చిన్ననాటి ఆటలు – వీపు చట్నీలు

విరామ సమయాన్ని సూచిస్తూ మా పాఠశాల ప్యూను సత్తిరెడ్డి గంటను గణగణా మోగించాడు. పుట్టల్లోంచి చీమలు బయటకు వచ్చినట్టు విద్యార్థులందరూ వారి తరగతి గదులనుంచి బయటకు పరుగుపెడుతున్నారు. నేను అప్పటివరకూ రాసిన నోటు పుస్తకాన్నీ, పాఠ్య పుస్తకాలనీ సంచిలో సర్దుకుంటున్నాను. ఇంతలో నాకు వీపు చుర్రుమని, నొప్పి తలకెక్కడంతో స్పృహలోకి వచ్చాను. నా వీపుకు తగిలిన రబ్బరు బంతి నాలుగు బెంచీల అవతలకి పోయి ఏమీ ఎరగని దానిలా అమాయకంగా ఒక మూల దాక్కుంది. గిరుక్కున వెనక్కి తిరిగి చూసేసరికీ, అప్పటికే బయటకు వచ్చేసిన ‘ఎ సెక్షన్ ‘ కంకిపాటి శ్రీను, చెక్కా నాగేశ్వరరావు, పళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ నన్ను గేలి చేస్తున్నారు. అప్పుడర్థమైంది.. వాళ్ళు ‘వీపు చట్నీ’ ఆటకై నన్ను కవ్విస్తున్నారని. రెట్టించిన కసితో, ఉత్సాహంతో మూలన పడ్డ బంతిని తీసుకొని నేను కూడా వారి వెంటబడ్డాను. నాకు దొరకకుండా వాళ్ళు తుర్రుమన్నారు. విరామ సమయం పదినిముషాలే అయినా, అంతలోనే మా పాఠశాలలో ఉన్న గదులన్నింటినీ రెండు మూడు సార్లైనా చుట్టేసి ఉంటాం. ఆ సమయంలో మా లక్ష్యం అంతా, మన వీపు మీది చుర్రుమనే మంట పోయేలోపు, ఎదుటివాడి వీపును ఎంత విమానం మోత మోగిద్దామా అనే..!! విరామం పూర్తి అయ్యి, ఎవరి తరగతి గదులకు వారు చేరుకునేసరికీ చెమటతో చొక్కా మొత్తం తడిసి వీపుకు అతుక్కుపోయేది. ఇంకుపెన్నుతో, అక్షరాలు అలుక్కుపోతుండగా, తరువాతి క్లాసులో నోట్సు తీసుకోవడం ఒక మరపురాని అనుభూతి.

ఈ ‘వీపు చట్నీలు ‘ ఆటకి నియమాలు అంటూ ఏవీ ఉన్న గుర్తులేదు. ఎవరికి బంతి దొరికితే వాడు ఎవరో ఒకరి వీపుకి గురి చూసి దాన్ని ‘ చట్నీ ‘ చెయ్యడమే..!! ఎదుటివాడి బంతికి మన వీపు చిట్లకుండా కాచుకొంటూ, తప్పించుకొంటూ, అవతలివాడిపై దాడి చేసేందుకు ఎత్తులు, జిత్తులు పన్నుతూ ఎంతో వేగంగా సాగిపోతుందీ ఆట. ఈ ఆటకు జనం రారన్న బెంగలేదు. మనం ఎవరిని ఆటలో కావాలనుకొంటున్నామో, వారి వీపు మోగేటట్టుగా ఒఖ్ఖటిస్తే, ఆ కసి తీర్చుకోవడానికన్నా చచ్చినట్టు వచ్చి ఆటలో కలిసేవారు. ఈ ఆట ఆడేటప్పుడు ఎన్నోసార్లు బంతి ఏ బురదలోనో, మురికిగుంటలోనో పడేది. అదేమీ పట్టించుకోకుండా, బంతిని తీసి, రెండు మూడు సార్లు ఏ ఇసుకలోనో, దుమ్ములోనో పొర్లించి, గట్టిగా గోడకేసి కొడితే, మరలా ఆటకు తయార్. మా పాఠశాలలో ఆగస్టు పదిహేనున తెల్లటి వెల్లతో వేసిన గోడలన్నీ ఈ బంతి ముద్రలతో నిండిపోయేవి. ఈ మురికి బంతి తగిలి మా చొక్కాలపై కూడా బంతి ముద్రలు స్పష్టంగా పడడం, ఇంటికెళ్ళాకా “నీ చొక్కాలు ఉతకడం నా..వల్ల కాదు..!!” అంటూ అమ్మ చేతుల్లో తన్నులు, చీవాట్లు తినడం రివాజుగా ఉండేది. అయినా, ఈ “వీపు చట్నీలు” ఆట అనుభవాల ముద్రలు మాత్రం ఇప్పటికీ నా మనసులో చెరగకుండా అలానే ఉన్నాయి.

చిర్రెత్తించిన “చిరుత”

ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు.

చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” అన్నట్లు ఏడవలేక వచ్చే నవ్వులు చాలాసార్లు వినిపించాయి.

కథ విషయానికి వస్తే, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడం, తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, పొగరుబోతు హీరోయిన్ తిక్క కుదిర్చి ప్రేమాయణం సాగించడం.. ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు..? కొడుకు కెరీర్‌ను శ్రద్ధగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, తన కొడుకు తొలి సినిమాకు ఇంత మూస కథను ఎన్నుకోవడం విచిత్రమే.

ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం పెద్ద మైనస్. పాటలు ఎక్కడా వినసొంపుగా లేవు. చిరంజీవి కొడుకు సినిమా కనుక పాటలు ఆ మాత్రం అన్నా పాపులర్ అయ్యాయి. చిరంజీవితో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ, ఈ చిత్రానికి ఇంత నాసిరకం సంగీతాన్ని అందించాడంటే ఆశ్చర్యమే. 

ఇక చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలందరికీ హీరోయిన్లను ఎన్నుకోవడంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల ఇటీవలి సినిమాలకు హీరోయిన్‌లు ఎంత మైనస్ అయ్యారో తెలిసిన విషయమే. అదే జాడ్యం ఈ సినిమాకూ పట్టుకొంది. ఒక్కోసారి హీరోయిన్‌ను మిగిలిన స్నేహితురాళ్ళతో కలిపి చూపిస్తే గుర్తించడమే కష్టం అయ్యింది.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, ఎంత చెత్త సినిమానైనా “ఏరా”, “ఒరే”, “ఏమ్మా”, “పోమ్మా” లాంటి మాస్ పదాలతో లాగించేయచ్చనే కాన్‌ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది.  ఇందులోనూ హీరో, హీరోయిన్ల మధ్యన అతి సంభాషణా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాల్లో ఈ సంభాషణలు క్లిక్ అయినా, ప్రతీ సినిమాకీ అదే కొనసాగిస్తే ఎప్పుడో ప్రేక్షకులు తిప్పికొడతారన్న విషయం పూరీ గుర్తించాలి. అదే విధంగా క్లాస్ సినిమాగా తీయాలా, లేక మాస్‌ను ఆకర్షించాలా అనే విషయంలో కూడా పూరీ కన్‌ఫ్యూజన్ స్పష్టంగానే కనిపించిపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ కొన్నిచోట్ల “సూపర్” సినిమాను తలపించింది. ముఖ్యంగా వాటర్ స్కూటర్ ఫైట్ అయితే “సూపర్” క్లైమాక్స్ సన్నివేశాన్నే గుర్తుకు తెచ్చింది.

ఈ సినిమాలో కొద్దో గొప్పో హాస్యం అంటే ఆలీ గూర్చే చెప్పుకోవాలి. “యు వాంట్ థాయ్ మస్సా..” అంటూ పర్యాటకులను మసాజ్‌తో ఆకట్టుకొనే ఆడ బ్రోకర్ పాత్రను పోషించాడు. ఆలీకి ఆడవేషం కొత్త కాకపోయినా, సాధ్యమైనంత వరకూ కొత్త మేనరిజంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇక అమెరికాలో, చిరంజీవి ఇమేజ్‌ను సొమ్ముచేసుకోవడానికి టిక్కెట్టు రేటును 15 డాలర్లు చేయడం కోపం తెప్పించింది. ఈ మధ్య అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో రేట్లు కూడా బాగా గుంజి జనాలను దోచుకొంటున్నారు.

చివరిగా, రాంచరణ్ నటన ఫరవాలేదు. ఎక్కడా మొదటి సినిమా అన్న బెరకు కనిపించలేదు. డైలాగ్ డెలివరీ కొంత మెరగుపరచుకోవలసి ఉంది. డాన్స్‌లు, ఫైట్‌లు భాగా చేశాడు. కానీ, నటనలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల ఛాయలు కనిపించాయి. వాటిని పోగొట్టుకొని సొంత స్టైల్‌ను అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రాంచరణ్ రెండవ సినిమా రాజమౌళితోనట. హింస, అశ్లీలతలపై ఆధారపడి పబ్బం గడుపుకొనే రాజమౌళి చేతిలో పడితే మాస్ మూసలో పడి ఇతని భవిష్యత్ కొట్టుకుపోవడం ఖాయం. ఇటువంటి దర్శకులను ఎన్నుకొనేబదులు, కథాబలం గల సినిమాలు తీస్తూ టాలెంట్ పుష్కలంగా గల “శేఖర్ కమ్ముల”, “చంద్ర శేఖర్ యేలేటి”, “శేఖర్ సూరి”, “చంద్ర సిధ్ధార్థ” లాంటి దర్శకుల చేతిలో పడితే ఇతని భవిష్యత్‌కు ఇంకా ఉపకరిస్తుందని నా అభిప్రాయం.                 

అంతగా ఆకట్టుకోలేకపోయిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

సిలికానాంధ్ర సంస్థ ప్రతీ సంవత్సరం ఆంధ్ర సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా నిన్న, అనగా అక్టోబర్ 6వ తారీఖున సాంస్కృతికోత్సవాన్ని జరుపుకుంది. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వివరాలలోకి వెళ్తే..

సిలికానంధ్ర సాంస్కృతికోత్సవాలకు ముఖ్య ఆకర్షణ కూచిపూడి నృత్యరూపకం. 2005లో “ఉషా పరిణయం”, 2006లో “ధృవ చరితం” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. ఎప్పుడూ కూచిపూడి నృత్యానికి పెద్దపీట వేసే సిలికానాంధ్ర ఈసారి ఎందుకో చిన్నచూపు చూసింది. “స్వరాభినయ సారస్వం” అనే కార్యక్రమం ఉన్నా, మొత్తం రంగస్థలం గాయనీగాయకులతో నిండిపోవడంతో, కూచిపూడి నర్తకీమణులకు నర్తించడానికి సరిపడినంత చోటు లేకపోయింది. గతంలో 45 నిమిషాలనుండీ గంట వరకూ కథాపరంగా, వివిధ సన్నివేశాలు, దానికి తగిన పరదాలు, హంగులు, సెట్టింగులతో సాగిన నృత్యరూపకాలతో పోలిస్తే, వివిధ త్యాగరాజ కృతులతో పది పది నిమిషాలుగా సాగిన కూచిపూడి నృత్యం ఎందుకో నన్ను అంత ఆకట్టుకోలేకపోయింది. “జగదానందకారకా..” అనే కృతి మాత్రం ఎంతో వీనులవిందుగా ఉంది.

ఈ సంవత్సర కార్యక్రమాల్లో మరో ముఖ్య కార్యక్రమం “జగమంత జనని”. తల్లి ప్రేమను మరోసారి అందరికీ గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఓలేటి పార్వతీశంగారు సాహిత్యం అందించిన ఈ సంగీత నృత్యరూపకంలో ఏడు విధాలైన తల్లిప్రేమను చూపించారు. జన్మనిచ్చిన తల్లి, పెంచిన తల్లి, గోమాత, బ్రాహ్మణి, గురుపత్ని, రాజమాత, భూమాత లలో మాతృత్వాన్ని హరివిల్లులోని ఏడు రంగులతో పోలుస్తూ కార్యక్రమం సాగింది. దృశ్యాపరంగా చూస్తే ఈ కార్యక్రమం ఎంతో బాగుంది. రంగస్థల ముందు భాగంలో చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే, వెనుక అమ్మ పాత్రలోని మహిళ, పాపను ఎత్తుకొని లాలించడం, ఆమెపై ఫ్లాష్‌లైట్ పడి, ఆ నీడ వెనుక పరదాపై పడడం, ఎంతో ఆకట్టుకొంది. అదేవిధంగా పిల్లలు నృత్యంచేస్తుంటే, వారి అమ్మలు వచ్చి వారిని ముద్దాడి గుండెలకు హత్తుకోవడం, ఇద్దరు పిల్లలు గోమాత రూపంలో వచ్చి నాలుగు కాళ్ళతో నర్తించడం, చివరిలో భారతీయ జెండాను ప్రదర్శించడం చాలా బావుంది. నిజానికి ఈ కార్యక్రమం జనాలను ఎంతగానో ఆకట్టుకొని ఉండాలి. కానీ సౌండ్ సిస్టం సమస్యో లేదా రికార్డింగ్ లోపమో తెలియదుకానీ, ఈ కార్యక్రమానికి ఆయువుపట్టయిన సాహిత్యం సరిగా వినబడనే లేదు. దానితో రావలసినంత ఫీల్ రాలేదు. వ్యక్తిగతంగా చూస్తే, గత సంవత్సరం జరిగిన “సరిగంచు చీర” కార్యక్రమం ఆకట్టుకొన్నంతగా ఈ కార్యక్రమం  ఆకట్టుకోలేకపోయింది.

ఇక హాస్య నాటిక విషయానికి వస్తే, చాయా చిత్రాన్నీ, రంగ స్థలాన్నీ కలిపి “ఛాయారంగం” కార్యక్రమంతో విన్నూత్న ప్రయోగం చేసినందుకు సిలికానాంధ్రను అభినందించాలి. వెనుక వీడియో క్లిప్పింగ్‌లో వస్తున్న పాత్రలను వాస్తవంగా భావిస్తూ, దానికి ప్రతిస్పందించడం పాత్రధారులకు కత్తిమీద సామే. దీనికి, వెనుక వీడియో క్లిప్పింగ్ నడుపుతున్నవారికీ, ముందు నటిస్తున్న వారికీ మధ్య ఎంతో సమన్వయం ఉండాలీ. లేకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. ఈ సాహస ప్రయోగంలో  చాలావరకూ సిలికానాంధ్రవారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. కానీ, ఇంత కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించినవారు కథాపరంగా తగిన శ్రద్ధ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. కథలో హాస్యంపాలు చాలా తక్కువగాను, చాలా సన్నివేశాలు అసహజంగాను ఉన్నాయి. క్రితం సంవత్సరం “బాబోయ్ సెల్‌ఫోన్” హాస్యనాటికతో పోలిస్తే “చాయారంగం” తేలిపోయిందనే చెప్పాలి.

ఇక మరో కార్యక్రమం జానపద నృత్యరూపకం “ధినాక్ ధిం ధిం”. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొన్న ఈ కార్యక్రమంలో హరిదాసు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, బావా మరదళ్ళ సరసాలతో కూడిన పాటలు, దంపుళ్ళ పాటలు ఇలా దాదాపు కనుమరుగైపోతున్న జానపద పాటలను గుర్తుచేసే ప్రయత్నం చేసారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తయారు చేసిన సెట్టింగులు, ఏనుగు బొమ్మ, ఎంతో ఆకట్టుకొన్నాయి. నర్తించినవారు కూడా ఆద్యంతం ఎంతో చలాకీగా, హుషారుగా నాట్యం చేసారు. కానీ ఈ కార్యక్రమంలోనూ సౌండ్ సిస్టం సమస్య వల్ల సాహిత్యం సరిగా వినబడకపోవడం లోటే.  

చివరిగా చెప్పుకోవలసినది “చాణక్య శపథం” నాటకం. చాణక్యుడిగా “దిలీప్ కొండిపర్తి” గారి అభినయం చాలా బాగుంది. ఆరంభంలో కొంత తడబడ్డా, చివరిలో ఏకబిగిన 4-5 నిమిషాలపాటు, ఆవేశంతో సాగే సంభాషణలను ఎంతో రక్తి కట్టించారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ రౌద్రాన్ని సూచిస్తూ ఎరుపు రంగులోకి మారటం ఎంతో ఆకట్టుకొంది. కానీ, ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతంగా కథని సంక్షిప్తంగా వివరించివుంటే ఇంకా బాగుండేదని అనిపించింది.

ఇక ప్రేక్షకులను అసహనానికి గురిచేసినవి కొన్ని ఉన్నాయి. ప్రతీ కార్యక్రమానికీ మధ్య దాతలను సన్మానించడం, లేక మేయర్లను సన్మానించడం, సిలికానాంధ్ర గొప్పతనాన్ని వివరించడం వంటివి విసుగు తెప్పించాయి. ముందు కార్యక్రమంలో పొందిన తృప్తి, ఆనందం వంటివి మధ్యలో వస్తూ ఉన్న ఈ విరామాలవల్ల ఆవిరయిపోయాయి. వీటిని కుదించి, ఒకేసారి కానిచ్చి ఉంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పేది. వీటిలో కూడా సమన్వయ లోపాలు కనిపించాయి. చెప్పిన విషయాన్నే మరల మరల ఇద్దరు ముగ్గురు చెప్పడం, పిలిచిన దాతలనే మరల పిలవడం, వారి పేర్లను తప్పుగా పరిచయం చేయడం, సన్మానించవలసిన వారి పేర్ల చిట్టా ముందుగా సిద్ధం చేసుకోక పోవడం, ఒక్కోసారి ఒక్క సిలికానాంధ్ర సభ్యుడు కూడా లేకుండా స్టేజిమీద అతిథులను వదిలివేయడం, ప్రేక్షకులను పదే పదేదే అడిగి చప్పట్లు కొట్టించుకోవడం, స్టేజీ కిందనుంచి స్టేజీ పైన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి సమాచారం పంపిస్తూ సమచారలోపాన్ని బహిర్గతం చేసుకోవడం, కార్యక్రమం చివరిలో కూడా వీడ్కోలు పలకాలా లేక గుర్తించవలసినవారెవరైనా మిగిలిపోయారా అన్న సందేహంలో ఉండిపోవడం ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యనిర్వహణాలోపాలు ఈసారి కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా పకడ్బందీ ప్రణాళిక కావాలి. అది ఈసారి ఎందుకో సరిగా జరగలేదు. గత సంవత్సరాలలో తాను నెలకొల్పుకొన్న ప్రమాణాలను తానే అందుకోలేకపోయింది ఈసారి సిలికానాంధ్ర. ఇక ఈ సారి కార్యక్రమాల్లొ, గతసారి జరిగినట్లుగా ఏ తెలుగు ప్రముఖులనీ సన్మానించుకోలేకపోవడం కూడా ఒక లోటే.