“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది.

ఈ పుస్తకంలో రకరకాలైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అనుభవాలు రచయిత విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు, వాటిని ఆయన పరిష్కరించిన విధానం, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు, వీటికి సంబంధించినవి అయితే, మరికొన్ని అనుభవాలు ఆయన పదవీకాలంలో అగుపడ్డ విచిత్రమైన, హేతువుకు అందని సంఘటనలు. వీటితో పాటుగా, T.T.D పై ఆ నాటి రాజకీయ నాయకుల ప్రభావం, కార్యనిర్వహణ అధికారికికి గల విశేష అధికారాలు, వాటికి గల పరిమితులు మొదలైనవి కూడా చక్కగా వివరింపబడ్డాయి.

తిరుమలలో 1978-82 మధ్య జరిగిన అనేక రకాలైన అబివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు, వాటి వెనుక ఉన్న కృషీ, నిబద్ధతా, అమలు జరుపబడ్డ పటిస్టమైన ప్రణాళికలూ  ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది తిరుమలలలో అమలుజరపబడ్డ మాస్టర్ ప్లాన్ వివరాలు.  అక్రమ కట్టడాల కూల్చివేత, సన్నిధి వీధి విస్తరణ, అధునాతన క్యూ కాంప్లెక్స్, ఆస్థాన మండపం, గెస్ట్‌హవుస్‌లు, భోజన శాలలు, కల్యాణకట్టల నిర్మాణాల సమయంలో ఎదురైన అనుభవాలు, స్థానికుల వ్యతిరేకత, వాటిని అధిగమించిన విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.  తిరుమలలో ధ్వజస్థంభం పుచ్చిపోతే, ఆ స్థానంలో కొత్త ధ్వజస్థంభ ప్రతిష్టాపనకై ఆగమ శాస్త్ర ప్రకారం కొమ్మలు, తొర్రలు లేని ఎత్తైన చెట్లకై సాగిన అన్వేషణ,  చివరకు అవి కర్ణాటకలోని అడవుల్లో లభ్యం కావటం, వాటిని అతి కష్టం మీద తిరుమలకు చేర్చడం వంటి వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తిరుమలలో ఏడవ నంబరు మైలు రాయి వద్ద నడక దారిలో జరిగిన స్త్రీ హత్య వివరాలు, ఆ తరువాత నడకదారిలోని ప్రయాణికుల భద్రత పెంచడానికి T.T.D తీసుకొన్న చర్యలు, వాటితో పాటుగా ఆంజనేయ స్వామి ఎత్తైన విగ్రహాన్ని అదే మైలు రాయి వద్ద ప్రతిష్టించడం వంటి వివరాలు ఆలోచింపచేస్తాయి. ఇక పెద్ద కళ్యాణోత్సవం సమయంలో వృధా అయ్యే పూజా ద్రవ్య వివరాలు, ప్రసాదం తయారీలో ఉన్న ఇబ్బందులు, ఆలయంలోని వివిధ మిరాసీదార్ల లాభాపేక్ష, ప్రత్యేక కళ్యాణోత్సవం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఒకప్పుడు 12 గంటలకు పైగా పట్టే ధర్మ దర్శనం సమయాన్ని క్రమంగా గంట, రెండు గంటలకు కుదించగలిగిన వైనం, వాటికై అమలుపరిచిన ప్రణాళికలు అబ్బుర పరుస్తాయి.

తిరుమలకు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేయవలసిన V.I.P దర్శన ఏర్పాట్లు, కల్పించవలసిన భద్రత, సిబ్బందికి చూపించవలసిన వసతి సదుపాయాలు, ఆ క్రమంలో సాధారణ భక్తులు పడే ఇబ్బందులు, వాటికి పరిష్కారంగా నిర్మింపబడ్డ “పద్మావతీ గెస్ట్‌హవుస్”, ఆ నిర్మాణ సమయంలో T.T.D పై వచ్చిన ప్రజాధన దుర్వినియోగ ఆరోపణలు వంటి విషయాలు చక్కగా వివరింపబడ్డాయి.

ఇక రచయితకి ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలకు వస్తే, తిరుమలలో 1978లో వచ్చిన తీవ్రమైన కరవు, నీటి కొరత, ఆ సమయంలో మూడురోజుల పాటు జరిపిన వరుణ జపం, అది పూర్తయిన వెంటనే కురిసిన కుండపోత వాన వంటి వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. శ్రీనివాసుని భక్తులకు పూర్తి నేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించే ప్రయత్నంలో వెడల్పుగా వుండే నామాన్ని చిన్నది చేయడం, ఆ తరువాత జరిగిన పర్యవసానాలు గగుర్పాటును కలిగిస్తాయి. ప్రతీ ఏటా తమిళనాడులోని శ్రివిల్లి పుత్తూరులోని గోదాదేవి కళ్యాణానికి తిరుమలనుంచీ పట్టుచీరను పంపే సాంప్రదాయం పుట్టుకకు సంబందించి రచయితకు ఎదురైన అనుభవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతే కాక రచయిత T.T.D కార్యనిర్వహక శాఖను తీసుకోవడానికి మొదట ఆయిష్టత కనపరచడం, ఆ తదుపరి ఎదురైన అనుభవాలు, పదవీకాలం చివరలో ఎదురైన అనుభవాలు మొదలుగునవి శ్రీనివాసుని భక్తులను ఆకట్టుకొంటాయి.

వీటితో పాటుగా, హిందూ ధర్మ పరిరక్షణకై T.T.D చేసిన విశేష కృషి, రామకృష్ణ మఠ నిర్మాణంలో పాత్ర, అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడం, ఆ క్రమంలో ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం, దాససాహిత్య ప్రాజెక్టు మొదలైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అదే విధంగా చెన్నారెడ్డి, వెంగళరావు, అంజయ్య, ఎన్.టి.ఆర్ వంటి ముఖ్య మంత్రులతో పనిచేసిన అనుభవాలు, వారి ఆగ్రహ ఆవేశాలకు లోనయిన సందర్భాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వివరాలు, ఇంకా మరెన్నో ఉన్నాయి.

మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి. అందుకే వీలు కుదిరితే తప్పక చదవండి. ఒకవేళ మీరు ఇప్పటికే చదివి ఉంటే మీ అభిప్రాయాలను పంచుకోండి.