న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

నిన్ననే హైదరాబాద్‌లో జరిగిన ఫ్లైఓవర్ దారుణం టివిలో చూసాను. బాధితుల మృతదేహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. దానికంటే కలచివేసిన దృశ్యాలు ఏమిటంటే ఆ మృతదేహాలను కెమెరాలలో బంధించడానికి రిపోర్టర్లు పడుతున్న ఆతృత. జరిగిన దారుణాన్ని ఎంత తొందరగా ప్రసారం చేసి తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవాలనే ఆశ తప్ప, జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఒక చేయివేసి సాయం అందించాలనే తపన ఒక్కరిలోనూ కనబడలేదు. శిధిలాలలో మూల మూలలకు వెళ్ళి, తమ ప్రాణాలకు సైతం తెగించి, కాళ్ళు, చేతులు నలిగిన వారిని, తలలు చితికిన వారిని ఫొటోలలోనూ, వీడియోలలోనూ ప్రేతకళ ఉట్టిపడేలా చిత్రీకరించి పండుగ జరుపుకున్నారు మీడియా వారు. వీరికీ, శవాలను పీక్కు తినే రాబందులకు పెద్ద తేడా ఏముంది..? సంఘటన జరిగిన నాలుగు గంటలకు గానీ అధికార యంత్రాంగం స్పందించలేదని పత్రికలలో వచ్చింది. ఊరికి ముందరే సంఘటనా స్థలంలో ప్రత్యక్షమైపోయే మీడియా వారందరూ తలా ఒక చేయి వేసిఉంటే కొంతమంది ప్రాణాలయినా కాపాడగలిగే వారు కాదా..?

ఇలా బాధపడుతూ, కొంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ప్రతీ ఆదివారం జెమిని చానల్లో ప్రసారమయ్యే “అమృతం” అనే హాస్య ధారావాహిక చూద్దామని కూర్చున్నాను. సరిగా నా మనసులో ఉన్నదే ఆ ధారావాహిక లోని ముఖ్యాంశం. అందులో 24 గంటల పాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్ళ తీరుపై సునిశితమైన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చూసిన వెంటనే హాస్యం జనించినా, కొద్ది ఆలోచిస్తే, నిజమే కదా అని అనిపించేలా ఉన్నాయి అందులో సన్నివేశాలు. మచ్చుకు రెండు చెప్తాను.

“అమృతం”, “ఆంజనేయులు” ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారు. ఒక రోడ్డుపై ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు చివరే ఒక పెద్ద లోయ. ఒక టివి ఛానల్ యాంకర్ అక్కడ కాపు కాచుకుని ఏ వాహనం ఆ మలుపు తీసుకొంటుందా అనిచూస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాహనం మలుపు తీసుకోవడం, ఆ లోయలో పడడం, ఆ యాంకర్, ప్రభుత్వాన్నీ, రోడ్డు మరియు భవనాల శాఖ పనితీరుని దుయ్యబడుతూ ఉండటం, ఇలా సాగిపోతూ ఉంటుంది ఆ ఛానల్లోని ప్రసారం. దీని బదులు “ఇటు వైపు పోరాదు” అని ఆ ఛానల్ వారే బోర్డు పెడితే బావుండేది కదా అని ఆక్రోశిస్తాడు అమృతం. 

మరో సన్నివేశంలో, ఒక రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి చేరుకొన్న ఒక న్యూస్ చానల్ వారు,అక్కడ కొన ఊపిరితో కొట్టుకొంటున్న ప్రయాణీకుడిని చూపి, “ఇతను మరణిస్తాడా..? లేదా..? మీ సమాధానం మాకు SMS చేయండి” అంటూ ఒక పోటీని నిర్వహిస్తారు. ఇది చూసి అమృతం నివ్వెర పోతాడు.

ఇలా ఎన్నో వ్యంగ్యాస్త్రాలతో సాగిపోయింది ఈ వారం “అమృతం” ధారావాహిక. నా మనసులోని భావాలను దృశ్యరూపంలో ఆవిష్కరించిన ఆ ధారావాహికా బృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే పెళ్ళాడుతా” లాంటి సినిమాలు విజయవంతమవడానికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్లు కూడా కామెడీ పండించడం. ఈ సినిమా కథ ప్రకారం దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, నవదీప్, రెండో హీరోయిన్ వేసిన వెర్రి వేషాలను కామెడీ అని భావించేంత సహృదయం నాకు లేదు.

ఇక ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం వివరిస్తాను. హీరోయిన్ కాజల్, హీరో నవదీప్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రాత్రి హీరోయిన్ తప్పతాగి హీరో ఇంట్లో నిద్ర పోతుంది. పొద్దున్న లేచి చూసేసరికి, వంటి మీద వేరే దుస్తులు ఉంటాయి. రాత్రి ఏం జరిగిందని అడిగితే, హీరో కొంటె నవ్వు నవ్వుతూ “ఏం జరిగిందో నీకు తెలియదా..?” అంటాడు. ఎక్కడో చూసినట్టుందికదూ..? “దిల్‌వాలే..”, “బావగారూ బాగున్నారా..” లాంటి సినిమాలనుండి అరగగొట్టి పారేసిన ఈ సీనే ఈ సినిమాలోని కీలక సన్నివేశం. దీన్ని బట్టి మిగిలిన కథ ఎంత గొప్పగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం సాగదీతగానే అనిపించింది. ప్రారంభంలో భారతదేశ గొప్పతనంపై వచ్చే సన్నివేశాలు, నాగబాబు కూతురు కాజల్ కి పెళ్ళికొడుకును వెతికే సన్నివేశాలు, నవదీఫ్ కాజల్‌ను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బతిమాలే సన్నివేశాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో..

ఇక ఈ సినిమా ముఖ్య విషయంలోనే లోపం ఉంది. హీరోయిన్ కాజల్, తండ్రికి జరిగిన విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదని తెలిసినా చివరివరకూ సా..గదీసి, క్లయిమాక్స్ లో చెప్పడం చూసి “ఇదేదో ముందే చెప్పి తగలడుంటే మాకీ మూడు గంటల నరకం తప్పేదిగా..” అని సగటు ప్రేక్షకుడు బాధ పడితే తప్పేమీ లేదు.

రొటీన్ తెలుగు సినిమాలలోలాగానే పతాక సన్నివేశంలో ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకొంటారో ఒక పెద్ద సస్పెన్సు అయినట్టు బిల్డప్పు, ఉన్నట్టుండి ఆహుతి ప్రసాద్ చిన్న సైజు విలన్‌గా మారిపోవడం, నాగబాబు ప్రేక్షకులు అందరివైపుకీ తిరిగి, ఆడపిల్లల మనస్తత్వం తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదంటూ క్లాసు పీకడం.. అన్నీ మూస సినిమాను తలపించాయి. ఉన్నంతలో శివ బాలాజీ, కాజల్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది.

ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయానికి వస్తే, ఇంతకంటే చెత్త సినిమాలు ఎన్నో (ఉదాహరణకు “వసంతం”, “లక్ష్మీ”, “నేనున్నాను” వంటివి) కుటుంబ, మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఘన చరిత్రను చూసాను కాబట్టి, ఈ విషయాన్ని కాలానికే వదిలేస్తున్నాను. కొసమెరపు ఏమిటంటే.. నాతో పాటూ సినిమాకు వచ్చిన నా భార్య “సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు కదా..” అని అనటం..!!

  

“చక్ దే ఇండియా..” – ఒక మంచి చిత్రం

నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత భావాలను చక్కగా పలికించాడు. ముఖ్యంగా అతని వయసుకు తగ్గ పాత్రలో రాణించాడు. గత కొన్ని చిత్రాలలో కొంత వయసు మీద పడ్డట్టు కనిపించినా, ఈ చిత్రంలో మాత్రం అందంగా కనిపించాడు. “స్వదేశ్” చిత్రం తరువాత ఇది అతనికి మరో మంచి చిత్రం అవుతుంది.

ఇక కథాంశానికి వస్తే, ప్రస్తుత భారతదేశ క్రీడాచిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిందీ చిత్రం. భారతదేశంలో క్రికెటేతర క్రీడలకు కరువవుతున్న ప్రోత్సాహం, ఆదరణ, ముఖ్యంగా జాతీయ క్రీడ “హాకీ” కి పట్టిన దుస్థితి, మహిళా క్రీడాకారులపై చులకనాభావం, సెలెక్షన్ ప్రక్రియలోని లోపాలు, బోర్డు సభ్యుల రాజకీయాలు, క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా కాక, రాష్ట్రాల వారీగా ఎంపిక చేయటం, మహిళలకు కుటుంబ సభ్యులనుండి, సమాజం నుండి తగిన ప్రోత్సాహం లేక పోవడం, క్రీడాకారులలో అనైక్యత, సమిష్టి తత్వం, పోరాట తత్వం కొరవడడం,  క్రికెట్ పై ఉన్న మోజు జనానికి ఇతర క్రీడలపై లేక పోవడం, క్రీడాకారులకు లభిస్తున్న అరకొర సదుపాయాలు, క్రీడాకారులు వ్యక్తిగత రికార్డులకై పాకులాడుతూ జట్టును నిర్లక్ష్యం చేయడం, క్రీడాకారులలో గ్రూపు తగాదాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, జాతీయ జట్టుకు ఎంపికైపోయాములే అన్న నిర్లక్ష్యం, అహంభావం, కోచింగ్ ప్రమాణాలు, క్రీడాకారులకు కావలసిన మంచి లక్షణాలైన సమన్వయం, అవగాహన, క్రీడలకు రాజకీయాలను, మతాన్నీ ముడి పెట్టడం , క్రీడలను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించడం, గెలిస్తే క్రీడాకారులను అందలం ఎక్కించటం, ఓడితే పాతాళానికి తోసివేయటం, ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్నో.. ఇన్ని అంశాలను స్పృశించినా, ఎక్కడా అసభ్యత, అశ్లీలత వంటి వాటికి తావీయకుండా, సాగదీయకుండా సంక్షిప్త మైన మాటలతో, మనసుకు హత్తుకొనే దృశ్యాలతో, మధురమైన, ఉత్తేజపూరితమైన నేపథ్య సంగీతంతో సినిమా సాగిపోయింది. ఇటువంటి చిత్రాన్ని తీసిన యూనిట్ సభ్యులందరూ అభినందనీయులు. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం “చక్ దే ఇండియా”.

గమనిక : ఇందులో భారత క్రికెట్ వైస్ కెప్టెన్ “అభిమన్యు సింగ్” పాత్ర, భారతీయ క్రికెటర్ “యువరాజ్ సింగ్” ను పోలివుండడం యాదృచ్చికం కాదనుకుంటాను.

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు.

కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” అని కొందరు అనువదించినా ఆ అనువాదము సంపూర్ణము కాదు. ఎందుకంటే పొగను విడిచే వాహనాలు ఎన్నో వున్నాయి. అదేవిధంగా ప్రతి సామాన్యుడికీ అర్ధమయ్యే రైలు అనే పదాన్ని పై విధంగా అనువదించటం కూడా సరి కాదు. అంతెందుకు..? మనం రోజూ చేసే బ్లాగింగు అనే ఆంగ్ల పదాన్ని అదే విధంగా తెలుగులో ఉపయోగించట్లేదా..? ఇంకా వాటిపై చమత్కార చణుకులు జల్లి, బ్లాగరి, బ్లాగర్లు, బ్లాగ్లోకం ఇలా ఎన్నో తెలుగులో లేని పదాలను సృష్టించుకున్నామే, మరి ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ లాంటి పదాలను అదే పేరుతో తెలుగులో ఉపయోగిస్తే తప్పేముంది..?

మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు. కానీ, అదే పనిగా ప్రతీ పరభాషా పదాన్నీ ముక్కలుగా తెగ్గోసి తెలుగులోకి అనువదించటం వల్ల బ్లాగులు సామాన్యుడికి అర్ధం కాని విధంగా తయారవుతాయని నా అభిప్రాయం. భారతీయ పదాలైన “యోగా”, “దేశీ”, “గురు” లాంటి వాటిని ఆంగ్లంలో ఉపయోగిస్తున్నప్పుడు “ఇంటర్‌నెట్” లాంటి పదాలను తెలుగులో అదే విధంగా వాడుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. అంతే తప్ప “వెబ్”ను “సాలెగూడు” గానూ “హార్డ్ డిస్క్” ను “కఠిన చట్రం” గానూ అనువదిస్తూపోతే తెలుగు బ్లాగులు హాస్యాస్పదంగా తయారవుతాయి. మరి మీరేమంటారు..? 

మా ఊరి మెటాడోరు..!!

ఈ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు నేను గమనించిన ముఖ్యమైన తేడా, మెటాడోర్లు రోడ్లపై కనిపించకపోవడం, వాటి స్థానంలో ఆటోలు వచ్చిచేరడం.
మెటాడోరు అంటే తెలియని వారికి దాన్ని గురించి కొంచెం వివరిస్తాను. మెటాడోరు అంటే ఒక నాలుగు చక్రాల వాహనం. చూడటానికి మారుతీ వ్యానులా ఉన్నా, ముందు సీట్లో డ్రైవరు కాక ఇద్దరు, మధ్య సీట్లో నలుగురు, వెనుక అటూ ఇటూ ఇద్దరు చొప్పున మొత్తం దాదాపుగా 9 నుండీ 10 మంది సుఖంగా ప్రయణం చేయగల వాహనం. ఇప్పుడంటే క్వాలిస్‌లు, సుమోలు వచ్చాయిగానీ, మా చిన్నతనంలో మెటాడోర్లు, అంబాసిడర్లు తప్ప వేరేవి ఎరుగం.

మా ఊరు పక్కనే కాలువ ఉండటం వల్ల, జాతీయ రహదారికి దూరంగా ఉండటం వల్ల, అవడానికి మండల రాజధాని అయినా, మా ఊరికి రైలు సదుపాయం లేదు. ఊర్లో చిన్నా, చితకా వస్తువులు దొరికినా, ఏ ముఖ్యమైన వస్తువు కావాలన్నా, చుట్టుపక్కల టౌన్లకి బయలుదేరాల్సిందే.. ఇంతేకాక, మా ఊరివారికి ముఖ్యమైన వినోదం సినిమా. పేరుకు రెండు సినిమా హాళ్ళు మినర్వా, ప్యాలస్ అని ఉన్నా రిలీజైన సంవత్సరానికిగాని సినిమాలు వాటిలోకి రావు. అంతవరకూ మా ఊరి జనం ఆగలేరు కనుక, ఇటు పాలకొల్లో, అటు తణుకో తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకని రోజూ మా ఊరినుంచి పొరుగూరు వెళ్ళి వచ్చే వారు ఎక్కువే.

ఎప్పుడో అరగంటకో, గంటకో ఆటు నరసాపురం, భీమవరం డిపోలనుంచో లేక ఇటు రావులపాలెం, గూడెం డిపోలనుంచో వచ్చే దైవాధీనం బస్సులను నమ్ముకోలేక సతమతమయ్యే ప్రయాణీకుల బలహీనతలను సొమ్ముచేసుకొంటూ మొదలయ్యాయి మెటాడోర్లు, సిటీ బస్సులు. తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యం చేర్చడానికి మెటాడోర్లు ఉపయోగపడితే, మారుమూల బస్సు సదుపాయంలేని గ్రామాలను కలుపుతూ పోతాయి సిటీ బస్సులు..

వీరిద్దరూ అవగాహనకు వచ్చి, పెరవలి నుంచి జాతియ రహదారి మీదుగా తణుకు వెళ్ళే రూటును మెటాడోర్లు, విప్పర్రు, ఇరగవరం మీదుగా తణుకు చేరే రూటును సిటీ బస్సులు వాడుతూ ఉంటారు. మా ఊరికి R.T.C బస్సులు సమయానికి రావడం నేనెరుగను కానీ, ఈ ప్రైవేటు వాహనాల సమయపాలనకు మాత్రం ముచ్చట వేయక మానదు.  ఏ సమయాల్లో వాహనాలను తిప్పాలో, ఏ చోట్ల జనం తాకిడి ఎక్కువ ఉంటుందో, ఏ ఊరిలో ఎంత సమయం వేచి చూడాలో వీరికి క్షుణ్ణంగా తెలుసు. సరిగ్గా R.T.C బస్సు రావడానికి 5 నిమిషాలముందే వచ్చి ప్రభుత్వ బస్టాండులోనే ప్రయాణీకులను ఊడ్చుకుపోవడం వీరి స్పెషాలిటీ. తణుకు సినిమా వేళలకు అరగంట ముందుగా మాఊరు మీదుగా వెళ్తూ దారిలోని అన్ని ఊర్ల ప్రయణీకులనూ ఎక్కించుకొని సరిగ్గా సినిమా మొదలయ్యే వేళకు తణుకు చేరటం, అదేవిధంగా సినిమా విడిచే సమయానికి తణుకులో బయలుదేరి హాలు ముందే ప్రయాణికులను ఎక్కించుకొని అరగంటలో వారి గమ్యస్థానాలకు చేర్చటం.. ఇలా రోజూ ఎంతో క్రమపద్ధతిలో సాగిపోతూ వుంటుంది. అసలు నష్టాల నివారణకు IIM లతో అధ్యయనం జరిపించే బదులు ఒకరోజు ప్రయివేటు వాహనాల తీరును గమనిస్తే R.T.C ఎప్పుడో లాభాల బాట పట్టెది.

ఇకపోతే ప్రతీ మెటాడోరుకూ ఒక డ్రైవర్‌తో పాటూ ఒక కండక్టర్‌కూడా ఉంటాడు. కోతి చెట్టుకు తోకతో వేళ్ళాడినట్టు వీడు కూడా ఒక్క కాలు తప్ప మిగిలిన శరీరమంతా గాలిలో బయటకు పెట్టి, తలుపుకు వేళ్ళాడుతూ, ఆ మెటాడోరు ఏ ఊరువైపుగా వెళుతోందో గట్టిగా గొంతు చించుకు అరుస్తూ ప్రయాణీకులను ఆకర్షించటం, వచ్చిన ఆడవారిని ముందునుంచీ, మగవారిని వెనుకనించీ లోపల ఎంతో చోటువుందన్నట్టు భ్రమపెడుతూ వీలైనంతమందిని కుక్కటం, వారినించీ ముక్కుపిండి బస్సు చార్జీలకంటే ఒక అర్ధరూపాయ ఎక్కువే వసూలు చేయటం, మెటాడోరు ఆగటానికి, కదలటానికి సిగ్నల్‌గా ఈల వేయటం లాంటివి వీడు నిర్వర్తించే విధులు. పురాణాల్లో చదివిన పుష్పక విమానంలోనైనా చోటుకు లోటుంటుందేమో గాని, ఈ మేటాడోరులో మాత్రం ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. 

ఇక లోపల నిలబదటానికి మూడడుగుల మించి ఎత్తు ఉండదు కనుక, ఎంతటి వాడైనా తిరగేసిన “L” ఆకారంలో నడుం వంచాల్సిందే, దారిలో గతుకులకి, వేళ్ళే వెగానికీ, నెత్తిమీద మొట్టికాయలు తినాల్సిందే. ఇక వేసవి కాలంలో మేటాడోరు ప్రయాణం చేసి దిగిన వేంటనే మండుటెండ అయినా A.Cలా అనిపిస్తుంది. చెమటతో తడిసిన చొక్కా మీదుగా చల్లటిగాలి వెళ్తుంటే అప్పటిదాకా చేసిన ప్రయాణం బడలిక అంతా ఇట్టే మాయమవుతుంది..!!

ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందిని వారు చేరవలసిన చోటికి చేరుస్తూ మా వూరికి సేవ చేసిన ఈ మెటాడోర్లు ఎందుకు కనుమరుగయ్యాయని ఆరా తీస్తే తెలిసిన విషయమేమంటే.. ఈ మధ్య స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారులని అభివృద్ధి చేసినపుడు, తణుకు ఊరి పొలిమేరలో ఒక టోల్ గేటు పెట్టడం జరిగింది. ఈ గేటు ద్వారా తణుకు లోకి ప్రవేశించాలంటే ప్రతీ నాలుగు చక్రాల వాహనంఎనభై రూపాయల దాకా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాని త్రిచక్ర వాహనాలకు ఈ రుసుము లేదు. ఈ టొల్ గేట్ దెబ్బకు మా ఊరిలో మేటాడోర్లు మాయమై మూడు చక్రాల ఆటోలు ప్రత్యక్షమైపొయాయి. వాహనమేమైనా, మా ఊరి ప్రజల ఇక్కట్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి.

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను.

మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను.

“యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో ని హతమార్చడానికి కొందరు పథకం వేస్తే, ఇందులోనూ అంతే. పోతే అందులో చిత్రగుప్తుడి పొరబాటు వల్ల హీరో నరకానికి కొనిరాబడితే, ఇక్కడ పగ తీర్చుకోవడానికి యముడి ఆజ్ఞ పైన కొనిరాబడతాడు. అక్కడ రెండవ చిరంజీవి అమాయకుడు. అతనికి 21 సంవత్సరాలు నిండాక ఆస్తిపై తమ హక్కును కోల్పోతామని గ్రహించి విష ప్రయోగంతో హత్య చేస్తారు అతని బంధువులు. ఈ సినిమాలో రెండవ చిరంజీవి పాత్రను ప్రియమణి పోషించింది. ఈమె ఆస్తిపైనా బంధువులు పెత్తనం చెలాయిస్తుంటారు. ఒక్కోసారి కొరడాతో కూడా చావగొడతారు. ఆస్తి తమకే దక్కాలన్న స్వార్థంతో హత్యాయత్నం కూడా చేస్తారు. పోతే హీరో ఈ హత్యాయత్నాన్ని తెలియకుండా అడ్డుకోవడం, వారిద్దరి మధ్య ప్రేమ, ఇవన్నీ పైపై మెరుగులు. చివర్లో ఆమె బంధువులతో ఇంటిపనులు చేయించడం, అంట్లు తోమించడం ఇలా ఎన్నో పోలికలు. ఆ సినిమాలో చివర్లో చిరంజీవికి మరణం సంభవించబోతుంది. కాని యముడి ఆశీస్సులతో “చిరంజీవి” అవుతాడు.  ఈ సినిమాలోనూ రెండవ “యమగండం” పేరు చెప్పి హీరోను రెండవ మారు చంపడానికి ప్రయత్నిస్తాడు యముడు. ఇవన్నిటితో చూస్తే జ్యోతి గారన్నట్లు ఈ సినిమా “కొత్త సీసాలో పాత మందే”..!!

పోతే “యముడి కి మొగుడు” లో యముడి పాత్ర ఎంతో హుందాగా చిత్రీకరించబడింది. చిత్రగుప్తుడు చేసిన పొరపాటును దిద్దడానికి ధర్మపరిరక్షకుడైన యముడు అనుక్షణం పరితపిస్తాడు. ఇకపోతే “యమదొంగ” సినిమాలో యముడి పాత్రకు ఈర్ష్య, ద్వేషాలను ఆపాదించి కుటిలుడుగా చిత్రీకరించారు. పోతే మోహన్‌బాబు ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కుటిలత్వాన్ని బాగా ప్రదర్శించినా, అతని డైలాగ్ పవర్‌కి సరిపోయే మాటలు ఈ సినిమాలో లేవనే చెప్పాలి. ఇక చిత్రగుప్తుడి పాత్రను ఒక విటుడిలా చిత్రీకరించడం, భూలోకం నుంచి వచ్చిన వేశ్యతో కులకాలని చూడటం, అందుకు శిక్షలు మాఫీ చెయ్యడం లేదా తగ్గించడం, యమలోకాన్ని ఒక గవర్న్‌మెంట్ ఆఫీసుకన్నా హీనంగా, ఒక వ్యభిచార గృహం కంటే దారుణంగా చిత్రీకరించడం.. ఇవన్నీ హాస్యం ముసుగులో హిందూ దేవుళ్ళని కించపరచడమే. ఈ ఖర్మ హిందువులకేనేమో. వేరే ఏ మతం వారిపైనైనా ఇలాంటి దృశ్యాలను చిత్రీకరిస్తే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచి ఉండేది.

ఏది ఏమైనా మిగిలిన యమలోక సన్నివేశాలు కూడా యమగోల, యముడికి మొగుడు చిత్రాలను తలపించాయే తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. కేవలం డ్యాన్సు, ఫైట్లు, అసభ్యత, అశ్లీలత లను నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం డబ్బుతో జూదమాడటమే. స్టార్ కాస్టింగ్, గ్రాఫిక్స్‌లపై పెట్టిన శ్రద్ధ కథ, కథనం పై పెట్టి ఉంటే, N.T.R అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమా “సింహాద్రి” ని మించిన బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఈ విషయంలో మాత్రం రాజమౌళి N.T.R అభిమానులను నిరాశపరచినట్టే. 
 

జెమిని “చిత్ర” హింస..!!

రోజూ జెమిని ఛానల్లో డబ్బింగ్ సినిమాలనూ, సా..గదీత సీరియళ్ళనూ చూసి చూసీ విసుగు పుట్టి, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా మంచి కార్యక్రమాలు ఉండకపోతాయా అని ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ రోజు మొదటినుండీ చివరి వరకూ చలన చిత్రాలకు సంబంధించిన వేరు వేరు కార్యక్రమాలతో విచిత్ర రీతులలో “చిత్ర” హింసను కొనసాగించారు జెమిని వారు.

ఆగస్టు పదిహేను నాడే విడుదల అయిన “యమ దొంగ” చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. “సక్సెస్ దొంగ” కార్యక్రమంలో రాజమౌళి తో, “యమ ఆలీ” కార్యక్రమంలో N.T.R మరియు ఆలీ తోనూ ముఖాముఖి, తాను తీయబొయే కొత్త సినిమాలో తెలుగు నాయికకై అన్వేషణ అన్న సాకు చెప్పి తన సినిమాలకు ప్రచారం కల్పించుకొంటున్న దిల్ రాజు కార్యక్రమం “కొత్త బంగారు లోకం”, ఇటీవలే జరిగిన తానా వార్షికోత్సవ కార్యక్రమాలు, త్వరలో విడుదల కానున్న “యమ గోల” సినిమాపై శ్రీకాంత్ తో ముఖాముఖి.. ఇవండీ మన జెమిని వారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రసారం చేసిన “ప్రత్యేక” కార్యక్రమాలు..!!

వీటితో పాటుగా, నిర్లక్ష్యానికి మరణమే శిక్షగా ప్రబోధించే “అపరిచితుడు”, ఫ్యాక్షనిస్టుల ప్రతీకారాలతో నిండిపోయిన “యజ్ఞం”, భారత పాకిస్తాన్ మధ్య చిచ్చును సొమ్ము చేసుకొంటూ రూపొందించిన “ఖడ్గం”.. ఇవి ఆరోజు ప్రసారం అయిన చలన చిత్రాలు. ఆరోజు మొత్తం, స్వాతంత్ర్యానికి సంబంధించిన ఒక్క ప్రత్యేక కార్యక్రమం కూడా నాకు భూతద్దంతో వెతికినా కనిపించలేదు. అన్నట్లు మరచిపోయాను.. ఒక్క కార్యక్రమంలో మాత్రం “గాంధీ” గారు కనిపించారండోయ్..!! అదీ “శంకర్‌దాదా జిందాబాద్” చిత్ర ప్రచారానికై ఉద్దేశించిన కార్యక్రమంలో. ఇందులో కూడా సినిమా ప్రచారం చేసుకోవాలన్న కోరిక తప్ప, జనానికి గాంధీ గారిని మరోసారి గుర్తు చేద్దామన్న తపన కనపడలేదు. 

ఈ శాటిలైట్ ఛానళ్ళ వారు ప్రసారం చేయాలనుకొంటే మంచి కార్యక్రమాలెన్నో చేయవచ్చు. స్వాతంత్ర్య సమరయోధులతో ముఖాముఖి, ఆ సంగ్రామంలో వారి అనుభవాలు, ప్రస్తుతం పింఛన్లకై వారు ఎదుర్కొంటున్న కస్టాలు, మన స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, సిపాయిల తిరుగుబాటు, జలియన్‌వాలాబాగ్ దురంతం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణోద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సంగ్రామంలో గాంధీతో పాటుగా పోరాడిన భగత్ సింగ్, అల్లూరి, నేతాజీ వంటి విప్లవ వీరులు, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, ప్రకాశం పంతులు వంటి నాయకులు, ఇలా తలచుకొంటే ఎన్నో సంఘటనలపై లేదా ఎందరో వ్యక్తులపై “ప్రత్యేక” కార్యక్రమాలను ప్రసారం చేయవచ్చు. కాని అడ్వర్టైజ్‌మెంట్లతో వచ్చిపడే డబ్బుకు ఆశ పడి రోజంతా సీరియళ్ళతోనూ, సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలతోనూ నింపేస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రానంతవరకూ మనకీ “చిత్ర”హింస తప్పదు.   

బాబోయ్ భారత్ బజార్..!!

ఈ మధ్య అమెరికాలో సందు సందునా, గొందు గొందునా భారత్ బజార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకూ, వినియోగదారులను దోచుకొందుకు, అందినకాడికి లాభాలను దండుకొందుకు ప్రాధాన్యతనిస్తూ, నాణ్యమైన వస్తువులను అందివ్వాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి.

ఇటీవల నేనొక భారత సూపర్ మార్కెట్ కి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న సుహాసిని బొమ్మతో బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ కనిపించింది. తీరా తీసిచూస్తే అది 2005 లో తయారయిన కాఫీ పౌడర్. దానిపై Best Before 9 months from mfd date అని రాసి ఉంది. అంటే అది expire అయ్యి సంవత్సరం పైగా అయ్యిందన్నమాట. అప్పటినుంచీ నేను కొనే ప్రతి వస్తువుకూ expiry date చూడటం అలవాటు చేసుకొన్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే, ఈ సమస్య ఏ ఒక్క కాఫీ పౌడర్ కో మాత్రమే  సంబంధించిన విషయం కాదు. ఈ భారతీయ మార్కెట్లలో దొరికే చాలా వస్తువులు expire అయిపోయినవో, లేక ఒకటి లేదా రెండు నెలల్లో expire అవబోయేవో.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని వస్తువుల మీద expiry dates కూడా ముద్రించి లేకపోవడం. పచ్చళ్ళు, మ్యాగీ, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. ఆ మద్య Parle-G బిస్కట్ ప్యాకెట్లు డాలర్ కి పది అని కొనబోతే, వాటిలో చాలావరకు expire అయిపోయినవే. దీనిని బట్టి నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే, expire అయిన లేదా అవబోతున్న వస్తువులని ఇలా వదల్చుకొంటున్నారని.

వీటితో పాటుగా ప్రస్తావించుకోవలసినవి పాలు, పెరుగు, బ్రెడ్ వంటివి. ముఖ్యంగా బ్రెడ్ ఎంతో కాలం నిలువ ఉండదు. పట్టుమని పదిరోజులు కూడా నిలువ ఉండని ఈ బ్రెడ్ ను రోజుల తరబడి అమ్మడం నాకు తెలుసు. పోనీ కాయగూరలన్నా తాజాగా ఉంటాయా అంటే అదీ లేదు. ఎప్పుడో వారాంతంలో జనం తాకిడి ఎక్కువ ఉండంటంచే తాజాగా ఉంచుతారే తప్ప, వారం మధ్యలో వెడితే అన్నీ కుళ్ళిపోయిన కూరగాయలే..!! అదీకాక తాజా కూరగాయలని కుళ్ళినవాటితో కలిపి లాభాలు దండుకోవటానికి ప్రయత్నిస్తారు.

కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తాజాగా ఉండాలంటే కావలసినది మంచి cooling system. ఇది చాలా స్టోర్లలో లేదు. ఉన్నా సరిగా పని చేయదు. ఇటువంటి చోట్ల కొన్న పాలు, పెరుగు వంటివి expiry date వరకు పాడవకుండా ఉంటాయన్న గ్యారంటీ ఏముంది..? ఇలాంటి చోట్ల పాలు కొన్న ఎంతోమంది స్నేహితులకి అవి కాచగానే విరిగిపోవడం నాకు తెలుసు. అదే విధంగా పప్పుదినుసులు మొదలైనవి పురుగులు పట్టడమో, పాడైపోవడమో జరిగిన సందర్భాలు అనేకం. అమెరికన్ స్టోర్లలో దొరికే ప్రతి వస్తువునూ నాణ్యతతో ఉండాలని కోరుకొనే మనం, ఒకవేళ ఏ మాత్రం నాణ్యత లోపించినా ఆరునెలలైనా నిర్మొహమాటంగా తిరిగి వెనుకకు ఇచ్చి డబ్బును డిమాండ్ చేసే మనం, ఈ ఇండియన్ మార్కెట్లలో జరిగే ఆగడాలను నిలదీయడానికి మాత్రం వెనుకాడతాము, జంకుతాము.. ఎందుకు..? ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు.

ఇకపోతే ఈ ఇండియన్ స్టోర్లు జనాలను దోచుకొనే విధాలు అనేకం. వీరు విక్రయించే వస్తువులలో చాలావరకు వస్తువులు ఇండియా నుంచి దిగుమతి చేసుకొన్నవే. వీటిపై ఇండియా లోని వెల తప్ప, అమెరికా వెల ఉండదు. ఇక్కడి స్టోర్ల వాళ్ళు ఏది ముద్రిస్తే అది దాని వెల అయి కూర్చుంటుంది. ఇక పండుగలోస్తే వీరికి “పండుగే”..!! రాఖీ, వినాయక చవితి, ఉగాది లాంటి పండుగలకి ఇండియా నుంచి రాఖీలు, వినాయకుని బొమ్మలు, పాలవెల్లులు, వేపపువ్వు, మామిడాకులు వంటివి తెచ్చి ఆకాశాన్నంటే ధరలను నిర్ణయించి అమ్ముతారు. ఇక శ్రావణ శుక్రవారాలొచ్చాయంటే తమలపాకులు, కొబ్బరి కాయలను కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి.

ఈ మార్కెట్లలో పోనీ customer service అన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. ఏ వారాంతాంలో వెళ్ళినా ఆ మూల నించీ ఈ మూల వరకూ వరుసలో జనం. కూరగాయలు బిల్ చేసే విధానం మరీ దారుణం. కూరగాయలను వెయింగ్ మెషీన్ మీదనుంచి లాగి ఏదో మీటలు నొక్కి ఎంతో ఒకంత వెల టైప్ చేస్తారు. పోనీ బిల్ లో వెల సరిచూసుకొందామంటే ఆ బిల్ ను డీకోడ్ చేయటానికి ఏ software enginner సరిపోడు.

ఇక ఇండియాలో ఒక వస్తువుకు మరో వస్తువును ఉచితంగా ఇవ్వడం సహజం. ఉదాహరణకు కాఫీ పౌడర్ కు గ్లాసో, స్పూనో ఇవ్వటంలాంటివి. ఈ ఇండియన్ స్టోర్లలో మరీ దారుణంగా అలా ఉచితంగా వచ్చిన ఆ గ్లాసునీ, స్పూనునీ కూడా వెల నిర్ణయించి అమ్మడం నేను చూసాను.

ఇక వినియోగదారుడిని ఆకర్షించడానికి వీరు అనుసరించే మార్గాలు ఎన్నో.. $20 కొంటే 2% డిస్కౌంట్, $30 కొంటే 3% డిస్కౌంట్ అంటూ.. ఇవికాక ఉచిత DVDలనీ, పాయింట్లనీ ఇలా ఎన్నో.. ఈ కొసర్లకు ఆశ పడి, కుళ్ళిన కాయగూరలను, అవసరం ఉన్నా లేకున్నా అందిన వస్తువులను, cart లో వేసి బిల్ చేసే వాళ్ళను అనేకం చూసాను. DVD, వీడియో క్యాసట్ల విషయానికొస్తే ఈ స్టోర్లన్నీ పైరసీకు నిలయాలుగా మారిపోయాయి. మన కళ్ళెదురుగానే DVD నుంచీ క్యాసెట్ కు కాపీ చేసేస్తుంటారు.

కానీ, మన బలహీనతలతో ఆడుకొనే ఇలాంటి స్టోర్లను ప్రోత్సహించకూడదు. మనకు వారేదో ఉపకారం చేస్తున్నారన్న భ్రమనుండి బయటపడి, మనం లేనిదే వారు మనలేరన్న వాస్తవాన్ని గ్రహించాలి. మన సేవలకు ఏ విధమైన లోపం కలిగినా వెంటనే నిలదీయాలి. తాజా కాయగూరలకై రైతు బజార్లు (farmers market)లాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. మన లేదా మన కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పోలిస్తే ఆదా చేసే కొన్ని డాలర్లు లెక్కలోనివి కావన్న సత్యాన్ని గ్రహించాలి. అమెరికాలోని ప్రతి భారతీయుడూ కలసి రాకుంటే ఈ దోపిడీ బజార్లు మరింత పేట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్య గమనిక: ఈ టపాలో “భారత్ బజార్” అన్న పదం అన్ని భారతీయ సూపర్ మార్కెట్లనూ ఉద్దేశించి రాసినదే తప్ప, “భారత్ బజార్” అనబడే చెయిన్ మార్కెట్ ను మాత్రమే ఉద్దేశించి రాసినది కాదు.

గోళీ సోడా.. తాగి చూడరా తెలుగోడా..!!

గోదావరి జిల్లాలంటే పచ్చని పైర్లు, ఎత్తైన కొబ్బరి చెట్లు, “ఆయ్”, “అండీ” అంటూ ఆప్యాయంగా పలుకరించే జనాలతో పాటుగా గుర్తుకు వచ్చేది.. “గోళీ సోడా”. ఇప్పటికీ నేను మా ఊరు వెళితే అన్నిటికన్నా ముందు చేసే పనులు, మా అమ్మ చేతి వంట తినడం, మా ఊరు గోంగూర తూము సెంటర్లో ఉన్న కిళ్ళీ కొట్టుకెళ్ళి గోళీ సోడా తాగడం.

ఈ గోళీ సోడా ఎప్పుడు పుట్టిందో తెలియదు గానీ, గోదావరి ప్రజల జీవితాలతో విడదీయరాని విధంగా పెనవేసుకు పోయింది. ఆకుపచ్చ లేదా నీలం రంగు లో అందంగా ఆరంగుళాలు పైన పొడవుండే ఈ సోడా, కింద వెడల్పు గా ఉండి, పైకి పోయెకొద్దీ సన్నంగా, చేతిలో వీలుగా ఇమిడిపోయేట్లు ఉంటుంది. దీని గొంతులో వాయుపీడనం తో ఇరుక్కొని ఉండే గోళీ, మూతికి అటూ, ఇటూ సోడాని ఎటువైపు ఎత్తిపెట్టి తాగాలో సూచించే రెండు గాట్లు.. ఇలా ఎవరో శ్రద్ధగా డిజైన్ చేసినట్లుంటుంది.

ఈ గోళీ సోడా తాగడంలో మజా ఒకటైతే, సోడా కొట్టటంలో వచ్చే మజా ఇంకొకటి. చంకలో పసిపిల్లాడిని అప్యాయంగా ఎత్తుకొన్నట్లుగా పట్టుకొని, చూపుడు వేలుతో గోళీ ని నెట్టి సోడా కొట్టేదొకడైతే, బల్ల మీద గుడ్డ వేసి, దానిపై సోడా పెట్టి, మాస్టారు స్టుడెంటు ని బెత్తంతో కొట్టినట్టుగా, చెక్కతో చేసి లోపల గోళీని నెట్టడానికి వీలుగా రబ్బరు ఉన్న గుండ్రటి పరికరంతో నెత్తి మీద మొట్టి సోడా కొట్టేదింకొకడు. ఇకపోతే, సోడా తాగడం మాట దేవుడెరుగు, సోడా కొట్టే సౌండుకే సగం కిక్కు వస్తుంది. ఎంత ఎక్కువ సౌండు వస్తే అంత గొప్ప. గాలి సరిగా నింపక తుస్సుమనే సోడాలు కొన్నైతే, కొట్టిన పది సెకన్లవరకూ చెవి గింగులెత్తేంత సౌండు వచ్చేవి కొన్ని.. అందుకే కామోసు, మన సినీ కవులు కూడా “నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ..!!” అని పాటలు రాసి సోడా మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక మా చిన్నప్పుడు, సోడాలని రెండు చక్రాల తోపుడుబండిని తోసుకొంటూ వీధి వీధి తిరిగి అమ్మేవారు. ఈ సోడాలపై వేసవిలో చల్లదనానికి, గోనెసంచి గాని లేదా ఎండుగడ్డి గాని వేసి నీళ్ళు చల్లుతూ ఉండేవారు.. ఇప్పటికీ, కూలరు లేని బడ్డీ కొట్టు వాళ్ళు ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు. ఇక ఈ గోళీ సోడాలలో రకరకాలు.. మామూలు సోడా, ఐస్ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా అంటూ..

ఈ సోడాని తయారు చేసే విధానం కూడా గమ్మత్తుగా వుంటుంది. ఒకేసారి మూడు, నాలుగు సోడాలు పట్టే ఒక పెట్టె, ఆ పెట్టె గిరగిరా తిరగడానికి అమరిక, సోడాలో నింపే గ్యాస్ సిలిండర్ ని పెట్టెకి కలుపుతూ ఒక ట్యూబు, దానికి పీడనాన్ని చూపించే ఒక మీటరు..సోడాలో కావలిసినట్లు నీటిని నింపాకా, ఈ పెట్టెలో పెట్టి, కావలసినంత పీడనాన్ని అమర్చుకొని, పెట్టెను గిరగిరా కాసేపు తిప్పి బయటకు తీసి చూస్తే సోడా తయార్..

ఈ గోళీ సోడా ఇంత ప్రాచుర్యం పొందడానికి చాలా కారణాలున్నాయి.. ముఖ్యంగా ఇది పేదవాడికి కూడా అందుబాటులో ఉండే పానీయం.. బాదంగీరులూ, బటరు మిల్కులూ ఉన్నా, అన్నింటికంటే చవుకగా లభించేది గోళీ సోడాయే.. ఇక ఎండలో దాహం తీరాలన్నా, విందు భొజనం ఆరగించిన తరువాత భుక్తాయాసం తీరాలన్నా, ఆటలు ఆడిన తరువాత అలసట తీరాలన్నా, సోడాని మించినది మరొకటి లేదు.

ఇటువంటి చరిత్ర కలిగిన గోళీ సోడా, నాకు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ఇక కూల్ డ్రింకులూ,ఫ్రూటీలూ, బిస్లరీ సోడాలూ వచ్చాకా, ఊర్లలో కూడా గోళీ సోడా నెమ్మదిగా కనుమరుగు అయిపోతోంది. మరికొన్ని సంవత్సరాలు పోతే, ఈ సోడాలను మ్యూజియంలో తప్ప బయట చూడలేమేమో.. అందుకే..ఇప్పుడే.. గోళీ సోడా.. తాగిచూడరా తెలుగోడా..!! 

“మెయిల్” తో నా తిప్పలు

నేను U.S వచ్చిన కొత్తలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొన్నపుడు ఇంటి తాళాలతో పాటుగా తళతళలాడే ఒక ఇత్తడి తాళంచెవి ని కూడా ఇచ్చారు leasing offce వారు. అది mailbox తాళంచెవి అని, నాకు వచ్చిన టపా అంతా postman ఒక box లో పెట్టి వెళ్ళిపోతాడని, మనం వీలున్న టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చని చెప్పారు. అప్పటికే U.S లో సంవత్సరాలుగా ఉంటూ, లీజు సైన్ చెయించడానికి సహాయంగా వచ్చిన నా స్నేహితులు, “ఇది కూడా తెలియదా అమయకుడా..!!” అన్నట్లు జాలిచూపు విసిరి, U.S లో చాలా confidential documents మెయిల్లో వస్తాయని, అందుకే ఎవరి మెయిల్ వారే తీసుకొనేందుకు వీలుగా ప్రతి అపార్ట్మెంటుకు ఒక mailbox ఉండి, దాని తాళంచెవి ఆ అపార్ట్మెంట్ లో నివసించే వారికి మాత్రమే ఇస్తారని గీతోపదేశం చేసారు.

ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. అప్పటివరకు మా ఊళ్ళో postman ఉత్తరాలు చేతికి ఇవ్వడం, కొండొకచో దూరం నించే విసిరి వెళ్ళిపోవడమే తెలుసు. Bangalore లో నేను పనిచేసే రోజుల్లో నేను ఆఫీసు నుంచి వచ్చే టైంకి నా ఇంటి ఓనరే నా టపా చేతపుచ్చుకొని postman లా ఎదురు చూసేవాడు. ఇక నేను చదివిన R.E.C Nagapur లో అయితే postman మా హాస్టల్ వరకూ రావడానికి బద్ధకం వేసి, దారిలో ఎవరో ఒకరి చేతికి హాస్టల్ టపా మొత్తం ఇచ్చేసేవాడు. ఇవ్వన్నీ చూసిన నాకు, అంతా విచిత్రంగా, నా mailbox తాళంచెవిని చూస్తే ముద్దుగా, ముచ్చటగా, అపురూపంగా అనిపించింది.

కొత్తలో mailbox తెరవాలనే సరదాలో, రోజూ పొద్దున్నా, సాయంత్రం, ఒక్కోసారి మెయిల్ రాదని తెలిసినా రాత్రి, నాకు మెయిల్ ఏమైనా వచ్చిందా అని గోతికాడ నక్క లాగా కాచుకు కూర్చునే వాడిని. నేను తెరుస్తానంటే నేనంటూ, నేను, నా భార్య పోటీ పడిన సందర్భాలూ ఉన్నాయి. ఎప్పుడో వచ్చే ఇండియా ఉత్తరాలూ, నెలకోసారి వచ్చే bills తప్పితే చాలామార్లు mailbox బోసిగా వెక్కిరించేది. Mailbox నుండి చేతినిండా మెయిల్స్ తో వెళ్ళేవారిని చూస్తే ఒకింత ఈర్ష్య కూడా కలిగేది.

రాను రాను నా mailbox కూడా నిండటం మొదలు పెట్టింది. మొదటిసారి pizza hut కూపన్లు వచ్చినపుడు ఎగిరి గంతేసి ఏదో సాధించినట్లు కాలర్ ఎగరేసాను. ఇక ఆ తరువాత నుంచి కుప్పలు తెప్పలు గా వేరే వేరే స్టోరుల నుంచి కూపన్లు వచ్చి పదటం, వాటిని వాడుకోవాలనే తాపత్రయం లో క్రెడిట్ కార్డు బిల్లు పేలడం మొదలయ్యింది. అప్పటినించీ కొత్త రకం కష్టాలు వచ్చిపడ్డాయి. ముక్కు మొహం తెలియని క్రెడిట్ కార్డు కంపెనీలన్నీ ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేయటం, ఇది చాలదా అన్నట్లు నేను కార్డు వాడిన ప్రతి అడ్డమైన స్టోరు వాడూ, నెలకో, వారానికో ఒక discount booklet పంపడం. “ఈ సేల్ ఈ వారం మాత్రమే..”, “ఇది కొంటే ఇది అప్పనంగా కొట్టేయచ్చు..” అంటూ..!! ఇది కాక, ఏదో share market లో పొడిచేద్దామని, కొత్త account ఓపెన్ చెస్తే free గా ipod, PDA వస్తుందని కక్కుర్తి పడి account open చేసిన ప్రతి స్టాకు బ్రోకరూ investment information అంటూ ఊదరగొట్టటం..   వీటికి తోడు customer satisfaction survey అనీ, research survey అనీ.. రకరకాలు..

ఇన్ని రకాల junk మెయిల్స్ మధ్యన నాకొచ్చే ఒకటి రెండు ముఖ్యమయిన letters, bills కూడా గుర్తు పట్టడంఈ మధ్యన కష్టం అయిపోతోంది. ఈ మెయిల్ని sort చేయలేక, తీసుకొచ్చి కుప్పలా ఇంట్లొ పడేయటం, ఇల్లాలితో చీవాట్లు తినటం పరిపాటి అయిపోయింది. గోరుచుట్టుపై రోకలి పోటా అన్నట్టు ఈ మధ్య కొన్ని bills టైంకి చెల్లించక పోవడం, late fees వాయగొట్టించుకోవడం కూడా జరిగింది. అలాగని పోనీ చెత్త మెయిలంతా trash చేద్దమంటే ఇంటి address నుంచి అంతా confidential అయిపోయే..

ఈ చెత్త మెయిల్ shred చేయటానికి ఈ మధ్య ఒక shredding machine కూడా కొన్నాను. అందులోనూ వెరైటీలు.. అడ్డంగానూ, నిలూవుగాను shred చేసేవి కొన్నయితే, కోలగానూ, జిగ్ జాగ్ గా shred చేసేవి కొన్ని. 5-6 కాగితాలు shred చేసేదొకటైతే, 10-15 కాగితాలు shred చేసేదింకొకటి. వెర్రి వెయ్యి విధాలు అన్నట్టు.. ఇది మాత్రమే కాక, మెయిల్ నీటుగా చింపటానికి ఒక కత్తి, వచ్చిన మెయిల్ని counter top మీద కాక ఒక చోట గుర్తు గా పెట్టుకోవడానికి letter box, ముఖ్యమైన documents భద్ర పరచుకోవడానికి ఒక file rack.. అబ్బో..!! చాలా వదుల్చుకొన్నాను ఈ మెయిల్ గురించి.. ఇది కాక, వారానికో, రెండు వారాలకో ఇంట్లో చెత్తని భరించలేక, ఎంతో విలువైన weekend లో ఒక గంట వెచ్చించి మెయిల్ క్లియరెన్స్ మహోద్యమం.. ఏమిచెప్పమంటారండీ మెయిల్ తో నా తిప్పలు..

మా ఊరిలో “రాజు” లెందుకుండరు..?

మా ఊరిలో ఎక్కడ చూసినా “నూలి” వారని, “బొడ్డు” వారని, “గ్రంధి” వారని, ఇలా వైశ్య (కోమటి) కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప, దుర్భిణి వేసి చూసినా ఒక్క “రాజు” ల కుటుంబం కూడా కనపడదు. ఎందుకో తెలుసా..?

పూర్వం మా ఊరిలో ఒక వైశ్య దంపతులు నివసించేవారు. వారికి “కన్యక” అనే ఒక అందమైన కూతురు వుండేది. ఆమె పెళ్ళీడు కు రావడంచే వివాహం చేయ సంకల్పించి ఒక మంచి వరునికై తల్లిదండ్రులు వేచి చూస్తుండగా, ఒకనాడు అటుగా వెళ్తున్న ఆ ప్రాంత రాజు కన్యక అందాన్ని చూసి, మోహించి, పెళ్ళాడమని బలవంతం చేసెను. ఆ రాజును ఎదిరించలేక, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళాడలేక, ఆ కన్యక “అగ్ని గుండం” లోకి దూకి ఆత్మత్యాగం చేసింది. అప్పటినుంచి ఆమె “కన్యకా పరమేశ్వరి” అమ్మవారిగా మా ఊరి ప్రజలచే, ముఖ్యంగా వైశ్యులచే పూజలందుకుంటోంది. ఆ “కన్యకా పరమేశ్వరి” ఇచ్చిన శాపం వలననే మా ఊరిలో “రాజు” లు నివసించరు. ఒకవేళ నివసించినా మా ఊరి పొలిమేర అయిన కాలువ దాటిన తరువాతనే ఇళ్ళు కట్టుకొంటారు. ఈ ఆచారం, నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. మా ఊరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆమె అగ్నిప్రవేశం చేస్తున్న ప్రతిమను చూడవచ్చు. ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, మా ఊరు “పెనుగొండ” అంటే, “ఓ.. అమ్మవారి ఊరా..!!” అని చేతులెత్తి భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు.

నా పేరు, కథా కమామీషూ..

నా పూర్తి పేరు తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు. కొల్లేటి చాంతాడంత ఈ పేరు పురుకోస గా మారిపోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే నా అక్క పేరుతో మొదలుపెట్టాలి.

నా అక్క పేరు తాడిమేటి వెంకట సత్య నాగ దుర్గ త్రినాథ రామ లక్ష్మీ గాయత్రి. నా అక్క పేరు హాజరు పట్టీ లోను, certificates లోను ఇదే విధంగా నమోదు చేసి మా నాన్నగారికి చుక్కలు కనిపించాయి. ప్రతి certificate లోను, ప్రతి hall ticket లోను ఎప్పుడూ తన పేరు లో అచ్చు తప్పులు దొర్లటం, సరిచేయటానికి వెనక్కి పంపించటం పరిపాటి అయిపొవటంతో ఆ తప్పు మళ్ళీ చేయకూడదని నిశ్చయించుకొని, నా పేరును తాడిమేటి రాజారావు గా కుదించేసారు.

ఇక నా పేరు లో ప్రతి పదం వెనుకా ఒక చరిత్రే ఉంది. తాడిమేటి మా ఇంటి పేరు. నేను “పునర్వసు” నక్షత్రం లో పుట్టటం, అది రాములవారి నక్షత్రం కావటం చేత “రామ” అనే పదం జతపరచారు. ఆందుకే నన్ను మా ఇంటిలో అందరూ “రాము” అని పిలుస్తారు. ఇక మా కులదైవం తిరుమలేశుడైన శ్రీ శ్రీనివాసుడు పేరు నా పేరు లో మరో పదం. నా ఇద్దరు తాతగార్ల పేర్లలో ఎవరి పేరు పెడితే ఎవరికి కోపం వస్తుందోననో ఏమో “లక్ష్మీ నారాయణ” అని మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు, “రాజారావు” అని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు తగిలించేసారు. ఇక శివుడు మా నాన్నగారికి ఇష్టమైన దేవుడు, “నాగ” అనే పదం పేరులో చేర్చటం మా ఆచారం. ఇదండి నా పేరులో ప్రతి పదం వెనుక వున్న రొద, సొద, బాధ, గాధ..!!

ఇక నన్ను నా చిన్ననాటి స్నేహితులు “రాము” అని పిలుస్తారు. కాని నా Engineering స్నేహితులకి నా ఇంటి పేరులో ఏమి కోతులాడాయో ఏమో కాని, “తాడి” అని ముద్దుగా పిలుచుకొంటారు. ఇక నా “M.Tech” స్నేహితులు మరియు నా సహోద్యోగులు “రాజా” అని పిలుచుకొంటారు.

అమెరికా కి వచ్చిన తరువాత “రాజా”, “రావు” లలో “రాజా” నా First Name గా, “రావు” నా Middle Name గా మరిపోయి, జనాలు నన్ను “రాజా తాడిమేటి” గా మార్చివేసారు. ఇక నోరు తిరగని, “జా” ని “హా” గా ఉఛ్ఛరించే Mexicans, నా పేరుని “రాహా” గా ఖూనీ చేసేస్తూంటారు. ఏది ఏమినా, సొంత ఊరుని, సొంత వారిని గుర్తుకు తెచ్చే “రాము” అనే పిలుపే నాకెంతో బావుంటుంది.

నాకూ ఉందో బ్లాగు..!!

నమస్కారం. తాడిమేటి రాజారావు బ్లాగ్ కు స్వాగతం. నేను Software Engineer నే అయినా ఎప్పుడూ నాకంటూ ఒక website ఉండాలని అనుకోలేదు. ఆ అవసరం ఇంతవరకు కనపడలేదు. ఈ మధ్యనే నా భార్య తెలుగు లో బ్లాగులు చూడటం, నాకు తెలియపరచటం జరిగింది. అవి చూసాక నాకు కూడా తెలుగు లో బ్లాగ్ తయారుచేయాలన్న కోరిక పుట్టింది. నాకు అరంభశూరత్వం ఎక్కువ కనుక మొదలు పెట్టటం అయితే చేసేసాను కాని, ఎంతవరకు తరచుగా update చేస్తానో కాలమే నిర్ణయించాలి. 

నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సొంత భాష లో అభిప్రాయాలను వ్యక్తపరచటం సులభం. “లేఖిని” వంటి software సహాయం తో తెలుగు లో బ్లాగ్ తయారుచేయటం నల్లేరు పై నడక అయిపోయింది. ఆందుకు వారికి ఎంతయినా ఋణపడి వుంటాను.

ఈ బ్లాగ్ లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. తరచు విచ్చేసి మీ అభిప్రాయాలను నాకు తెలియపరచండి.