దీపావళి వచ్చేసింది.. చిన్ననాటి జ్ఞాపకాలను వెంట తెచ్చేసింది.. దీపావళి.. నాకు అన్నింటికన్నా ఇష్టమైన పండగ. జీవితంలో ఎన్నో మధురానుభూతులను అందించిన పండగ. చిన్నప్పుడు మా ఊరిలో ఈ పండగ వస్తోందంటే మేం చేసే హడావిడి అంతా ఇంతా కాదు..
దీపావళి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది బాణసంచా.. మా చిన్నప్పుడు ఇప్పటిలా బాణసంచా కొట్లలో రెడేమేడ్‌గా కొనేవారు కాదు. ప్రతీ ఇంట్లోనూ చిన్న పెద్దా తేడాలేకుండా ఎవరికివారే బాణాసంచా తయారుచేసుకొనేవారు. ఇక కుర్రకారు హడావిడి అయితే నెలరోజుల ముందే మొదలయిపోయేది. మేము చిన్నప్పుడు ఇష్టపడి తయారుచేసిన బాణసంచా.. “సిసింద్రీలు”..!!
ఒక అంగుళం పొడుగులో సన్నగా శంకువు ఆకారంలో నల్లటి మందు నింపి ఉన్న కాగితపు గొట్టమే సిసింద్రీ. దీని తోకభాగాన్ని కొద్దిగా చింపి, నిప్పు అంటించి వదిలితే.. 5-10 సెకన్లపాటూ అది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇది తయారు చేసే విధానం చాలా సులువు కావడం, పడ్డ కష్టానికి ఎన్నో రెట్లు మజా రావడం, మిగిలిన వాటితో పోలిస్తే ప్రమాదం కలిగే అవకాశం తక్కువ కావడం వల్ల చాలామంది కుర్రకారు వీటిని తయారుచేసేవారు.
ఈ సిసింద్రీ గొట్టం తయారీకి ముఖ్యంగా కావలసింది..కాగితం, కొన్ని అన్నం మెతుకులు, ఒక ఈనుప్పుల్ల. దినపత్రికల కాగితాలనుంచీ సోవియట్ కాగితాలవరకూ ఎవరి స్తోమతకు తగ్గ కాగితాన్ని వారు ఉపయోగించేవారు. దళసరి కాగితం అయితే మందు దట్టించడానికి వీలుగా ఉండడమే కాక, సిసింద్రీ చేతిలో చీదే అవకాశాలు తక్కువ. ముందుగా కాగితాన్ని సుమారు 2X2 అంగుళాల చతురస్రాకారంలో కత్తిరించొకొని, ఒక ఈనుప్పుల్లను ఆ కాగితం అంచులో ఉంచి, ఒకవైపు నొక్కి పట్టుకొని, మరోవైపు పుల్లతో పాటుగా కాగితాన్ని తిప్పుకొంటూ పోతే గొట్టం అకారం తయారవుతుంది. కాగితం అంచుల్ని జాగ్రత్తగా అన్నం మెతుకుల జిగురుతో అతికించి, సన్నటి కొనని కొద్దిగా మడిస్తే గొట్టం తయార్..!!
ఇలా తయారయిన గొట్టాలను తడి ఆరేవరకు ఎండబెట్టిన తరువాత మందుకూరడానికి వాడుకోవచ్చు. సిసింద్రీకి దళసరి కాగితం, సన్నని ఆకారం ఎంత ముఖ్యమో, నాణ్యత గల మందు అంతే ప్రధానం. అందుకే కొంచెం ఖరీదైనా మంచిరకం మందునే కొనేవాళ్ళం. ఈ మందును సూరేకారం, గంధకం కలిపి తయారు చేస్తారని జ్ఞాపకం. మంచిరకం మందును ఎండలో పెడితే మెరుపు కనిపించాలి, లేకుంటే బొగ్గుపొడి కలిసి కల్తీ జరిగినట్టు లెక్క. అలాగే కొనేముందు కొంత మందును మండించి సంతృప్తి చెందితే కానీ కొనేవాళ్ళం కాదు. ఈ మందును కొంతసేపు ఎండలో ఉంచి గొట్టాలను నింపడానికి వాడుకోవచ్చు. గొట్టంలో కొద్దికొద్దిగా మందు నింపుతూ, ఈనుప్పుల్లతో దట్టించాలి. ఇలా 4-5 దఫాలుగా గొట్టాన్ని 90% వరకూ నింపి, మిగిలిన ఖాళీని మందు కారిపోకుండా మూయడానికి ఉపయోగించాలి. ఇలా తయారైన సిసింద్రీని చూపుడువేలు, బొటనవేలు మధ్య నొక్కి చూస్తే గట్టి రాయిలా ఉండి, రెండువైపులా మందు కారిపోకుండా ఉంటే నాణ్యత బాగున్నట్టు లెక్క.
ఈ మాత్రం కష్టం కూడా పడకుండా సిసింద్రీని ఆస్వాదించాలనుకొనే వారికి వీలుగా కొంతమంది కుర్రకారు సిసింద్రీ వ్యాపారాన్ని చేసేవాళ్ళు. ఖాళి గొట్టాలనుంచీ, కూరిన సిసింద్రీలవరకూ 50-100 చొప్పున అమ్ముకొని లాభాలతో పాకెట్ మనీ సంపాదించుకొనేవారు. అప్పట్లో 100 సిసింద్రీలు ఖరీదు 3-4రూ|| ఉండేది.
ఇక ఈ సిసింద్రీలను అంటించడానికి కొంతమంది అగరొత్తులను ఉపయోగించినా, సరైన సాధనం మాత్రం “చాంతాడు”. లావుగా, బలంగా ఉండి నూతినుంచి చేదను పైకి లాగడానికి ఉపయోగించే ఈ చాంతాడు ముక్కను ఒకవైపు వెలిగిస్తే ఇక అది ఆరిపోయే సమస్యే లేదు. ఒక చేత్తో తాడును పట్టుకొని, మరో చేతిలో సిసింద్రీ తీసుకొని, నోటితో దాని కొసను కొరికి, కొద్దిగా మందు బయటకు వచ్చేలా చిదిమి, తాడుతో అంటిస్తూ, ఒకవేళ వెంటనే అంటుకోకుంటే నిప్పురాజుకొనేలా నెమ్మదిగా నోటితో ఊదుతూ, అంటుకొన్నాకా ఒక సెకను లాగేవరకూ వేచిచూసి నేర్పుగా వదిలితే… రకరకాల మెలికలు తిరుగుతూ అది చేసే విన్యాసాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు..!!
ఈ సిసింద్రీలను చొక్కా, లాగూల జేబుల్లో నింపుకొని సాయంత్రం 6-7 గంటలకు రోడ్డెక్కితే మరల 9-10 గంటలకి కడుపు మాడేవరకూ వళ్ళు తెలిసేది కాదు..!! ఈ సిసింద్రీ మందుతో నల్లగా మాసిన చొక్కాలు, లాగూలు ఉతకలేక ఆడవాళ్ళ తల ప్రాణం తోకకొచ్చేది. ఇక రోడ్ల మీద తిరిగే వారుకూడా దీపావళి వచ్చిందంటే ఎంతో జాగురూకతతో నడిచేవారు. “స్..స్..” మని శబ్దం వినిపించగానే ఎలర్ట్ అయిపోయేవారు. అయినప్పటికీ ఏ సైకిల్ మీద వెళ్ళేవాడి లుంగీలోనో దూరడం, వాళ్ళు తిట్లు లంకించుకోవడం, మేం ఏ సందులోకో దూరి పారిపోవడం జరిగిన సందర్భాలు అనేకం.
ఈ సిసింద్రీల విషయంలో చాలా పందేలు కూడా జరిగేవి. ఒకసారి బాగా మెత్తగా ఉన్న సిసింద్రీ వేయమని నా స్నేహితుడు పందెం కడితే పౌరుషానికి పోయి అంటించానో లేదో.. చేతిలో అడ్డంగా చీదేసింది..!! అంతే అందరూ ఒక్కసారి ఇళ్ళకు పరార్..!! ఎప్పుడూ హుషారుగా ఇంటికొచ్చే నేను పిల్లిలా నడుచుకుంటూ రావడం చూసి మా అమ్మకు అనుమానం వచ్చేసింది. నేను ఏదో సర్దిచెప్పి గాయం మీద రాయడానికి ఇంకు బాటిల్ గురించి వెతికి వెతికి కనిపించక చివరికి అమ్మనే అడగాల్సి వచ్చింది. విషయం కనిపెట్టిన అమ్మ నా వీపుమీద నాలుగు ఇచ్చుకోవడం, నాన్నగారు ఆయింట్‌మెంట్ రాయడం ఇప్పటికీ మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకం..!!
ఇక్కడే మరో విషయం కూడా గుర్తుకువస్తోంది. మా స్కూల్లో K.G.K గారని ఒక మాష్టారు ఉండేవారు. ఆయన తన ఇంట్లోనే సిసింద్రీ మందు, పటాసు తయారుచేసేవారు. ఆయన మందంటే చుట్టుపక్కల ఊర్లన్నింటిలోనూ పెద్ద పేరు. అటువంటి ఆయన ఇంట్లో ఒక సంవత్సరం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు ముగ్గురు చనిపోయినట్లు కూడా గుర్తు. లైసెన్సు లేకుండా బాణసంచా తయారు చేయడంవల్ల పోలీసులు ఆయన్ను అరెస్టి కొన్ని రోజులు జైల్లో పెట్టారు. జరిగిన ప్రమాదంలో ఆయన తప్పు ఎంతున్నా, మా కుర్రకారుకు మాత్రం ఆయన్ను జైల్లో పెట్టడం ఎంతో విషాదాన్ని కలిగించింది.
ఇక సిసింద్రీలే కాక, మతాబులు, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు, పేక టపాకాయలు, తారాజువ్వలు, తిప్పుడు పొట్లాలు లాంటివెన్నో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళం. ఇప్పుడు మా వూరిలోనే ఏ కొద్దిమందో తప్ప వీటిని తయారుచేయడం చూడట్లేదు..!!