“రెడీ” … తప్పక చూడండి..!!

ఈ సినిమాను నేను గత వారమే చూసాను. ఈ మధ్య హాస్యం ముసుగులో వచ్చే ద్వంద్వార్థ సంభాషణల సినిమాలనీ, సందేశం పేరుతో వచ్చే హింసాత్మక సినిమాలనీ, భక్తి పేరుతో వచ్చే అశ్లీల చిత్రాలనీ చూసి విరక్తి కలిగి కొన్నాళ్ళు తెలుగు సినిమాలనుంచీ విశ్రాంతి తీసుకొన్నాను. కానీ ఈ సినిమాకి వచ్చిన మంచి సమీక్షలు చదివి, అప్పటికీ అంతగా నమ్మకం లేకపోయినా, ఒక రాయి విసిరి చూద్దామన్న ఉద్దేశ్యంతో వెళ్ళిన నన్ను ఈ సినిమా నిరాశ పరచలేదు. పైగా చాలా కాలానికి ఒక చక్కటి కుటుంబ హాస్య కథా చిత్రాన్ని చూసిన అనుభూతి మిగిల్చింది.

ఇక కథ విషయానికి వస్తే సాదాసీదా కథే.. ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకోవడం.. ప్రియురాలు ప్రియుడి ఇంటికి అతిథిగా వచ్చి ప్రియుడి తల్లితండ్రులనీ, అతడి కుటుంబ సభ్యులనీ తన ప్రవర్తనతో ఆకట్టుకోవడం.. ఆ తరువాత ప్రియుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని నయానో, భయానో, యుక్తితోనో, పట్టుదలతోనో ఒప్పించడం వంటి కథాంశం మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ‘మైనే ప్యార్ కియా..’, ‘దిల్‌వాలే..’, ‘నిన్నే పెళ్ళాడతా..’ కాలం నుంచీ.. ఈ మధ్య వచ్చిన ‘నువ్వొస్తానంటే..’, ‘చందమామ’ వంటి సినిమాల వరకూ కొంచెం అటూ ఇటూగా ఇలాంటి కథలే.. అటువంటి మూస కథనుకూడా జనాన్ని మెప్పించగలిగేలా చిత్రీకరించడంలో స్క్రీన్‌ప్లే చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను కూడా హాస్య, వినోద ప్రథానంగా చిత్రీకరించడంతో చక్కని నవ్వులు పండించగలిగారు.

సినిమా ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. హీరో హీరోయిన్లు అడవిలోకి పారిపోవడం, అక్కడ ప్రేమలో పడడం వంటి సన్నివేశాలు ‘క్షణక్షణం’, ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇక హీరోయిన్ అమెరికా వెళ్ళిపోవాలనుకోవడం, పాస్‌పోర్ట్ వచ్చేంతవరకూ హీరో తన ఇంటిలో ఆశ్రయం కల్పించడం వంటివి ‘ఒక్కడు’ సినిమాను పోలి ఉన్నాయి. ఈ విధంగా ప్రథమార్థం మరీ గొప్పగా లేకున్నా, బోర్ మాత్రం కొట్టించలేదు. అడవిలో వచ్చే ఒక ఫైట్‌ను బాగా చిత్రీకరించారు.

సినిమా ద్వితీయార్థం వచ్చేసరికి వేగం పుంజుకొంటుంది. అందుకు ముఖ్యకారణంగా బ్రహ్మానందం పోషించిన ‘మెక్‌డవల్ మూర్తి ‘ పాత్రను చెప్పుకోవాలి. ద్వితీయార్థం సగభాగం వరకూ అసలు నిజం తెలియక, జరుగుతున్న నాటకంలో తనో పావుగా వాడుకోబడుతున్నానన్న విషయం గ్రహించలేక, తనకేదో అతీంద్రీయ శక్తులున్నట్టుగా భ్రమలో బతికే సన్నివేశాలు ఒక ఎత్తయితే… అసలు విషయం గ్రహించి, మింగలేక, కక్కలేక, తను ఎంత బయటకు రావాలంటే అంతకు మరింత ఊబిలో కూరుకొని మథనపడే పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రను ‘డీ’ సినిమాలోని ‘చారి’ పాత్రకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైన తేడా అల్లా ‘డీ’ లో అతని పాత్ర లేకున్నా కథాగమనానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ ఈ సినిమాలో అతని పాత్ర లేకుండా కథే ముందుకు నడవదు. అంతటి ముఖ్య పాత్రను అవలీలగా పోషించి తనకు తనే సాటి అని మరోసారి నిరూపించుకొన్నాడు.

ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే హీరో రాం చక్కటి ఈజ్ తో నటించాడు. డ్యాన్స్‌లు, ఫైట్‌లతో పాటు చక్కటి హావభావాలను కూడా పలికించగలిగాడు. కానీ ఇతని నటనపై ‘పవన్ కళ్యాణ్’ ప్రభావం చాలా చోట్ల కనిపించింది. అది పోగొట్టుకొని సొంత శైలిని అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ‘జెనీలియా’కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అయిపోయినట్టున్నాయి. ఆమె మొదటి సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణతి సాధించినట్టే చెప్పుకోవాలి.

ఇక శాస్త్రీయ నృత్యం నేర్చుకొంటూ, ఆ క్రమంలో తన మగలక్షణాలు కోల్పోయి ఆడంగి వేషాలు వేసే పాత్రలో సునీల్, హీరో హీరోయిన్లకు లిఫ్ట్ ఇచ్చి ఆపై విలన్లకు దొరికిపోయి చివరి వరకూ వారి గొడ్లచావడిలో బందీగా పడిఉండే పాత్రలో ధర్మవరపు చక్కగా ఇమిడిపోయారు. ఫ్యాక్షనిస్టు సోదరులుగా అటు విలనీని, ఇటు హాస్యాన్ని సమపాళ్ళలో పోషించగలిగే కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి లను ఎంచుకోవడం పాత్రల ఎంపికపై దర్శకుడు పెట్టిన శ్రద్ధను చూపుతుంది. వీరి కొడుకులుగా నటించిన ‘షపీ’, ‘రవితేజ తమ్ముడు’ పాత్రలు కొంత విలనీని సృష్టించేదుకు తప్ప అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు. ‘చికాగో సుబ్బారావు’ గా నాజర్, ‘డల్లాస్ నాగేశ్వరరావు’ గా తనికెళ్ళ భరణి బాగానే నటించారు.

ఈ సినిమాలో మరో హాస్య ప్రధాన పాత్ర.. జయప్రకాష్ రెడ్డి మనవడై తాతగారి అడుగుజాడల్లో నడిచి పెద్ద ఫ్యాక్షనిష్టు అయిపోవాలని బిల్డప్పులిచ్చే పిల్లవాడి పాత్ర. ఈ పిల్లవాడిని ‘పంచత్రంత్రం’ సినిమాలో మొట్టమొదటిగా ‘హార్టులో హోళు ‘ ( hole in the heart ) ఉన్న మళయాళం అబ్బాయి పాత్రలో చూసినప్పుడే ఎంతో ఆకట్టుకొన్నాడు. చక్కటి టైమింగ్, హావభావాలు పలికించగలిగే ఈ పిల్లవాడు భవిష్యత్తులో మరింత పెద్ద కమెడియన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

ఈ విధంగా సినిమాలో ప్రతీ పాత్ర దానికై ఒక ప్రాధాన్యతను కలిగి ఉండి, అదే సమయంలో కథలో ఇమిడిపోయి, తనవంతుగా కథనాన్ని రక్తికట్టించడంలో తోడ్పడడంతో ద్వితీయార్థం మొత్తం నవ్వుల జల్లు కురిసి చక్కటి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు.

ఇక సంభాషణల విషయానికి వస్తే చాలా చోట్ల హాస్యాన్ని పండించడంలో తోడ్పడ్డాయి. చివరిలో ‘వాళ్ళు మనల్ని మోసం చేయలేదు.. మనుషుల్ని చేసారు..’ వంటి సెంటిమెంట్ సంభాషణలు కూడా సన్నివేశానికి అనుగుణంగా బాగున్నాయి. సంగీతం విడిగా అంత గొప్పగా లేకున్నా, సినిమాలో సందర్భానుసారంగా చూస్తే బాగున్నట్టే చెప్పాలి.

మొత్తం మీద ఒక రెండున్నరగంటల సేపు అన్నీ మరచిపోయి సరదాగా కుటుంబంతో నవ్వుకొని రావాలంటే మిస్ అవ్వకుండా తప్ప చూడాల్సిన సినిమా ‘రెడీ’. మరెందుకు ఆలస్యం.. పోయి చూసి రండి..!!

కొసమెరుపు: ఇంతటి చక్కటి టాలెంట్ ఉన్న దర్శకుడు ‘శ్రీను వైట్ల ‘, చిరంజీవి లాంటి స్టార్‌హీరోతో ‘అందరివాడు ‘ లాంటి పరమ చెత్త సినిమాను ఎలా తీసాడో తలచుకొంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది..!!

చిర్రెత్తించిన “చిరుత”

ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు.

చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” అన్నట్లు ఏడవలేక వచ్చే నవ్వులు చాలాసార్లు వినిపించాయి.

కథ విషయానికి వస్తే, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడం, తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, పొగరుబోతు హీరోయిన్ తిక్క కుదిర్చి ప్రేమాయణం సాగించడం.. ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు..? కొడుకు కెరీర్‌ను శ్రద్ధగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, తన కొడుకు తొలి సినిమాకు ఇంత మూస కథను ఎన్నుకోవడం విచిత్రమే.

ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం పెద్ద మైనస్. పాటలు ఎక్కడా వినసొంపుగా లేవు. చిరంజీవి కొడుకు సినిమా కనుక పాటలు ఆ మాత్రం అన్నా పాపులర్ అయ్యాయి. చిరంజీవితో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ, ఈ చిత్రానికి ఇంత నాసిరకం సంగీతాన్ని అందించాడంటే ఆశ్చర్యమే. 

ఇక చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలందరికీ హీరోయిన్లను ఎన్నుకోవడంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల ఇటీవలి సినిమాలకు హీరోయిన్‌లు ఎంత మైనస్ అయ్యారో తెలిసిన విషయమే. అదే జాడ్యం ఈ సినిమాకూ పట్టుకొంది. ఒక్కోసారి హీరోయిన్‌ను మిగిలిన స్నేహితురాళ్ళతో కలిపి చూపిస్తే గుర్తించడమే కష్టం అయ్యింది.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, ఎంత చెత్త సినిమానైనా “ఏరా”, “ఒరే”, “ఏమ్మా”, “పోమ్మా” లాంటి మాస్ పదాలతో లాగించేయచ్చనే కాన్‌ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది.  ఇందులోనూ హీరో, హీరోయిన్ల మధ్యన అతి సంభాషణా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాల్లో ఈ సంభాషణలు క్లిక్ అయినా, ప్రతీ సినిమాకీ అదే కొనసాగిస్తే ఎప్పుడో ప్రేక్షకులు తిప్పికొడతారన్న విషయం పూరీ గుర్తించాలి. అదే విధంగా క్లాస్ సినిమాగా తీయాలా, లేక మాస్‌ను ఆకర్షించాలా అనే విషయంలో కూడా పూరీ కన్‌ఫ్యూజన్ స్పష్టంగానే కనిపించిపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ కొన్నిచోట్ల “సూపర్” సినిమాను తలపించింది. ముఖ్యంగా వాటర్ స్కూటర్ ఫైట్ అయితే “సూపర్” క్లైమాక్స్ సన్నివేశాన్నే గుర్తుకు తెచ్చింది.

ఈ సినిమాలో కొద్దో గొప్పో హాస్యం అంటే ఆలీ గూర్చే చెప్పుకోవాలి. “యు వాంట్ థాయ్ మస్సా..” అంటూ పర్యాటకులను మసాజ్‌తో ఆకట్టుకొనే ఆడ బ్రోకర్ పాత్రను పోషించాడు. ఆలీకి ఆడవేషం కొత్త కాకపోయినా, సాధ్యమైనంత వరకూ కొత్త మేనరిజంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇక అమెరికాలో, చిరంజీవి ఇమేజ్‌ను సొమ్ముచేసుకోవడానికి టిక్కెట్టు రేటును 15 డాలర్లు చేయడం కోపం తెప్పించింది. ఈ మధ్య అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో రేట్లు కూడా బాగా గుంజి జనాలను దోచుకొంటున్నారు.

చివరిగా, రాంచరణ్ నటన ఫరవాలేదు. ఎక్కడా మొదటి సినిమా అన్న బెరకు కనిపించలేదు. డైలాగ్ డెలివరీ కొంత మెరగుపరచుకోవలసి ఉంది. డాన్స్‌లు, ఫైట్‌లు భాగా చేశాడు. కానీ, నటనలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల ఛాయలు కనిపించాయి. వాటిని పోగొట్టుకొని సొంత స్టైల్‌ను అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక రాంచరణ్ రెండవ సినిమా రాజమౌళితోనట. హింస, అశ్లీలతలపై ఆధారపడి పబ్బం గడుపుకొనే రాజమౌళి చేతిలో పడితే మాస్ మూసలో పడి ఇతని భవిష్యత్ కొట్టుకుపోవడం ఖాయం. ఇటువంటి దర్శకులను ఎన్నుకొనేబదులు, కథాబలం గల సినిమాలు తీస్తూ టాలెంట్ పుష్కలంగా గల “శేఖర్ కమ్ముల”, “చంద్ర శేఖర్ యేలేటి”, “శేఖర్ సూరి”, “చంద్ర సిధ్ధార్థ” లాంటి దర్శకుల చేతిలో పడితే ఇతని భవిష్యత్‌కు ఇంకా ఉపకరిస్తుందని నా అభిప్రాయం.                 

కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

ఎవరినైనా “నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఏవి..?” అని ప్రశ్నిస్తే, చాలామంది చెప్పే సమాధానం “కాలేజీ రోజులు” అనే. అదే ఆ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఆ అనుభూతులే ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే రెండున్నర గంటల సినిమాగా మలచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

కథ విషయానికి వస్తే, నాలుగు జంటల ఇంజనీరింగ్ కాలేజీ  అనుభవాలే “హ్యాపీ డేస్”. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు రోజూ ఎదురయ్యే అన్ని అనుభవాలనీ రంగరించి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. కాలేజీ తొలినాళ్ళలో ఎదురయ్యే ర్యాగింగ్ అనుభవాలు, పొగరుగా ప్రవర్తించే జూనియర్ల కొమ్ములు వంచే సీనియర్లు, కొత్త పరిచయాలు, ఫ్రెషర్స్ పార్టీ, సంవత్సరమంతా ఎంజాయ్ చేసి చివర్లో నైట్అవుట్‌లతో, కాపీలతో గట్టెక్కే విద్యార్థులు, ఆ వయస్సులో క్లాస్‌మేట్, సీనియర్, లెక్చరర్ అన్న బేధం లేకుండా ఆపోజిట్ సెక్స్ పై కలిగే ఆకర్షణ, ప్రేమ, స్నేహితుల మధ్య చిన్న చిన్న పంతాలు, పట్టింపులు, కష్టసుఖాలను పంచుకోవడం, చివరిగా ఫేర్‌వెల్ పార్టీ సమయానికి కళ్ళు చెమర్చడం.. ఇలాంటి అన్ని అనుభవాలకు దృశ్యరూపమే “హ్యాపీ డేస్”.

ఈ సినిమాలోని నటీనటులందరూ కొత్తవారే. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకుగా నటించిన “రాజేష్” పాత్రధారి నటనలో ఈజ్ బావుంది. సీనియర్ అమ్మాయి “స్రవంతి” కూడా భావాలను బాగా ప్రదర్శించింది. కమలినీ ముఖర్జీ ఒక యంగ్ లెక్చరర్‌గా తళుక్కుమంది. విద్యార్థులకు యంగ్ లేడీ లెక్చరర్లపై ఉండే ఆకర్షణను మోతాదు మించకుండా చిత్రీకరించడం, ఆ లెక్చరర్ పాత్రకు కమలినీను ఎన్నుకోవడం శెఖర్ కమ్ముల పరిణతిని చూపించింది. సినిమాలో కమెడియన్లు ఎవ్వరూ లేకపోయినా, శేఖర్ కమ్ముల రాసిన సంభాషణలు, ప్రేక్షకుల పెదవులమీద చిన్న చిరునవ్వును మొదటినుంచీ చివరివరకూ చెరగకుండా చేసాయి.

ఇక సంగీతం విషయానికి వస్తే, రాధాకృష్ణన్‌ను కాక, మిక్కీ జీ మేయర్‌ను ఎంచుకొని దర్శకుడు మంచిపని చేసాడనిపించింది. పాటలన్నీ శ్రావ్యంగా ఉండడమే కాక, చిత్రీకరణపరంగా కూడా బాగున్నాయి.

ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన గురించి చెప్పాలి. చిరంజీవి కొడుకు నటించిన “చిరుత” కూడా ఇదే సమయంలో విడుదల అవటంచేత ఈ సినిమా థియేటర్ ఖాళీగా ఉంటుందని ఊహించిన నా అంచనా తప్పయ్యింది. బారులు తీరిన క్యూచివర్లో నుంచుని, ముందునుంచి రెండో వరుసలో కూర్చొని, సినిమా చూడవలసి వచ్చింది 🙂 సినిమా సాగుతున్నంత సేఫూ జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేసారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న ఆదరణ ఈ చిత్రంతో మరోసారి రుజువయ్యింది.

వ్యక్తిగతంగా చూస్తే, నాకు “ఆనంద్”, “గోదావరి” చిత్రాలకన్నా ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బావున్నట్టు అనింపించింది. సినిమాలో కథ ఏమీ లేకుండా రెండున్నర గంటలు నడపడమంటే కత్తిమీద సామే. ఈ సినిమాలో కూడా కొన్ని అవసరం లేని సన్నివేశాలు, సాగదీయబడిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే ఈ సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా చూడచ్చు.

తెలుగులో ఈ మధ్యకాలంలో కాలేజీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు రాలేదు.  “హృదయం”, “ప్రేమదేశం” లాంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలయినా ఎంత సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులందరూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అయినా తమని తాము అయిడెంటిఫై చేసుకొంటే, ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే పెళ్ళాడుతా” లాంటి సినిమాలు విజయవంతమవడానికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్లు కూడా కామెడీ పండించడం. ఈ సినిమా కథ ప్రకారం దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, నవదీప్, రెండో హీరోయిన్ వేసిన వెర్రి వేషాలను కామెడీ అని భావించేంత సహృదయం నాకు లేదు.

ఇక ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం వివరిస్తాను. హీరోయిన్ కాజల్, హీరో నవదీప్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రాత్రి హీరోయిన్ తప్పతాగి హీరో ఇంట్లో నిద్ర పోతుంది. పొద్దున్న లేచి చూసేసరికి, వంటి మీద వేరే దుస్తులు ఉంటాయి. రాత్రి ఏం జరిగిందని అడిగితే, హీరో కొంటె నవ్వు నవ్వుతూ “ఏం జరిగిందో నీకు తెలియదా..?” అంటాడు. ఎక్కడో చూసినట్టుందికదూ..? “దిల్‌వాలే..”, “బావగారూ బాగున్నారా..” లాంటి సినిమాలనుండి అరగగొట్టి పారేసిన ఈ సీనే ఈ సినిమాలోని కీలక సన్నివేశం. దీన్ని బట్టి మిగిలిన కథ ఎంత గొప్పగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం సాగదీతగానే అనిపించింది. ప్రారంభంలో భారతదేశ గొప్పతనంపై వచ్చే సన్నివేశాలు, నాగబాబు కూతురు కాజల్ కి పెళ్ళికొడుకును వెతికే సన్నివేశాలు, నవదీఫ్ కాజల్‌ను పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బతిమాలే సన్నివేశాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో..

ఇక ఈ సినిమా ముఖ్య విషయంలోనే లోపం ఉంది. హీరోయిన్ కాజల్, తండ్రికి జరిగిన విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదని తెలిసినా చివరివరకూ సా..గదీసి, క్లయిమాక్స్ లో చెప్పడం చూసి “ఇదేదో ముందే చెప్పి తగలడుంటే మాకీ మూడు గంటల నరకం తప్పేదిగా..” అని సగటు ప్రేక్షకుడు బాధ పడితే తప్పేమీ లేదు.

రొటీన్ తెలుగు సినిమాలలోలాగానే పతాక సన్నివేశంలో ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకొంటారో ఒక పెద్ద సస్పెన్సు అయినట్టు బిల్డప్పు, ఉన్నట్టుండి ఆహుతి ప్రసాద్ చిన్న సైజు విలన్‌గా మారిపోవడం, నాగబాబు ప్రేక్షకులు అందరివైపుకీ తిరిగి, ఆడపిల్లల మనస్తత్వం తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదంటూ క్లాసు పీకడం.. అన్నీ మూస సినిమాను తలపించాయి. ఉన్నంతలో శివ బాలాజీ, కాజల్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది.

ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్న విషయానికి వస్తే, ఇంతకంటే చెత్త సినిమాలు ఎన్నో (ఉదాహరణకు “వసంతం”, “లక్ష్మీ”, “నేనున్నాను” వంటివి) కుటుంబ, మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఘన చరిత్రను చూసాను కాబట్టి, ఈ విషయాన్ని కాలానికే వదిలేస్తున్నాను. కొసమెరపు ఏమిటంటే.. నాతో పాటూ సినిమాకు వచ్చిన నా భార్య “సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు కదా..” అని అనటం..!!

  

“చక్ దే ఇండియా..” – ఒక మంచి చిత్రం

నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత భావాలను చక్కగా పలికించాడు. ముఖ్యంగా అతని వయసుకు తగ్గ పాత్రలో రాణించాడు. గత కొన్ని చిత్రాలలో కొంత వయసు మీద పడ్డట్టు కనిపించినా, ఈ చిత్రంలో మాత్రం అందంగా కనిపించాడు. “స్వదేశ్” చిత్రం తరువాత ఇది అతనికి మరో మంచి చిత్రం అవుతుంది.

ఇక కథాంశానికి వస్తే, ప్రస్తుత భారతదేశ క్రీడాచిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిందీ చిత్రం. భారతదేశంలో క్రికెటేతర క్రీడలకు కరువవుతున్న ప్రోత్సాహం, ఆదరణ, ముఖ్యంగా జాతీయ క్రీడ “హాకీ” కి పట్టిన దుస్థితి, మహిళా క్రీడాకారులపై చులకనాభావం, సెలెక్షన్ ప్రక్రియలోని లోపాలు, బోర్డు సభ్యుల రాజకీయాలు, క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా కాక, రాష్ట్రాల వారీగా ఎంపిక చేయటం, మహిళలకు కుటుంబ సభ్యులనుండి, సమాజం నుండి తగిన ప్రోత్సాహం లేక పోవడం, క్రీడాకారులలో అనైక్యత, సమిష్టి తత్వం, పోరాట తత్వం కొరవడడం,  క్రికెట్ పై ఉన్న మోజు జనానికి ఇతర క్రీడలపై లేక పోవడం, క్రీడాకారులకు లభిస్తున్న అరకొర సదుపాయాలు, క్రీడాకారులు వ్యక్తిగత రికార్డులకై పాకులాడుతూ జట్టును నిర్లక్ష్యం చేయడం, క్రీడాకారులలో గ్రూపు తగాదాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, జాతీయ జట్టుకు ఎంపికైపోయాములే అన్న నిర్లక్ష్యం, అహంభావం, కోచింగ్ ప్రమాణాలు, క్రీడాకారులకు కావలసిన మంచి లక్షణాలైన సమన్వయం, అవగాహన, క్రీడలకు రాజకీయాలను, మతాన్నీ ముడి పెట్టడం , క్రీడలను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించడం, గెలిస్తే క్రీడాకారులను అందలం ఎక్కించటం, ఓడితే పాతాళానికి తోసివేయటం, ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్నో.. ఇన్ని అంశాలను స్పృశించినా, ఎక్కడా అసభ్యత, అశ్లీలత వంటి వాటికి తావీయకుండా, సాగదీయకుండా సంక్షిప్త మైన మాటలతో, మనసుకు హత్తుకొనే దృశ్యాలతో, మధురమైన, ఉత్తేజపూరితమైన నేపథ్య సంగీతంతో సినిమా సాగిపోయింది. ఇటువంటి చిత్రాన్ని తీసిన యూనిట్ సభ్యులందరూ అభినందనీయులు. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం “చక్ దే ఇండియా”.

గమనిక : ఇందులో భారత క్రికెట్ వైస్ కెప్టెన్ “అభిమన్యు సింగ్” పాత్ర, భారతీయ క్రికెటర్ “యువరాజ్ సింగ్” ను పోలివుండడం యాదృచ్చికం కాదనుకుంటాను.

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను.

మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను.

“యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో ని హతమార్చడానికి కొందరు పథకం వేస్తే, ఇందులోనూ అంతే. పోతే అందులో చిత్రగుప్తుడి పొరబాటు వల్ల హీరో నరకానికి కొనిరాబడితే, ఇక్కడ పగ తీర్చుకోవడానికి యముడి ఆజ్ఞ పైన కొనిరాబడతాడు. అక్కడ రెండవ చిరంజీవి అమాయకుడు. అతనికి 21 సంవత్సరాలు నిండాక ఆస్తిపై తమ హక్కును కోల్పోతామని గ్రహించి విష ప్రయోగంతో హత్య చేస్తారు అతని బంధువులు. ఈ సినిమాలో రెండవ చిరంజీవి పాత్రను ప్రియమణి పోషించింది. ఈమె ఆస్తిపైనా బంధువులు పెత్తనం చెలాయిస్తుంటారు. ఒక్కోసారి కొరడాతో కూడా చావగొడతారు. ఆస్తి తమకే దక్కాలన్న స్వార్థంతో హత్యాయత్నం కూడా చేస్తారు. పోతే హీరో ఈ హత్యాయత్నాన్ని తెలియకుండా అడ్డుకోవడం, వారిద్దరి మధ్య ప్రేమ, ఇవన్నీ పైపై మెరుగులు. చివర్లో ఆమె బంధువులతో ఇంటిపనులు చేయించడం, అంట్లు తోమించడం ఇలా ఎన్నో పోలికలు. ఆ సినిమాలో చివర్లో చిరంజీవికి మరణం సంభవించబోతుంది. కాని యముడి ఆశీస్సులతో “చిరంజీవి” అవుతాడు.  ఈ సినిమాలోనూ రెండవ “యమగండం” పేరు చెప్పి హీరోను రెండవ మారు చంపడానికి ప్రయత్నిస్తాడు యముడు. ఇవన్నిటితో చూస్తే జ్యోతి గారన్నట్లు ఈ సినిమా “కొత్త సీసాలో పాత మందే”..!!

పోతే “యముడి కి మొగుడు” లో యముడి పాత్ర ఎంతో హుందాగా చిత్రీకరించబడింది. చిత్రగుప్తుడు చేసిన పొరపాటును దిద్దడానికి ధర్మపరిరక్షకుడైన యముడు అనుక్షణం పరితపిస్తాడు. ఇకపోతే “యమదొంగ” సినిమాలో యముడి పాత్రకు ఈర్ష్య, ద్వేషాలను ఆపాదించి కుటిలుడుగా చిత్రీకరించారు. పోతే మోహన్‌బాబు ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కుటిలత్వాన్ని బాగా ప్రదర్శించినా, అతని డైలాగ్ పవర్‌కి సరిపోయే మాటలు ఈ సినిమాలో లేవనే చెప్పాలి. ఇక చిత్రగుప్తుడి పాత్రను ఒక విటుడిలా చిత్రీకరించడం, భూలోకం నుంచి వచ్చిన వేశ్యతో కులకాలని చూడటం, అందుకు శిక్షలు మాఫీ చెయ్యడం లేదా తగ్గించడం, యమలోకాన్ని ఒక గవర్న్‌మెంట్ ఆఫీసుకన్నా హీనంగా, ఒక వ్యభిచార గృహం కంటే దారుణంగా చిత్రీకరించడం.. ఇవన్నీ హాస్యం ముసుగులో హిందూ దేవుళ్ళని కించపరచడమే. ఈ ఖర్మ హిందువులకేనేమో. వేరే ఏ మతం వారిపైనైనా ఇలాంటి దృశ్యాలను చిత్రీకరిస్తే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచి ఉండేది.

ఏది ఏమైనా మిగిలిన యమలోక సన్నివేశాలు కూడా యమగోల, యముడికి మొగుడు చిత్రాలను తలపించాయే తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. కేవలం డ్యాన్సు, ఫైట్లు, అసభ్యత, అశ్లీలత లను నమ్ముకుని ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం డబ్బుతో జూదమాడటమే. స్టార్ కాస్టింగ్, గ్రాఫిక్స్‌లపై పెట్టిన శ్రద్ధ కథ, కథనం పై పెట్టి ఉంటే, N.T.R అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమా “సింహాద్రి” ని మించిన బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఈ విషయంలో మాత్రం రాజమౌళి N.T.R అభిమానులను నిరాశపరచినట్టే.