉడుత ఆత్మశాంతికై ప్రార్థించాము.