తెలుగు ఉచ్ఛారణ లో ధర్మ సందేహాలు..!!

ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. చదవడానికి సిల్లీగా అనిపిస్తాయని ఇన్నాళ్ళూ బ్లాగలేదు కానీ, ఇక ఆగలేను. తెలుగులో మూడు పదాల ఉచ్ఛారణలో నాకు ఎప్పుడూ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అంతకీ నా చుట్టుపక్కల కొంతమందిని అడిగినా ఎవరూ సంతృప్తికరంగా నివృత్తి చేయలేకపోయారు. మన బ్లాగుగుంపునుంచీ ఎవరైనా ఆ పని చేయగలరని ఆశతో..

1. బ్రహ్మ Vs బ్రమ్హ: నవ్వుకోకండి..!! మనలో చాలామంది తెలుగులో రాసేటప్పుడు “బ్రహ్మ” అని రాసినా, ఉచ్ఛరించేటప్పుడు “బ్రమ్హ” అని ఉచ్ఛరిస్తారు. చాలామంది దగ్గిర గమనించే ఇది రాస్తున్నాను. మరీ ముఖ్యంగా “ప్రరబ్రహ్మ”, “బ్రహ్మానందం”, “బ్రహ్మాండం”, “సుబ్రహ్మణ్యం” లాంటి పదాల ఉచ్ఛారణలో ఇది ఎక్కువగా గమనించాను. ఏదో టీవీలో న్యూస్‌రీడర్ల వద్ద అయితే ఎక్కువ పట్టించుకోకపోదును. కానీ, “బాల సుబ్రహ్మణ్యం”, “బాల మురళీకృష్ణ” లాంటి ప్రముఖ గాయకుల గాత్రాలలో కూడా ఇది గమనించాను. నా దృష్టిలో మాత్రం “బ్రహ్మ” అని ఉచ్ఛరించడమే సరిఅయినదని అభిప్రాయం. మీలో ఎవరైనా ఈ విషయాన్ని గమనించారా..? మీరు ఏమని ఉచ్ఛరిస్తారు..? మీ అభిప్రాయం ఏమిటి..?

2. కథ Vs కధ: నేను చిన్నప్పుడు తెలుగు రాయడం నేర్చుకొంటున్నప్పుడు, “కథ” కి పొట్టలో చుక్క పెట్టాలని నెత్తిపై మొట్టి మరీ చెప్పేవారు. కానీ ఉచ్ఛరించేటప్పుడు మాత్రం “కధ” అని పలికినా ఏమీ అనేవారు కారు. ఇప్పటికీ నేను “కధ” అనే చాలాసార్లు ఉపయోగిస్తాను. ఇంతకీ సరీయిన ఉచ్ఛారణ ఏమిటి..?

3. ఫలం (Phalam) Vs ఫలం (fhalam): వీటి మధ్య తేడాను వ్యక్తీకరించడానికి ఆంగ్లంలో రాయవలసి వచ్చింది. రాసేటప్పుడు ప, ఫ, బ, భ, మ లలో వత్తు “ఫ” ను ఉపయోగించినా, పలికేటప్పుడు ఆంగ్లంలోని “F” ను ఉపయోగిస్తూంటాము. నేను కూడా సాధారణంగా ఇదే చేస్తాను. కానీ ఇది సరి అయినదేనా..?

మీలో ఎవరికైనా పైన చెప్పిన మీమాంస తలెత్తిందా..? మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ..