ఈ సినిమాను నేను గత వారమే చూసాను. ఈ మధ్య హాస్యం ముసుగులో వచ్చే ద్వంద్వార్థ సంభాషణల సినిమాలనీ, సందేశం పేరుతో వచ్చే హింసాత్మక సినిమాలనీ, భక్తి పేరుతో వచ్చే అశ్లీల చిత్రాలనీ చూసి విరక్తి కలిగి కొన్నాళ్ళు తెలుగు సినిమాలనుంచీ విశ్రాంతి తీసుకొన్నాను. కానీ ఈ సినిమాకి వచ్చిన మంచి సమీక్షలు చదివి, అప్పటికీ అంతగా నమ్మకం లేకపోయినా, ఒక రాయి విసిరి చూద్దామన్న ఉద్దేశ్యంతో వెళ్ళిన నన్ను ఈ సినిమా నిరాశ పరచలేదు. పైగా చాలా కాలానికి ఒక చక్కటి కుటుంబ హాస్య కథా చిత్రాన్ని చూసిన అనుభూతి మిగిల్చింది.
ఇక కథ విషయానికి వస్తే సాదాసీదా కథే.. ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకోవడం.. ప్రియురాలు ప్రియుడి ఇంటికి అతిథిగా వచ్చి ప్రియుడి తల్లితండ్రులనీ, అతడి కుటుంబ సభ్యులనీ తన ప్రవర్తనతో ఆకట్టుకోవడం.. ఆ తరువాత ప్రియుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని నయానో, భయానో, యుక్తితోనో, పట్టుదలతోనో ఒప్పించడం వంటి కథాంశం మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ‘మైనే ప్యార్ కియా..’, ‘దిల్‌వాలే..’, ‘నిన్నే పెళ్ళాడతా..’ కాలం నుంచీ.. ఈ మధ్య వచ్చిన ‘నువ్వొస్తానంటే..’, ‘చందమామ’ వంటి సినిమాల వరకూ కొంచెం అటూ ఇటూగా ఇలాంటి కథలే.. అటువంటి మూస కథనుకూడా జనాన్ని మెప్పించగలిగేలా చిత్రీకరించడంలో స్క్రీన్‌ప్లే చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా హాస్య, వినోద ప్రథానంగా చిత్రీకరించడంతో చక్కని నవ్వులు పండించగలిగారు.
సినిమా ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. హీరో హీరోయిన్లు అడవిలోకి పారిపోవడం, అక్కడ ప్రేమలో పడడం వంటి సన్నివేశాలు ‘క్షణక్షణం’, ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక హీరోయిన్ అమెరికా వెళ్ళిపోవాలనుకోవడం, పాస్‌పోర్ట్ వచ్చేంతవరకూ హీరో తన ఇంటిలో ఆశ్రయం కల్పించడం వంటివి ‘ఒక్కడు’ సినిమాను పోలి ఉన్నాయి. ఈ విధంగా ప్రథమార్థం మరీ గొప్పగా లేకున్నా, బోర్ మాత్రం కొట్టించలేదు. అడవిలో వచ్చే ఒక ఫైట్‌ను బాగా చిత్రీకరించారు.
సినిమా ద్వితీయార్థం వచ్చేసరికి వేగం పుంజుకొంటుంది. అందుకు ముఖ్యకారణంగా బ్రహ్మానందం పోషించిన ‘మెక్‌డవల్ మూర్తి ‘ పాత్రను చెప్పుకోవాలి. ద్వితీయార్థం సగభాగం వరకూ అసలు నిజం తెలియక, జరుగుతున్న నాటకంలో తనో పావుగా వాడుకోబడుతున్నానన్న విషయం గ్రహించలేక, తనకేదో అతీంద్రీయ శక్తులున్నట్టుగా భ్రమలో బతికే సన్నివేశాలు ఒక ఎత్తయితే… అసలు విషయం గ్రహించి, మింగలేక, కక్కలేక, తను ఎంత బయటకు రావాలంటే అంతకు మరింత ఊబిలో కూరుకొని మథనపడే పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రను ‘డీ’ సినిమాలోని ‘చారి’ పాత్రకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైన తేడా అల్లా ‘డీ’ లో అతని పాత్ర లేకున్నా కథాగమనానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ ఈ సినిమాలో అతని పాత్ర లేకుండా కథే ముందుకు నడవదు. అంతటి ముఖ్య పాత్రను అవలీలగా పోషించి తనకు తనే సాటి అని మరోసారి నిరూపించుకొన్నాడు.
ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే హీరో రాం చక్కటి ఈజ్ తో నటించాడు. డ్యాన్స్‌లు, ఫైట్‌లతో పాటు చక్కటి హావభావాలను కూడా పలికించగలిగాడు. కానీ ఇతని నటనపై ‘పవన్ కళ్యాణ్’ ప్రభావం చాలా చోట్ల కనిపించింది. అది పోగొట్టుకొని సొంత శైలిని అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ‘జెనీలియా’కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అయిపోయినట్టున్నాయి. ఆమె మొదటి సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణతి సాధించినట్టే చెప్పుకోవాలి.
ఇక శాస్త్రీయ నృత్యం నేర్చుకొంటూ, ఆ క్రమంలో తన మగలక్షణాలు కోల్పోయి ఆడంగి వేషాలు వేసే పాత్రలో సునీల్, హీరో హీరోయిన్లకు లిఫ్ట్ ఇచ్చి ఆపై విలన్లకు దొరికిపోయి చివరి వరకూ వారి గొడ్లచావడిలో బందీగా పడిఉండే పాత్రలో ధర్మవరపు చక్కగా ఇమిడిపోయారు. ఫ్యాక్షనిస్టు సోదరులుగా అటు విలనీని, ఇటు హాస్యాన్ని సమపాళ్ళలో పోషించగలిగే కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి లను ఎంచుకోవడం పాత్రల ఎంపికపై దర్శకుడు పెట్టిన శ్రద్ధను చూపుతుంది. వీరి కొడుకులుగా నటించిన ‘షపీ’, ‘రవితేజ తమ్ముడు’ పాత్రలు కొంత విలనీని సృష్టించేదుకు తప్ప అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు. ‘చికాగో సుబ్బారావు’ గా నాజర్, ‘డల్లాస్ నాగేశ్వరరావు’ గా తనికెళ్ళ భరణి బాగానే నటించారు.
ఈ సినిమాలో మరో హాస్య ప్రధాన పాత్ర.. జయప్రకాష్ రెడ్డి మనవడై తాతగారి అడుగుజాడల్లో నడిచి పెద్ద ఫ్యాక్షనిష్టు అయిపోవాలని బిల్డప్పులిచ్చే పిల్లవాడి పాత్ర. ఈ పిల్లవాడిని ‘పంచత్రంత్రం’ సినిమాలో మొట్టమొదటిగా ‘హార్టులో హోళు ‘ ( hole in the heart ) ఉన్న మళయాళం అబ్బాయి పాత్రలో చూసినప్పుడే ఎంతో ఆకట్టుకొన్నాడు. చక్కటి టైమింగ్, హావభావాలు పలికించగలిగే ఈ పిల్లవాడు భవిష్యత్తులో మరింత పెద్ద కమెడియన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
ఈ విధంగా సినిమాలో ప్రతీ పాత్ర దానికై ఒక ప్రాధాన్యతను కలిగి ఉండి, అదే సమయంలో కథలో ఇమిడిపోయి, తనవంతుగా కథనాన్ని రక్తికట్టించడంలో తోడ్పడడంతో ద్వితీయార్థం మొత్తం నవ్వుల జల్లు కురిసి చక్కటి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు.
ఇక సంభాషణల విషయానికి వస్తే చాలా చోట్ల హాస్యాన్ని పండించడంలో తోడ్పడ్డాయి. చివరిలో ‘వాళ్ళు మనల్ని మోసం చేయలేదు.. మనుషుల్ని చేసారు..’ వంటి సెంటిమెంట్ సంభాషణలు కూడా సన్నివేశానికి అనుగుణంగా బాగున్నాయి. సంగీతం విడిగా అంత గొప్పగా లేకున్నా, సినిమాలో సందర్భానుసారంగా చూస్తే బాగున్నట్టే చెప్పాలి.
మొత్తం మీద ఒక రెండున్నరగంటల సేపు అన్నీ మరచిపోయి సరదాగా కుటుంబంతో నవ్వుకొని రావాలంటే మిస్ అవ్వకుండా తప్ప చూడాల్సిన సినిమా ‘రెడీ’. మరెందుకు ఆలస్యం.. పోయి చూసి రండి..!!
కొసమెరుపు: ఇంతటి చక్కటి టాలెంట్ ఉన్న దర్శకుడు ‘శ్రీను వైట్ల ‘, చిరంజీవి లాంటి స్టార్‌హీరోతో ‘అందరివాడు ‘ లాంటి పరమ చెత్త సినిమాను ఎలా తీసాడో తలచుకొంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది..!!