2008 మధుర జ్ఞాపకాలు – 1

దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా.. కొత్తసంవత్సరం వచ్చిన రెండు నెలలకు గత సంవత్సర జ్ఞాపకాలంటాడేమిటి అని ఆశ్చర్యపోకండి. ఇన్నాళ్ళ నా బ్లాగ్నిశబ్దానికి కారణాలు అవే..!!

2007 లో నేను మా నాన్నగారికీ, అక్కకీ కట్టించిన ఇళ్ళ గృహప్రవేశాలు అయినట్టుగా నా గత బ్లాగు “నెరవేరిన నా జీవిత ఆశయం” లో తెలియపరచాను. అప్పటివరకూ అమెరికాలో సొంత ఇంటిగురించి కనీసం ఆలోచనైనా చేయని నాకు, బాధ్యతలు కొంతవరకూ తీరడంతో, నెమ్మదిగా ఆ కోరిక పుట్టింది. 2007 డిశంబరు నెలలో సొంత ఇంటికై ప్రయత్నాలు మొదలు పెట్టాను.

ముందుగా నా మరియు నా భార్య మనస్తత్వాన్ని బట్టీ, నా అన్వేషణకు పరిమితులు విధించుకొన్నాను. అప్పటికి ఆరేళ్ళుగా, మా కంపెనీకి రెండు మైళ్ళ దూరంలోనే ఉన్న అపార్టుమెంటులోనే నివసిస్తూ ఉండడం వల్ల, ప్రతీ రోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, వేడి వేడిగా భోచేసి, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళడం అలవాటయిపోయింది. నా భార్యకు కూడా, పొద్దున్నే లేచి వంట చేయడమో, ముందు రాత్రే మర్నాటికి సరిపడా వండి వుంచడమో లాంటి శ్రమ ఉండేది కాదు. అందులోనూ మధ్యాహ్నం ఒకసారి నేను రావడం వల్ల తనకీ పొద్దుటినుంచీ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న భావనా కలిగేది కాదు. అంతే కాక, నాకు ఎక్కువసేపు కారు డ్రైవ్ చేయాలన్నా చిరాకు, అసహనం వచ్చేస్తుంది. అందువల్ల ముందుగా మేము విధించుకొన్న పరిమితి: సొంత ఇల్లు కంపెనీకి దగ్గిరగా ఉండాలి అని.  ఇక మాఇద్దరి మనస్తత్వాల ప్రకారం, ఇంట్లో ఏదైనా చిన్నా చితకా రిపేర్లు వస్తే సొంతంగా చేసుకోగలిగే ఓపికా, సహనం లేవు. అందువల్ల పాత ఇంటిని కొని మా సామర్థ్యాన్ని పరీక్షించుకొనే కన్నా, కొత్త ఇంటినే తీసుకొంటే ఈ తలనొప్పులేవీ ఉండవని ఒక తెలివైన (?) ఆలోచన చేశాము. ఇక ఆరేళ్ళుగా అపార్ట్‌మెంటు జీవితానికి అలవాటు పడ్డ ప్రాణాలేమో, పెద్దగా, విశాలంగా, ఒక దానికి ఒకటి దూరంగా విసిరేసినట్లుండి, పక్కింటి వాడిని చూడడానికే మొహం వాచిపొయే ఇళ్ళవంక కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకొన్నాం. ఇక స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, క్లబ్ హవుసులు ఉన్న ఇళ్ళ సముదాయమైతే బహు బాగు అని అనుకున్నాం.

మా ఈ పరిమితులకు సరిపడే ఇళ్ళ సముదాయాలు ఒక రెండు కనిపించాయి. వాటిలో ఒక దాని నిర్మాణం అప్పుడే ప్రారంభించడం వల్ల ఇంకా మొదటి విడత ఇళ్ళనే అమ్మకానికి పెట్టారు. మరో రెండు సంవత్సరాల వరకూ అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఆ పనులకు సంబంధించిన వాహనాల రొదతో రోజూ సుప్రభాతం పాడించుకొనే కోరిక లేక, రెండవ సముదాయమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అప్పటికే ఆ సముదాయ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యి, చివరి విడత అమ్మకాలు సాగుతున్నాయి. మాకు అందుబాటులో ఉన్న రెండు మూడు ఇళ్ళ ప్లానులు, వాటి ప్రధాన ద్వార దిశ మొదలైనవి పరిశీలించి, తూర్పు దిశగా ఉన్న ఒక ఇంటికై అడ్వాన్సు ఇచ్చాం. ఆ విధంగా 2007 డిశంబరు నెలలో ప్రారంభమైన మా అన్వేషణ, 2008 ఫిబ్రవరి నెలాఖరుకల్లా ముగిసింది.

అప్పటికి మా ఇంటికి పునాదులు మాత్రమే తవ్వబడ్డాయి. ఇల్లు పూర్తవడానికి మరో ఆరునెలల సమయం ఉంది. ఈ లోపుగా ఆ నిర్మాణ సంస్థ వారి డిజైన్ స్టూడియోకి వెళ్ళి ఇంటిలోకి కావలసిన గ్రానైట్, వుడ్ ఫ్లోరింగ్, కార్పెట్, కాబినెట్స్, టైల్స్ మున్నగున వాటిని మా అభిరుచులకు తగ్గట్లుగా ఎంపిక చేశాం. ఇల్లు పూర్తయ్యే ఆరు నెలలలోనూ, రెండు మూడు సార్లు, వివిధ నిర్మాణ దశలలో ఇంటి పురోగతిపై అవగాహన కల్పించడానికి  నిర్మాణ సంస్థ వారు దగ్గిరుండి మరీ ఇంటిని చూపించారు. ఇల్లు మరో నెల రోజులలో చేతికి వస్తుందనంగా, వివిధ ఫర్నిచర్ షాపులకు వెళ్ళి, ఇంటికి కావలసిన సోఫా, డైనింగ్ టేబుల్, కాఫీ టేబుల్, LCD టీవీ మొదలైన వాటిని కొన్నాం. మొత్తానికి ఆరునెలలలో ఇల్లు పూర్తయ్యి, 2008 ఆగష్టు నెలాఖరికల్లా కొత్త ఇంటిలో గృహప్రవేశం చేయగలిగాము.

ఇంతకీ ఈ ఇల్లు డ్యూప్లెక్స్ ఇల్లు. బేస్‌మెంటులో  రెండుకార్లు పెట్టుకొనే గ్యారేజు, ఒక హాబీ రూం, మొదటి అంతస్తులో లివింగ్ రూం, డైనింగ్ రూం, కిచెన్, ఫ్యామిలీ రూం, పౌడర్ రూం (అంటే 1/2 బాత్), రెండవ అంతస్తులో రెండు గెస్టు బెడ్ రూంస్, లాండ్రీ రూం, సెకండ్ బాత్ రూం, మాష్టర్ బెడ్ రూం, మాష్టర్ బాత్ రూం. ఇక ఇంటి ముందు పై కప్పుతో ఉండే ఒక చిన్న వరండా (పోర్చ్). ఇక మా ఇంటికీ, పక్క ఇంటికీ మధ్య ఒక చిన్న సైడ్ యార్డ్ (సందు లాంటిది). ఇదండీ మా ఇంటి ప్లాన్.

ఈ ఇంటికి ఎప్పుడైతే వచ్చామో, అప్పటినించీ మా వారాంతం మా చేతులలో ఉండడం లేదు. ఇంత పెద్ద ఇల్లును విడతలు విడతలుగా శుభ్రం చేసుకోవడంతోనే గడిచిపోతోంది. అందులోనూ సంతృప్తి ఉందనుకోండి. కానీ ఎప్పుడో వారాంతంలో ఒకసారి బ్లాగు రాసే నేను, ఈ మధ్య  పనులవల్ల అలసిపోయి, మంచం ఎక్కితే చాలు గుర్రుకొట్టి నిద్రపోతున్నాను. కొత్త ఇల్లేకాక, నా బ్లాగ్నిశబ్దానికి మరో కారణం కూడా ఉంది. అది తరువాతి బ్లాగులో తెలియపరుస్తాను. అంతవరకు మా ఇంటి ఫొటోలను చూడండి…

దీపావళి: ‘సిసింద్రీ’ జ్ఞాపకాలు

దీపావళి వచ్చేసింది.. చిన్ననాటి జ్ఞాపకాలను వెంట తెచ్చేసింది.. దీపావళి.. నాకు అన్నింటికన్నా ఇష్టమైన పండగ. జీవితంలో ఎన్నో మధురానుభూతులను అందించిన పండగ. చిన్నప్పుడు మా ఊరిలో ఈ పండగ వస్తోందంటే మేం చేసే హడావిడి అంతా ఇంతా కాదు..

దీపావళి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది బాణసంచా.. మా చిన్నప్పుడు ఇప్పటిలా బాణసంచా కొట్లలో రెడేమేడ్‌గా కొనేవారు కాదు. ప్రతీ ఇంట్లోనూ చిన్న పెద్దా తేడాలేకుండా ఎవరికివారే బాణాసంచా తయారుచేసుకొనేవారు. ఇక కుర్రకారు హడావిడి అయితే నెలరోజుల ముందే మొదలయిపోయేది. మేము చిన్నప్పుడు ఇష్టపడి తయారుచేసిన బాణసంచా.. “సిసింద్రీలు”..!!

ఒక అంగుళం పొడుగులో సన్నగా శంకువు ఆకారంలో నల్లటి మందు నింపి ఉన్న కాగితపు గొట్టమే సిసింద్రీ. దీని తోకభాగాన్ని కొద్దిగా చింపి, నిప్పు అంటించి వదిలితే.. 5-10 సెకన్లపాటూ అది చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇది తయారు చేసే విధానం చాలా సులువు కావడం, పడ్డ కష్టానికి ఎన్నో రెట్లు మజా రావడం, మిగిలిన వాటితో పోలిస్తే ప్రమాదం కలిగే అవకాశం తక్కువ కావడం వల్ల చాలామంది కుర్రకారు వీటిని తయారుచేసేవారు.

ఈ సిసింద్రీ గొట్టం తయారీకి ముఖ్యంగా కావలసింది..కాగితం, కొన్ని అన్నం మెతుకులు, ఒక ఈనుప్పుల్ల. దినపత్రికల కాగితాలనుంచీ సోవియట్ కాగితాలవరకూ ఎవరి స్తోమతకు తగ్గ కాగితాన్ని వారు ఉపయోగించేవారు. దళసరి కాగితం అయితే మందు దట్టించడానికి వీలుగా ఉండడమే కాక, సిసింద్రీ చేతిలో చీదే అవకాశాలు తక్కువ. ముందుగా కాగితాన్ని సుమారు 2X2 అంగుళాల చతురస్రాకారంలో కత్తిరించొకొని, ఒక ఈనుప్పుల్లను ఆ కాగితం అంచులో ఉంచి, ఒకవైపు నొక్కి పట్టుకొని, మరోవైపు పుల్లతో పాటుగా కాగితాన్ని తిప్పుకొంటూ పోతే గొట్టం అకారం తయారవుతుంది. కాగితం అంచుల్ని జాగ్రత్తగా అన్నం మెతుకుల జిగురుతో అతికించి, సన్నటి కొనని కొద్దిగా మడిస్తే గొట్టం తయార్..!!

ఇలా తయారయిన గొట్టాలను తడి ఆరేవరకు ఎండబెట్టిన తరువాత మందుకూరడానికి వాడుకోవచ్చు. సిసింద్రీకి దళసరి కాగితం, సన్నని ఆకారం ఎంత ముఖ్యమో, నాణ్యత గల మందు అంతే ప్రధానం. అందుకే కొంచెం ఖరీదైనా మంచిరకం మందునే కొనేవాళ్ళం. ఈ మందును సూరేకారం, గంధకం కలిపి తయారు చేస్తారని జ్ఞాపకం. మంచిరకం మందును ఎండలో పెడితే మెరుపు కనిపించాలి, లేకుంటే బొగ్గుపొడి కలిసి కల్తీ జరిగినట్టు లెక్క. అలాగే కొనేముందు కొంత మందును మండించి సంతృప్తి చెందితే కానీ కొనేవాళ్ళం కాదు. ఈ మందును కొంతసేపు ఎండలో ఉంచి గొట్టాలను నింపడానికి వాడుకోవచ్చు. గొట్టంలో కొద్దికొద్దిగా మందు నింపుతూ, ఈనుప్పుల్లతో దట్టించాలి. ఇలా 4-5 దఫాలుగా గొట్టాన్ని 90% వరకూ నింపి, మిగిలిన ఖాళీని మందు కారిపోకుండా మూయడానికి ఉపయోగించాలి. ఇలా తయారైన సిసింద్రీని చూపుడువేలు, బొటనవేలు మధ్య నొక్కి చూస్తే గట్టి రాయిలా ఉండి, రెండువైపులా మందు కారిపోకుండా ఉంటే నాణ్యత బాగున్నట్టు లెక్క.

ఈ మాత్రం కష్టం కూడా పడకుండా సిసింద్రీని ఆస్వాదించాలనుకొనే వారికి వీలుగా కొంతమంది కుర్రకారు సిసింద్రీ వ్యాపారాన్ని చేసేవాళ్ళు. ఖాళి గొట్టాలనుంచీ, కూరిన సిసింద్రీలవరకూ 50-100 చొప్పున అమ్ముకొని లాభాలతో పాకెట్ మనీ సంపాదించుకొనేవారు. అప్పట్లో 100 సిసింద్రీలు ఖరీదు 3-4రూ|| ఉండేది.

ఇక ఈ సిసింద్రీలను అంటించడానికి కొంతమంది అగరొత్తులను ఉపయోగించినా, సరైన సాధనం మాత్రం “చాంతాడు”. లావుగా, బలంగా ఉండి నూతినుంచి చేదను పైకి లాగడానికి ఉపయోగించే ఈ చాంతాడు ముక్కను ఒకవైపు వెలిగిస్తే ఇక అది ఆరిపోయే సమస్యే లేదు. ఒక చేత్తో తాడును పట్టుకొని, మరో చేతిలో సిసింద్రీ తీసుకొని, నోటితో దాని కొసను కొరికి, కొద్దిగా మందు బయటకు వచ్చేలా చిదిమి, తాడుతో అంటిస్తూ, ఒకవేళ వెంటనే అంటుకోకుంటే నిప్పురాజుకొనేలా నెమ్మదిగా నోటితో ఊదుతూ, అంటుకొన్నాకా ఒక సెకను లాగేవరకూ వేచిచూసి నేర్పుగా వదిలితే… రకరకాల మెలికలు తిరుగుతూ అది చేసే విన్యాసాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు..!!

ఈ సిసింద్రీలను చొక్కా, లాగూల జేబుల్లో నింపుకొని సాయంత్రం 6-7 గంటలకు రోడ్డెక్కితే మరల 9-10 గంటలకి కడుపు మాడేవరకూ వళ్ళు తెలిసేది కాదు..!! ఈ సిసింద్రీ మందుతో నల్లగా మాసిన చొక్కాలు, లాగూలు ఉతకలేక ఆడవాళ్ళ తల ప్రాణం తోకకొచ్చేది. ఇక రోడ్ల మీద తిరిగే వారుకూడా దీపావళి వచ్చిందంటే ఎంతో జాగురూకతతో నడిచేవారు. “స్..స్..” మని శబ్దం వినిపించగానే ఎలర్ట్ అయిపోయేవారు. అయినప్పటికీ ఏ సైకిల్ మీద వెళ్ళేవాడి లుంగీలోనో దూరడం, వాళ్ళు తిట్లు లంకించుకోవడం, మేం ఏ సందులోకో దూరి పారిపోవడం జరిగిన సందర్భాలు అనేకం.

ఈ సిసింద్రీల విషయంలో చాలా పందేలు కూడా జరిగేవి. ఒకసారి బాగా మెత్తగా ఉన్న సిసింద్రీ వేయమని నా స్నేహితుడు పందెం కడితే పౌరుషానికి పోయి అంటించానో లేదో.. చేతిలో అడ్డంగా చీదేసింది..!! అంతే అందరూ ఒక్కసారి ఇళ్ళకు పరార్..!! ఎప్పుడూ హుషారుగా ఇంటికొచ్చే నేను పిల్లిలా నడుచుకుంటూ రావడం చూసి మా అమ్మకు అనుమానం వచ్చేసింది. నేను ఏదో సర్దిచెప్పి గాయం మీద రాయడానికి ఇంకు బాటిల్ గురించి వెతికి వెతికి కనిపించక చివరికి అమ్మనే అడగాల్సి వచ్చింది. విషయం కనిపెట్టిన అమ్మ నా వీపుమీద నాలుగు ఇచ్చుకోవడం, నాన్నగారు ఆయింట్‌మెంట్ రాయడం ఇప్పటికీ మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపకం..!!

ఇక్కడే మరో విషయం కూడా గుర్తుకువస్తోంది. మా స్కూల్లో K.G.K గారని ఒక మాష్టారు ఉండేవారు. ఆయన తన ఇంట్లోనే సిసింద్రీ మందు, పటాసు తయారుచేసేవారు. ఆయన మందంటే చుట్టుపక్కల ఊర్లన్నింటిలోనూ పెద్ద పేరు. అటువంటి ఆయన ఇంట్లో ఒక సంవత్సరం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు ముగ్గురు చనిపోయినట్లు కూడా గుర్తు. లైసెన్సు లేకుండా బాణసంచా తయారు చేయడంవల్ల పోలీసులు ఆయన్ను అరెస్టి కొన్ని రోజులు జైల్లో పెట్టారు. జరిగిన ప్రమాదంలో ఆయన తప్పు ఎంతున్నా, మా కుర్రకారుకు మాత్రం ఆయన్ను జైల్లో పెట్టడం ఎంతో విషాదాన్ని కలిగించింది.

ఇక సిసింద్రీలే కాక, మతాబులు, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు, పేక టపాకాయలు, తారాజువ్వలు, తిప్పుడు పొట్లాలు లాంటివెన్నో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళం. ఇప్పుడు మా వూరిలోనే ఏ కొద్దిమందో తప్ప వీటిని తయారుచేయడం చూడట్లేదు..!!

చిన్ననాటి ఆటలు – చింతగింజలు

చిన్ననాటి ఆటలను గురించి ఆలోచించుకొంటున్నప్పుడు తప్పక గుర్తుకు వచ్చే ఆట – చింతగింజలు. ఈ ఆటను ఎక్కువగా ఆడవారు ఆడుతూ ఉండేవారు. అందువల్ల ఈ ఆటలో పెద్దగా ప్రవేశం లేకపోయినా, మా అక్క, ఆమె స్నేహితురాళ్ళు ఆడుతున్నప్పుడో, లేక మా అమ్మ, పిన్ని ఆడుతున్నప్పుడో చూడడం వల్ల ఈ ఆటను గురించిన కొన్ని విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

ఈ చింతగింజలతో దాదాపు మూడు-నాలుగు రకాలైన ఆటను ఆడుతూ ఉండేవారు. ఏ ఆటలో అయినా ఎవరికి ఎన్ని ఎక్కువ చింతగింజలు వస్తే వారు గెలిచినట్లు లెక్క. ఈ చింతగింజలను లెక్కించడానికీ ఒక కొలమానం ఉంది..!!   అదేమిటంటే: నాలుగు గింజలను ఒక “పుంజి” అంటారు. రెండు పుంజిలు కలిస్తే ఒక “కచ్చట”. అయిదు కచ్చట్లు ఒక “గుర్రం”. అయిదు గుర్రాలు ఒక “ఏనుగు”..!! ఈ విధంగా లెక్కించి ఆట చివర్లో ఎవరికి ఎక్కువ గింజలు వస్తే వారిని విజేతగా నిర్ణయిస్తారు.

ఇక చింతగింజలతో ఆడే ఆటల వివరాలలోకి వెళ్దాము. మొదటి రకం ఆటలో చింతగింజలన్నీ కొంచం చెదురుమదురుగా నేలపై పరుస్తారు. మొదటగా ఆట ఆడే వ్యక్తి ఒక చింతగింజను తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ గింజ తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న చింతగింజలలో కొన్నింటిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర గింజలూ కదలకూడదు. అదే సమయంలో పైనున్న గింజ నేలకు తాకకుండా అదే గుప్పిటతో మరల అందుకోవాలి. పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, లేక కిందనున్న ఏ ఇతరగింజలు కదిలినా ఆ వ్యక్తికి ఆటను కొనసాగించే అవకాశం పోతుంది. ఈ లోపుగా సేకరించగలిగిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. ఈ విధంగా ఆట ఒకరినుంచి ఇంకొకరికి మారుతూ కిందనున్న గింజలన్నీ అయిపోయేదాకా కొనసాగుతుంది. చూడడానికి ఎంతో సులువుగా అనిపించినా, ఎంతో ఏకాగ్రత, కళ్ళు – చేతులు మధ్య ఎంతో సమన్వయం ఉంటేగాని సాధ్యపడని ఆట ఇది.

ఇక రెండో రకం ఆటను మేము “ఊదే ఆట” అని పిలుచుకొనే వాళ్ళం. ఈ ఆట ఆడడం చాలా సులువు. మొదటగా చింతగింజలన్నీ నేలపై ఒక కుప్పగా పోస్తారు. ప్రతీ వ్యక్తీ, తన అవకాశం వచ్చినప్పుడు, బాగా.. నోటితో గాలి పీల్చి, నేలపై ఉన్న గింజలన్నిటినీ గట్టిగా ఊదాలి. ఆ ఊదిన వేగాన్ని బట్టీ గింజలు కొంత చెల్లాచెదురవుతాయి. అప్పుడు ఒక్కొక్క గింజనే, పక్కనున్న గింజలు కదలకుండా పక్కకు తీస్తూ పోవాలి. ఈ విధంగా సేకరించిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఆట చాలా ఇష్టంగా ఉండేది.

ఇక మూడోరకం ఆటలో కూడా నేలపై చింతగింజలను చెదురుమదురుగా పరుస్తారు. ఆట ఆడే వ్యక్తి తన ఎడంచేతి బొటన, చూపుడు వేళ్ళను నేలపై నిటారుగా ఆనించి  , వాటి మధ్య తిరగేసిన “U” అకారంలో చోటు వచ్చేలా నిలిపి ఉంచాలి. ఇక కుడిచేత్తో ఒక చింతగింజను గాలిలోకి ఎగురవేస్తూ, అది కిందకుపడేలోపుగా, కిందనున్న చింతగింజలను ఒక్కొకటినీ, పక్కన గింజలకు తగులకుండా ఇంతకు ముందు చెప్పిన “U” ఆకారంగల చోటులోకి తోస్తూపోవాలి. అంటే ఫుట్‌బాల్ ఆటగాడు గోల్ చేసినట్లన్నమాట..!! పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, కిందనున్న గింజలు కదిలినా అవకాశం పక్కన వ్యక్తికి వెళ్ళిపోతుంది.

పైన చెప్పిన మూడు రకాల ఆటలనే కాక, చింతగింజలతో “వామన గుంటలు” అనే ఆటను కూడా ఆడేవాళ్ళం. దీనినే ఇప్పుడు “మంకాలా” అనే పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ ఆటకూడా మెదనుకు పదును పెట్టే విధంగా ఉంటుంది. ఇంట్లో చింతకాయతో ఊరగాయలు లాంటివి పెట్టేటప్పుడు పోగయ్యిన చింతగింజలన్నీ తీసి అవతల పారవేయకుండా, వాటిని భద్రపరచి, మెదడుకు పదును పెట్టే ఆటలకు ఉపయోగించడం మనవారికే చెల్లింది. మరే ఇతర ప్రాచీన ఆటలవల్లే ఈ చింతగింజల ఆటలుకూడా క్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

మా ఊరిలో.. వీధి సినిమా..!!

సాధారణంగా పల్లెటూర్లలో పండుగ వచ్చిందంటే ఎంత హడావిడి వాతావరణం నెలకొని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరాల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఆ పండుగ పదిరోజులూ పొద్దున్న ఆరింటికి మొదలు పెట్టి సాయంత్రం వరకూ ఆగకుండా సాగే లౌడు స్పీకర్ల హోరు ఒక ఎత్తైతే, ప్రతీ సాయంత్రం వీధిలో రోడ్డుకు అడ్డంగా తెర కట్టి ప్రదర్శించే సినిమాలు మరొక ఎత్తు.

ఈ పండుగల హడావిడి సాధారణంగా ఒక నెల ముందే మొదలవుతుంది. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించే కార్య నిర్వాహక వర్గం అన్నింటికంటా ముందుగా చేసే పని.. చందాలు వసూలు చేయడం. ఉత్సవాలు నిర్వహించే ప్రదేశానికి చుట్టుపక్కన ఉండే మూడు నాలుగు వీధులలోని ప్రతీ ఇంటికీ వీరు వెళ్ళి చందాలు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏ ఇంటిలో ఎంత చందా వసూలు చేయాలో, అలా వసూలు చేయాలంటే ఎవరు ఆ ఇంటికి వెళ్ళాలో, వాళ్ళని బుట్టలో ఎలా వెయ్యలో అంతా ప్రణాళిక వీరి దగ్గిర సిద్ధంగా ఉంటుంది. ఇలా వసూలైన చందాలను వీధుల్లో సీరియల్ బల్బులు, ట్యూబులైట్లు వేయడానికీ, మైకు సెట్లను పెట్టడానికీ, ఇంకా ఇతర ప్రచార కార్యక్రమాలకూ వాడుతూంటారు. కానీ ప్రతీ రోజూ రాత్రి ప్రదర్శించబోయే సినిమాల చందా విషయం మాత్రం కొంచం వేరుగా ఉంటుంది.

ఈ సినిమాలకు సాధారణంగా ఆ నాలుగు వీధులలో పరపతి గల.. లేదా పరపతికి పాకులాడే కుటుంబాలు స్పాన్సర్ చేస్తుంటాయి. ప్రతీ సంవత్సరం మనస్ఫూర్తిగా సినిమాకు చందా ఇచ్చే కుటుంబాలు కొన్నైతే, అస్సలు ఇష్టమే లేకపోయినా, వేరే వారిముందు తీసికట్టుగా ఉండకూడదని మొహం మాడ్చుకొని చందా ఇచ్చేవారు మరికొందరు. ఈ విధంగా పండుగ పది రోజులూ రోజుకొక కుటుంబం చొప్పున చందా ఇస్తూ ఉంటుంది.

ఈ సినిమాల ప్రదర్శనలు ప్రారంభమయ్యే రోజు రోడ్డుకు ఇరుపక్కలా గునపాలతో గోతులు తవ్వి రెండు కర్రలను నిలపెడతారు. వీటి మధ్యలో ఒక తెల్లటి తెరను వ్రేలాడదీసి దాని నాలుగు కొనలనూ కర్రలకు గట్టిగా బిగించి కడతారు. ఆ పదిరోజులూ ఏ పెద్ద వాహనాలు అటుగా రాకుండా కర్రలతో కొద్ది దూరంలో రోడ్డుకు అడ్డుకట్టి పక్క వీధిగుండా దారి మళ్ళిస్తారు.

ఇక సినిమా ప్రారంభమయ్యే రోజు పొద్దున్నే హంగామా మొదలవుతుంది. ఆ కూడలి నుంచీ మైకు సెట్టూ, లౌడు స్పీకర్తో కూడిన ఒక రిక్షా బయలు దేరుతుంది. దీనిలో ఒక మనిషి కూర్చొని నాలుగు వీధులూ తిరుగుతూ.. ఆ రోజు ప్రదర్శింపబడే సినిమా పేరు, నటీ నటుల వివరాలు, ప్రదర్శింపబడే సమయం, ప్రదేశం.. దానికి చందా ఇచ్చిన వారి వివరాలతో ప్రచారం చేస్తాడు.

సినిమా ప్రారంభం సాధారణంగా రాత్రి తొమ్మిది, పది గంటల మధ్య మొదలవుతుంది. ఈ ఉత్సవాల సమయంలో ఆ ప్రదేశమంతా వెలుగు జిలుగులతో ఉండడం వల్ల పిల్లలందరూ పెందలాడే అన్నం తిని ఆటలు మొదలు పెడతారు. పెద్దలందరూ నెమ్మదిగా భోజనాలు ముగించుకొని ఆ ప్రదేశానికి చేరుకొంటారు.. ఈ సినిమాకు జనాలు చాలా పకడ్బందీగా సిద్ధమవుతారు. రోడ్డు మీదనే కూర్చొని సినిమా చూడడానికి వీలుగా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు చాపలు, బొంతలు, కొంతమంది మడత కుర్చీలతో వస్తారు. ఇక రోడ్డు పక్కనే ఉండే మురికి కాలువల వల్ల ముసిరే దోమలనుండీ తప్పించుకోవడానికి ఓడోమాస్ రాసుకొని కొందరు బయలుదేరితే, అరుగులపై కూర్చొని సినిమా చూసేవారు మస్కిటో కాయిల్స్ వెలిగించుకొంటారు. ఇక రాత్రి మంచు పడే అవకాశముంటే మప్లర్లు, మంకీ కాప్‌లూ, చెవిలో దూదీ..వగైరా.. వగైరా..

ఇక సినిమాను ప్రదర్శించే ప్రొజెక్టర్ తెరకు దాదాపు పదిహేను అడుగుల దూరంలో ఉంటుంది. దానిపక్కనే ప్రొజెక్టర్ నడిపే మనిషి కూర్చునేందుకు ఒక కుర్చీ, ఆ ప్రొజెక్టర్‌కు కావలసిన కరెంటుకు దగ్గిరలో ఉన్న ఇంటినుంచీ లాగిన కరెంటు వైరూ, ఒక జంక్షను బాక్సూ ఉంటాయి. అప్పటిదాకా రణగొణ ధ్వనులతో నిండిన వాతావరణం, సినిమా ప్రారంభమవుతోందంటే నిశ్శబ్దంగా మారిపోతుంది. ప్రొజెక్టర్‌లోంచి వచ్చే కాంతి తెరమీద పడి.. చిత్రంగా..చిత్రంగా మారుతోంటే మా చిన్నతనంలో ఎంతో ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఇక ఆ తెరపై పేర్లు పడుతుండగా చూడడం ఒక మరపు రాని అనుభూతి. తెర ముందువైపు పడే పేర్లు సరిగా ఉంటే.. వెనుక వైపునుంచీ చూస్తే తిరగేసిపడి ఏదో వేరే భాషను చూస్తున్నట్లుగా వింతగా ఉండేది.

ఇక సినిమా ప్రారంభమైన దాదాపు ప్రతీ అరగంటకూ రీళ్ళు మార్చడానికి ప్రొజెక్టర్‌ను నిలుపు చేయడం వల్ల పది నిముషాలు విరామం ఉంటుంది. ఈ సమయంలో మరలా ఆ సినిమాకు చందా ఇచ్చినవారి పేర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో పనిలో పనిగా వ్యాపారాన్ని చేసుకొనే వేరుశనగ బండి, పిడతకింది పప్పుల వ్యాపారులగురించి చెప్పనే అక్కర్లేదు. ఈ విధంగా విరామాలతో కలిపి సినిమా పూర్తయ్యేసరికీ దాదాపు రాత్రి ఒంటిగంట దాటుతుంది. అప్పటిదాకా ఆగిపోయిన వీధి లైట్లూ, సీరియల్ బల్బులూ మరల యధావిధిగా వెలగడం మొదలుపెడతాయి.

ఇప్పుడు ప్రతీ ఇంట్లో టెలివిజన్ సెట్లూ, కేబుల్ కనెక్షన్లూ రావడంచేత వీధి సినిమాలు తగ్గిపోతున్నా, మా చిన్నతనంలో వీటికి విపరీతమైన ప్రజాదరణ ఉండేది.

నా క్రికెట్ వ్యసనం..!!

అవి నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు..!! అప్పటివరకూ ఏడు పెంకులాట, వీపుచట్నీలు లాంటి సాంప్రదాయక ఆటలతో కాలక్షేపం చేస్తున్న మా కుర్రకారు జీవితాలలలో జంటిల్మన్ క్రీడ ప్రవేశించిన రోజులు. నాలాంటి చాలామంది జీవితాలనే మార్చివేసిన క్రికెట్ క్రీడను మాకు పరిచయం చేసిన వ్యక్తి “మధుబాబ”..!!

మధుబాబ మా తాతగారి తమ్ముడి కొడుకు. అవడానికి బాబాయ్ అయినా, నాకన్నా చదువులో మూడేళ్ళు మాత్రమే సీనియర్. అప్పట్లో వాళ్ళ అమ్మగారు పోవడంతో మొత్తం కుటుంబం పెనుగొండ వచ్చి స్థిరపడ్డారు. మా మధుబాబ రాకతో అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న మా పెనుగొండ మొత్తం పూనకంతో ఒక్కసారి ఊగిపోయింది. తన అల్లరి, పోకిరి వేషాలతో మొత్తం పెనుగొండలో ఉండే పిల్లకాయల దగ్గిరనుంచీ, టీనేజ్ కుర్రాళ్ళ వరకూ అందరినీ ఎంతో కొంత ప్రభావితం చేసాడు మధుబాబ.  అప్పట్లో C.P (ChakraPAni, మా మధుబాబ అసలు పేరు) పేరు చెప్తే పెనుగొండలో చాలామంది తల్లిదండ్రులు ఉలిక్కిపడేవారు. అటువంటి మధుబాబ పరిచయం చేసిన క్రీడే క్రికెట్..!!

మా మధుబాబ చుట్టుపక్కల కుర్రాళ్ళందరినీ పోగుచేసి క్రికెట్ ఆడేవాడు. క్రమంగా ఈ పిచ్చి దావానలంలా వ్యాపించి, లాగు వేసుకోవడం రానివాడు కూడా క్రికెట్ బ్యాట్ పుచ్చుకొని వాడి లెవల్‌కి తగ్గ స్నేహితులతో క్రికెట్ ఆడేయడం సాధారణం అయిపోయింది. ఆ బంతి చుట్టుపక్కల ఇళ్ళలో పడి, వాళ్ళు పెట్టే శాపనార్థాలతో, తిట్లతో, పెనుగొండ వీథులు ప్రతిధ్వనించేవి. ఆ కొత్తగా తయారైన పిచ్చివాళ్ళలో నేనూ ఒకడిని..!! నా ఈ కొత్త సరదాను చూసి, ముచ్చటపడి, మా నాన్నగారు ఒక క్రికెట్ కిట్ కూడా కొని ఇచ్చారు. మంచి బ్యాట్, కొన్ని లెదర్ బాల్స్, వికెట్స్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ గ్లవ్స్ లతో సహా అన్నీ ఉండేవి. మా మధుబాబ కన్ను వెంటనే ఆ కిట్ మీద పడింది. అప్పటినుంచీ పెద్దపిల్లలు ఆడే క్రికెట్ జట్టులో నేనుకూడా సభ్యుడిని అయిపోయాను..!! చివర్లో ఏదో రెండు బంతులు ఆడడానికి ఇచ్చి, నాతో తూతూ మంత్రంగా రెండు బంతులు బౌలింగ్ చేయించి, మొత్తం కిట్‌ను అప్పనంగా వాడేసుకొనేవారు మధుబాబ మరియు అతని స్నేహితులు.. ఈ రాజకీయం అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అప్పటినుంచీ క్రికెట్కు బయలుదేరినప్పుడల్లా, మొత్తం ప్యాడ్లు, బ్యాటింగ్ గ్లవ్స్, చివరికి గార్డ్‌తో సహా అన్నీ నా వంటిమీద తగిలించుకొని అప్పుడే ఆటకు బయలుదేరేవాడిని. జట్టు కూర్పు ఎలా ఉన్నా ఓపెనర్‌ను మాత్రం ఎప్పుడూ నేనే..!! అదికూడా వెంటనే రెండు బంతులకే అవుటయిపోతే మొత్తం కిట్ తీసుకొని ఇంటికి చెక్కేసేవాడిని. లేదా మా అమ్మతో రికమెండేషన్ తీసుకొచ్చి ఇంకో ఓవరో, రెండు ఓవర్లో ఎక్కువ ఆడేవాడిని. ఇదంతా చూసి కుతకుతలాడిపోతున్నా, ఎలాగో ఓర్చుకొని, క్రికెట్ కిట్‌ను వదులుకోలేక నన్ను చచ్చినట్టు ఆడించుకొనేవారు.

ఇక ఈ క్రికెట్ పిచ్చి ఎంతగా ముదిరిందంటే, అప్పటి క్రికెటర్ల బౌలింగ్, బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ ఉండేవాడిని. దూరంనించీ కోతి కొబ్బరికాయ పట్టుకొచ్చినట్లు వచ్చే వెస్టిండీస్ బౌలర్ ప్యాట్రిక్ ప్యాటర్సన్, వేగంగా పరుగు మొదలు పెట్టి, చివరికి నీరసించి బౌలింగ్ చేసే అమర్‌నాథ్, రెండు చేతులనూ గిరగిరా తిప్పి స్పిన్ బౌలింగ్ చేసే అబ్దుల్ ఖాదిర్, కాళ్ళు వెడల్పుగా పెట్టి నిల్చుని బ్యాట్ చేసే శ్రీకాంత్, కాళ్ళు దగ్గిరగా పెట్టి మునివేళ్ళపై బ్యాట్ను ఆనించి నుంచుని బ్యాట్ చేసే గవాస్కర్.. ఇలా అందరినీ అనుకరించేసే వాడిని. మొదట్లో సరదాగా చూసినా, ఇక నా క్రికెట్ పిచ్చి ముదిరి పాకాన పడినట్లు గుర్తించి, ఇలా అయితే నా ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలు కొండెక్కుతాయని గ్రహించి, తిట్లు, దెబ్బలు లాంటివేమీ పనిచేయక.. చివరాఖరిగా.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది మా అమ్మ  ..!! ఏడవతరగతి పరీక్షలు అయ్యేంతవరకూ క్రికెట్ ఆడితే తనమీద ఒట్టేనంది.. ఒక్కసారి బ్యాట్ పట్టుకొన్నా తనని చంపుకొని తిన్నట్టే అంది.. ఆపై ఇక జీవితంలో నాతో మాట్లాడనంది.. గుడ్లనీరు కుక్కుకొంది.. కొంగు నోట్లో దోపుకొంది.. ఎక్కడో సినిమాల్లో తప్ప ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ సన్నివేశాలు నిజజీవితంలో ఎరుగని నేను, బుట్టలో పడిపోయాను. ఏదో హిప్నాటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మాట ఇచ్చేసాను..!! అంతటితో ఊరుకోక, నా పరివర్తనను నిరూపించుకోవాలనే వేడిలో మొత్తం క్రికెట్ కిట్ తీసుకెళ్ళి మండుతున్న బాయిలర్‌లో పడేసాను..!! కొంచం వేడి చల్లారాకా గానీ నేను చేసిందేమిటో అర్థంకాలేదు..కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఏడవతరగతి పరీక్షలయ్యేంత వరకూ ఒట్టుపేరు చెప్పి బెదిరిస్తూ నన్ను గుప్పెట్లో ఉంచుకోగలిగింది మా అమ్మ. మొత్తానికి ఆమె ఆశించినట్టు స్కూల్ ఫస్ట్ కాకున్నా, మూడవ స్థానం సంపాదించుకోగలిగాను..

అప్పటికి మా మధుబాబ ఇంకా పెనుగొండలో ఉంటే పాడైపోతాడని గ్రహించిన మా తాతగారి మరో తమ్ముడు, మధుబాబను ఆయనతో బెంగుళూర్‌కు తీసుకుపోయారు. దాంతో పెనుగొండ అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకొంది. కానీ అప్పటికే అతడు నాటిన బీజాలు మాలో లోతుగా నాటుకుపోయాయి. దానికి తోడు నేను అమ్మకి ఇచ్చిన ఒట్టు గడువు ముగియడంతో మరల క్రికెట్ మొదలుపెట్టాను. “కాదేది క్రికెట్‌కి అనర్హం..!!” అన్న రీతిలో రకరకాలుగా క్రికెట్ ఆడేవాళ్ళం. పరీక్షలు రాసే అట్టతో, షటిల్ కాక్ తో క్రికెట్.. తూటు కర్రలను బ్యాట్, బంతిగా చేసుకొని క్రికెట్.. కాగితాలను ఉండలుగా చుట్టి, పైన పురుకోస కట్టి, దానిని బంతిగా ఉపయోగించి క్రికెట్.. షటిల్ బ్యాట్, కాక్‌తో క్రికెట్.. పుస్తకాల పేజీ నంబర్లతో తరగతి గదులలో క్రికెట్.. ఇలా రకరకాలుగా ఆడేవాళ్ళం. పిల్లి పిల్లలను ఇళ్ళు మార్చినట్టు, ఒకేచోట ఎక్కువరోజులు ఆడి జనాల నోళ్ళళ్ళో నానడమెందుకని, కొన్నాళ్ళు మా మేడ మీద.. కొన్నాళ్ళు కృష్ణ వాళ్ళింటి పెరడులో.. కొన్నాళ్ళు రామాలయం వెనుకాలా.. మరికొన్నాళ్ళు మార్కెట్‌యార్డులో.. ఇలా రకరకాల చోట్లలో ఆడేవాళ్ళం. ఎనిమిది, తొమ్మిదో తరగతులలో పబ్లిక్ పరీక్షలు లేకపోవడంవల్ల మా అమ్మకూడా చూసీ చూడనట్టు వదిలేసేది.

కానీ పదవ తరగతికి వచ్చేసరికీ మరల నన్ను అదుపులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించింది మా అమ్మ. కానీ ఈసారి సెంటిమెంట్‌కు లొంగనని ముందే అర్థం చేసుకొని, తెలివిగా.. మా స్కూల్‌లో కెల్లా అత్యంత చండశాశనుడిగా పెరుపొందిన జయంతి వెంకట శాస్త్రులు గారు అనే లెక్కలు మాష్టారు దగ్గిర ప్రయివేట్‌కు కుదిర్చింది. ఆ ప్రయివేటు సరిగ్గా సాయంత్రం స్కూలు వదలగానే 5 గంటలకు మొదలయ్యేది. దానితో నా క్రికెట్ ఆటకు అడ్డు పడిపోయింది. ఎప్పుడో సెలవలు, ఆదివారాలలో తప్ప క్రికెట్ ఆడడానికి సమయం చిక్కేది కాదు. ఆ విధంగా మొత్తానికి నన్ను దారిలో పెట్టి పదవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చేలా చేయగలిగింది మా అమ్మ..!!

తరువాత క్రికెట్ ఆడడం తగ్గిపోయింది. EAMCET ర్యాంకు సంపాదించి, చదువు విలువ తెలుసుకొన్నాకా ఇంజనీరింగ్‌లో ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ క్రికెట్ మ్యాచ్‌లు వస్తే మాత్రం మొత్తం హాస్టల్ అంతా మెస్‌లోని టీవీకే అతుక్కుపోయేవాళ్ళం. ఆఖరుకు IISc బెంగుళూరులో M.S చేసినప్పుడుకూడా, ఎంతటి కఠినమైన చదువు కొనసాగించినా, కనీసం క్రికెట్ స్కోరు చూడడానికైనా ఖాళీ చేసుకొనేవాడిని.  
 
భూకంపం తరువాత అప్పుడప్పుడూ ప్రకంపనలు వచ్చినట్టు, ఇప్పటికీ నాలో క్రికెట్ పిచ్చి రగులుకొంటూనే ఉంటుంది. నా ఈ క్రికెట్ మ్యాచ్ పిచ్చి చూసి, 2003 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఇండియా చేరుకొందన్న విషయం తెలిసి, పాపం నాతో కూర్చుని ఓపికగా మ్యాచ్‌ను వీక్షించింది నా భార్య. అందులో ఏమిజరిగిందో ఎవరికీ గుర్తు చేయనవసరం లేదనుకొంటాను.. మరలా తిన్నగా ఉండక.. 2007 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రసారాన్ని Dish Network ద్వారా 200 డాలర్లకి కొన్నాను. మొదటి రౌండ్ లోనే ఇండియా చేతులెత్తేసాకా, ఇక క్రికెట్ చూడను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన నేను.., మరల కుక్కతోక వంకర కనుక.. 20-20 వరల్డ్ కప్‌నుంచీ షరా మామూలే..!! 

అమెరికా వచ్చిన కొత్తలో ఇక్కడి స్నేహితులందరినీ టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడదామని బలవంతం చేసేవాడిని. దానితో అందరూ నన్ను తప్పించుకు తిరిగేవారు. ఇలా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా యాదృచ్ఛికంగా ఇక్కడ కొంతమంది నాలాంటి పిచ్చివాళ్ళు తగిలారు. వాళ్ళు ప్రతీ శనివారం ఉదయం 7 గంటలనుంచీ 10 గంటలవరకూ ఒక పార్క్‌లో క్రికెట్ ఆడతారు. వాళ్ళు పరిచయం అయినప్పటినుంచీ శనివారం క్రికెట్ నా జీవితంలో భాగం అయిపోయింది. మామూలుగా ఉదయం 8:30 కి గానీ ముసుగు తీయని నేను, శనివారం మాత్రం 6:30 కల్లా తయారు అయిపోతాను. వారంలో ఎప్పుడూ ఒళ్ళు వంచని నేను, శనివారం మాత్రం చెమటోడ్చి ఆడతాను. ఇక బుధవారం నుంచీ ఇంటర్నెట్‌లో వారాంతానికి వాతావరణం ఎలావుంటుందోనన్న బెంగతో శాటిలైట్ నివేదికలు చూస్తూ ఉంటాను. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది..!!

చిన్ననాటి ఆటలు: వైకుంఠపాళి, అష్టా-చెమ్మా..!!

నేను చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తుతెచ్చుకొంటున్నప్పుడు, పరుగులు పెట్టి కిందపడి మోచేతులకీ, మోకాళ్ళకీ దెబ్బలు తగిలించుకొన్న ఆటలే కాక, బుద్ధిగా ఇంటిలో నీడ పట్టున కూర్చుని ఆడిన ఆటలు కూడా కొన్ని గుర్తుకువచ్చాయి. ముఖ్యంగా వేసవి సెలవల్లో, మండే రోహిణీకార్తె ఎండల్లో, మద్యాహ్న సమయాల్లో ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. వాటిల్లో ముందుగా గుర్తుకు వచ్చేవి వైకుంఠపాళి, అష్టా-చెమ్మా.

ఈ ఆటలు ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: నప్పులు, గవ్వలు. “నప్పు” ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. అప్పట్లో మేము చీపురు పుల్లలనీ, బలపాలనీ, రాళ్ళనీ, చింతగింజలనీ నప్పులుగా ఉపయోగించేవాళ్ళం. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. ఇప్పటి పిల్లలు ఈ ఆటలను “డైస్” తో ఆడుతున్నారు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే “చెమ్మ” అనీ, నాలుగూ బోర్లా పడితే “అష్ట” అనీ అంటారు. “చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

వైకుంఠపాళి ఆటనే ఇప్పటి పిల్లలు Snakes & Ladders పేరుతో ఆడుతున్నారు. కానీ నాకు ఇప్పటి గట్టి అట్టపై రంగురంగుల గళ్ళతో, చిన్నగా ఉండే బోర్డుకన్నా, నలుపు, తెలుపు రంగులలో, పెద్దగా, “పరమపద సోపాన పటము” అని రాసిఉండే పాత కాగితం పటమే ఎంతో ఇష్టం. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డువరుసకు 10 గళ్ళ చొప్పున ఉంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. నప్పు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, ఆ పాము మింగటం చేత, ఆ గడి నుంచీ పాము తోక ఉన్న గడి దాకా నప్పు దిగజారవలసి ఉంటుంది. అదే, నప్పు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, ఆ నిచ్చెన ఎక్కడం ద్వారా, నిచ్చెన పై చివర వరకూ చేరుకోవచ్చు. పాములను దాటుకొంటూ, నిచ్చెనలు ఎక్కుకొంటూ, 100వ గడికి ముందుగా చేరుకొన్నవాడే విజేత. ఇప్పటికీ, 94వ గడినుంచీ అనుకొంటా, అట్టడుగు వరుస వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పామును తలచుకొంటే, ఎన్నిసార్లు ఆ పాము బారిన పడి ఆటను కోల్పోయామో గుర్తుకువచ్చి నవ్వు వస్తుంది.

ఇక ఇదే కోవలొకి వచ్చే మరో ఆట “అష్టా-చెమ్మ”. దీనినే “గవ్వలాట” అనికూడా అంటారు. ఇది ఇప్పటి తరం వారు ఆడే “Ludo” ఆటను పోలి ఉంటుంది. ఈ ఆటకు కావలసిన పటాన్ని అరుగుమీద గీసుకొనే వాళ్ళం. దీనికి నీటితో తడిపిన సుద్దముక్కను ఉపయోగించే వాళ్ళం. ఈ పటం 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆటలో నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో “X” గుర్తు వేసి ఉంటుంది. ఇందులో ఆ ఆటగాడికి చెందిన నాలుగు నప్పులు ఉంటాయి. ఇది ఆ ఆటగాడి “ఇల్లు” అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ “X” గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ అపసవ్య దిశలో నడుపుకొంటూ, చివరకు మధ్యలో “X” గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది. ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు “X” గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. “X” గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట. మా బామ్మ ఈ ఆటను, తన స్నేహితురాళ్ళతో ఇంటి అరుగుల మీద కూర్చొని ఆడుతూ ఉండేది. ఆవిడకు అత్యంత ఇష్టమైన ఆటలు గవ్వలాట మరియు పేకాట. ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి చాలాకాలం అయినా, గవ్వలు పేరు చెప్పగానే మా ఇంట్లో అందరికీ ఆవిడే గుర్తుకు వస్తుంది…!!

చిన్ననాటి ఆటలు – వీపు చట్నీలు

విరామ సమయాన్ని సూచిస్తూ మా పాఠశాల ప్యూను సత్తిరెడ్డి గంటను గణగణా మోగించాడు. పుట్టల్లోంచి చీమలు బయటకు వచ్చినట్టు విద్యార్థులందరూ వారి తరగతి గదులనుంచి బయటకు పరుగుపెడుతున్నారు. నేను అప్పటివరకూ రాసిన నోటు పుస్తకాన్నీ, పాఠ్య పుస్తకాలనీ సంచిలో సర్దుకుంటున్నాను. ఇంతలో నాకు వీపు చుర్రుమని, నొప్పి తలకెక్కడంతో స్పృహలోకి వచ్చాను. నా వీపుకు తగిలిన రబ్బరు బంతి నాలుగు బెంచీల అవతలకి పోయి ఏమీ ఎరగని దానిలా అమాయకంగా ఒక మూల దాక్కుంది. గిరుక్కున వెనక్కి తిరిగి చూసేసరికీ, అప్పటికే బయటకు వచ్చేసిన ‘ఎ సెక్షన్ ‘ కంకిపాటి శ్రీను, చెక్కా నాగేశ్వరరావు, పళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ నన్ను గేలి చేస్తున్నారు. అప్పుడర్థమైంది.. వాళ్ళు ‘వీపు చట్నీ’ ఆటకై నన్ను కవ్విస్తున్నారని. రెట్టించిన కసితో, ఉత్సాహంతో మూలన పడ్డ బంతిని తీసుకొని నేను కూడా వారి వెంటబడ్డాను. నాకు దొరకకుండా వాళ్ళు తుర్రుమన్నారు. విరామ సమయం పదినిముషాలే అయినా, అంతలోనే మా పాఠశాలలో ఉన్న గదులన్నింటినీ రెండు మూడు సార్లైనా చుట్టేసి ఉంటాం. ఆ సమయంలో మా లక్ష్యం అంతా, మన వీపు మీది చుర్రుమనే మంట పోయేలోపు, ఎదుటివాడి వీపును ఎంత విమానం మోత మోగిద్దామా అనే..!! విరామం పూర్తి అయ్యి, ఎవరి తరగతి గదులకు వారు చేరుకునేసరికీ చెమటతో చొక్కా మొత్తం తడిసి వీపుకు అతుక్కుపోయేది. ఇంకుపెన్నుతో, అక్షరాలు అలుక్కుపోతుండగా, తరువాతి క్లాసులో నోట్సు తీసుకోవడం ఒక మరపురాని అనుభూతి.

ఈ ‘వీపు చట్నీలు ‘ ఆటకి నియమాలు అంటూ ఏవీ ఉన్న గుర్తులేదు. ఎవరికి బంతి దొరికితే వాడు ఎవరో ఒకరి వీపుకి గురి చూసి దాన్ని ‘ చట్నీ ‘ చెయ్యడమే..!! ఎదుటివాడి బంతికి మన వీపు చిట్లకుండా కాచుకొంటూ, తప్పించుకొంటూ, అవతలివాడిపై దాడి చేసేందుకు ఎత్తులు, జిత్తులు పన్నుతూ ఎంతో వేగంగా సాగిపోతుందీ ఆట. ఈ ఆటకు జనం రారన్న బెంగలేదు. మనం ఎవరిని ఆటలో కావాలనుకొంటున్నామో, వారి వీపు మోగేటట్టుగా ఒఖ్ఖటిస్తే, ఆ కసి తీర్చుకోవడానికన్నా చచ్చినట్టు వచ్చి ఆటలో కలిసేవారు. ఈ ఆట ఆడేటప్పుడు ఎన్నోసార్లు బంతి ఏ బురదలోనో, మురికిగుంటలోనో పడేది. అదేమీ పట్టించుకోకుండా, బంతిని తీసి, రెండు మూడు సార్లు ఏ ఇసుకలోనో, దుమ్ములోనో పొర్లించి, గట్టిగా గోడకేసి కొడితే, మరలా ఆటకు తయార్. మా పాఠశాలలో ఆగస్టు పదిహేనున తెల్లటి వెల్లతో వేసిన గోడలన్నీ ఈ బంతి ముద్రలతో నిండిపోయేవి. ఈ మురికి బంతి తగిలి మా చొక్కాలపై కూడా బంతి ముద్రలు స్పష్టంగా పడడం, ఇంటికెళ్ళాకా “నీ చొక్కాలు ఉతకడం నా..వల్ల కాదు..!!” అంటూ అమ్మ చేతుల్లో తన్నులు, చీవాట్లు తినడం రివాజుగా ఉండేది. అయినా, ఈ “వీపు చట్నీలు” ఆట అనుభవాల ముద్రలు మాత్రం ఇప్పటికీ నా మనసులో చెరగకుండా అలానే ఉన్నాయి.

చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట

మా చిన్నతనంలో ఇష్టపడి ఆడిన మరొక ఆట: ఏడు ఫెంకులాట. నా ఏడో తరగతి సమయంలో క్రికెట్ పిచ్చి తగులుకోక ముందు వరకూ ఈ ఆట ఆడడానికి ఎంతో ఉత్సాహపడే వాళ్ళం. ఈ ఆటని మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం వెనుక ఉన్న ఖాళీస్థలం లో ఆడేవాళ్ళం. ఈ ఆట గురించి పరిచయం లేని వారి గురించి కొంచెం వివరిస్తాను.

ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. టాస్ అంటే బొమ్మ-బొరుసు అనుకొనేరు. అంత సీనేం లేదు. అప్పట్లో ఈడ్చి తంతే మా జేబులోంచి ఒక్క పైసా కూడా రాలేది కాదు. అందుకే, ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి టాస్ వేసేవాళ్ళం. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు. ఈ టాస్ ను వేయడానికి మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మరెప్పుడైనా వివరిస్తాను.

ఇక ఆట విషయానికొస్తే, టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

బంతితో ఒకరిని కొట్టినప్పుడు అవతలి వ్యక్తి దానిని మోచేతులతో లేదా మోకాళ్ళతో అడ్డుకోవచ్చు. ఈ భాగాలలో బంతి తగిలినా లెక్కలోకి రాదు. పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది. ఈ ఆట ఆడి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, తలచుకొంటే ఇప్పటికీ ఆ చప్పట్లు చెవిలో రింగుమంటుంటాయి..!!

     

చిన్ననాటి ఆటలు: సబ్జా – విండూర్

నేను నా బ్లాగులో టపా వేసి వారం కావస్తోంది. తరువాత ఏమి రాద్దామా అని ఆలోచిస్తూండగా, నా చిన్నతనంలో మేమాడుకొన్న ఆటల గురించి రాస్తే బాగుంటుందనిపించింది. ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన ఈ ఆటల గురించి ఒక్క టపాలో రాస్తే సరిపోదనిపించింది. అందుకే ప్రతీ వారం ఒక్కొక్క ఆటని గుర్తు చేసుకొంటూ, ఆ జ్ఞాపకాలను ఈ బ్లాగులో పదిలంగా దాచుకోవాలని, తోటి బ్లాగు స్నేహితులతో  పంచుకోవాలని నిర్ణయించుకొన్నాను.

సాధారణంగా, మేమాడిన ప్రతీ ఆటలోనూ, క్రీడాకారులనుంచి ఒక “దొంగ” ను ఎన్నుకోవడం ఉండేది. “దొంగ” ను “పంటలు” అనే పద్ధతి ద్వారా ఎన్నుకొనేవాళ్ళం. ముగ్గురు లేదా అయిదుగురం ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకొని వృత్తాకారంలో నించుని అందరూ ఒకేసారి ఎవరి ఎడం అరచేతిలో వారి కుడి అరచేతిని, వెల్లకిలాగానీ, బోర్లాగానీ, ఎవరికి తోచినట్లు వారు ఉంచేవాళ్ళం. ముగ్గురిలో ఒకేలా వేసిన ఇద్దరు కాక మిగిలిన వారు “పంట” అయినట్టు. అదే విధంగా అయిదుగురిలో ఒకేలా వేసిన ఇద్దరు పంట అయినట్టు. చివరకు పంట కాకుండా మిగిలిన వారే దొంగ. ఒకవేళ ఇద్దరు మిగిలితే, అప్పటికే పంట అయిన వారు తోడుకు వచ్చేవారు.

ఇక నాకు చాలా ఇష్టమైన ఆటల్లో మొదటిది “సబ్జా – విండూర్”. పైన చెప్పిన విధంగా దొంగను ఎన్నుకొన్న తరువాత, దొంగ, కళ్ళు మూసుకొని అంకెలు లెక్కబెడతాడు. అతను కళ్ళు తెరిచేలోపు, మిగిలిన అందరూ దొంగకు కనబడకుండా ఎక్కడైనా దాక్కోవాలి (కొన్ని సరిహద్దుల లోపల). దొంగ, దాక్కున్న ప్రతీ ఒక్కరినీ కనుక్కొని, వారి పేరు చెప్తూ “విండూర్” అని అరవాలి. ఈ లోపుగా ఎవరైనా దొంగ వెనుకగా వచ్చి “సబ్జా” అని ముట్టుకొంటే, దొంగ మరల ఆటను మొదలుపెట్టవలసి ఉంటుంది. అలా కాక, దొంగ అందరినీ కనుగొనగలిగితే, మొదటగా విండూర్ అయిన వ్యక్తి మరుసటి ఆటకు దొంగగా ఉండవలసి వస్తుంది.

ఈ ఆటను నా ఎదురింటి స్నేహితుడు”కృష్ణ” ఇంటి పెరడులో ఆడేవాళ్ళం. దొంగకి దొరకకుండా ఉండడానికి, ధాన్యం గాదెలోనో, లేక గడ్డి మేటిలోనో దాక్కునే వాళ్ళం. ఆ దెబ్బకి ఒళ్ళంతా దురదలు వచ్చినా పట్టించుకోనంతగా ఆటలో లీనమైపొయేవాళ్ళం. ఇక దొంగని తప్పుదారి పట్టించడానికి రకరకాల యుక్తులు ఉపయోగించేవాళ్ళం. ముఖ్యంగా నేనూ, కృష్ణా, ఒకరి చొక్కాలు మరొకరు మార్చేసుకొని, దొంగకి పట్టుబడ్డట్టుగా వెనుకనుంచి కనబడేవాళ్ళం. ఒకవేళ చొక్కా ఆనుమాలుతో మనిషి పేరు చెప్పాడా, అతను మళ్ళా దొంగ పెట్టవలసిందే..!!   ఇంతే కాక, పెరట్లో ఉన్న మరుగుదొడ్లలో దూరి తలుపేసుకొని, లోపల కుళాయి తిప్పి, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్లు దొంగని భ్రమింప చేసేవాళ్ళం. తలుపు సందులోంచి దొంగ యొక్క కదలికలు గమనిస్తూ, అదను చూసుకొని, హఠాత్తుగా దాడి చేసి సబ్జా చెప్పేవాళ్ళం. లేదా, ఒకేసారి ముగ్గురు నలుగురు దొంగపై దూకి ఉక్కిరిబిక్కిరి చేసి, అతను తేరుకొని విడిగా విండూర్ చెప్పేలోపే ఎవరో ఒకరు సబ్జా చెప్పేసే వాళ్ళం.

ఒకసారి ఈ ఆట మొదలుపెడితే అసలు సమయమే తెలిసేది కాదు. సాయంకాలం అయిదు గంటలకు మొదలుపెట్టిన ఆట, చీకటిపడి మా అమ్మలు కేకలు వేసి, చెవి మెలితిప్పి ఇంటికి లాక్కుపోయే దాకా సాగేది. అలసిపోయి, చెమటతో ముద్దైన వంటిపై, నూతి దగ్గిర చన్నీళ్ళ స్నానం చేసి, అన్నం తిని పడుకొంటే, మరుసటి రోజు ఉదయందాకా వళ్ళు తెలిసేది కాదు.

మా ఊరి మెటాడోరు..!!

ఈ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు నేను గమనించిన ముఖ్యమైన తేడా, మెటాడోర్లు రోడ్లపై కనిపించకపోవడం, వాటి స్థానంలో ఆటోలు వచ్చిచేరడం.
మెటాడోరు అంటే తెలియని వారికి దాన్ని గురించి కొంచెం వివరిస్తాను. మెటాడోరు అంటే ఒక నాలుగు చక్రాల వాహనం. చూడటానికి మారుతీ వ్యానులా ఉన్నా, ముందు సీట్లో డ్రైవరు కాక ఇద్దరు, మధ్య సీట్లో నలుగురు, వెనుక అటూ ఇటూ ఇద్దరు చొప్పున మొత్తం దాదాపుగా 9 నుండీ 10 మంది సుఖంగా ప్రయణం చేయగల వాహనం. ఇప్పుడంటే క్వాలిస్‌లు, సుమోలు వచ్చాయిగానీ, మా చిన్నతనంలో మెటాడోర్లు, అంబాసిడర్లు తప్ప వేరేవి ఎరుగం.

మా ఊరు పక్కనే కాలువ ఉండటం వల్ల, జాతీయ రహదారికి దూరంగా ఉండటం వల్ల, అవడానికి మండల రాజధాని అయినా, మా ఊరికి రైలు సదుపాయం లేదు. ఊర్లో చిన్నా, చితకా వస్తువులు దొరికినా, ఏ ముఖ్యమైన వస్తువు కావాలన్నా, చుట్టుపక్కల టౌన్లకి బయలుదేరాల్సిందే.. ఇంతేకాక, మా ఊరివారికి ముఖ్యమైన వినోదం సినిమా. పేరుకు రెండు సినిమా హాళ్ళు మినర్వా, ప్యాలస్ అని ఉన్నా రిలీజైన సంవత్సరానికిగాని సినిమాలు వాటిలోకి రావు. అంతవరకూ మా ఊరి జనం ఆగలేరు కనుక, ఇటు పాలకొల్లో, అటు తణుకో తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకని రోజూ మా ఊరినుంచి పొరుగూరు వెళ్ళి వచ్చే వారు ఎక్కువే.

ఎప్పుడో అరగంటకో, గంటకో ఆటు నరసాపురం, భీమవరం డిపోలనుంచో లేక ఇటు రావులపాలెం, గూడెం డిపోలనుంచో వచ్చే దైవాధీనం బస్సులను నమ్ముకోలేక సతమతమయ్యే ప్రయాణీకుల బలహీనతలను సొమ్ముచేసుకొంటూ మొదలయ్యాయి మెటాడోర్లు, సిటీ బస్సులు. తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యం చేర్చడానికి మెటాడోర్లు ఉపయోగపడితే, మారుమూల బస్సు సదుపాయంలేని గ్రామాలను కలుపుతూ పోతాయి సిటీ బస్సులు..

వీరిద్దరూ అవగాహనకు వచ్చి, పెరవలి నుంచి జాతియ రహదారి మీదుగా తణుకు వెళ్ళే రూటును మెటాడోర్లు, విప్పర్రు, ఇరగవరం మీదుగా తణుకు చేరే రూటును సిటీ బస్సులు వాడుతూ ఉంటారు. మా ఊరికి R.T.C బస్సులు సమయానికి రావడం నేనెరుగను కానీ, ఈ ప్రైవేటు వాహనాల సమయపాలనకు మాత్రం ముచ్చట వేయక మానదు.  ఏ సమయాల్లో వాహనాలను తిప్పాలో, ఏ చోట్ల జనం తాకిడి ఎక్కువ ఉంటుందో, ఏ ఊరిలో ఎంత సమయం వేచి చూడాలో వీరికి క్షుణ్ణంగా తెలుసు. సరిగ్గా R.T.C బస్సు రావడానికి 5 నిమిషాలముందే వచ్చి ప్రభుత్వ బస్టాండులోనే ప్రయాణీకులను ఊడ్చుకుపోవడం వీరి స్పెషాలిటీ. తణుకు సినిమా వేళలకు అరగంట ముందుగా మాఊరు మీదుగా వెళ్తూ దారిలోని అన్ని ఊర్ల ప్రయణీకులనూ ఎక్కించుకొని సరిగ్గా సినిమా మొదలయ్యే వేళకు తణుకు చేరటం, అదేవిధంగా సినిమా విడిచే సమయానికి తణుకులో బయలుదేరి హాలు ముందే ప్రయాణికులను ఎక్కించుకొని అరగంటలో వారి గమ్యస్థానాలకు చేర్చటం.. ఇలా రోజూ ఎంతో క్రమపద్ధతిలో సాగిపోతూ వుంటుంది. అసలు నష్టాల నివారణకు IIM లతో అధ్యయనం జరిపించే బదులు ఒకరోజు ప్రయివేటు వాహనాల తీరును గమనిస్తే R.T.C ఎప్పుడో లాభాల బాట పట్టెది.

ఇకపోతే ప్రతీ మెటాడోరుకూ ఒక డ్రైవర్‌తో పాటూ ఒక కండక్టర్‌కూడా ఉంటాడు. కోతి చెట్టుకు తోకతో వేళ్ళాడినట్టు వీడు కూడా ఒక్క కాలు తప్ప మిగిలిన శరీరమంతా గాలిలో బయటకు పెట్టి, తలుపుకు వేళ్ళాడుతూ, ఆ మెటాడోరు ఏ ఊరువైపుగా వెళుతోందో గట్టిగా గొంతు చించుకు అరుస్తూ ప్రయాణీకులను ఆకర్షించటం, వచ్చిన ఆడవారిని ముందునుంచీ, మగవారిని వెనుకనించీ లోపల ఎంతో చోటువుందన్నట్టు భ్రమపెడుతూ వీలైనంతమందిని కుక్కటం, వారినించీ ముక్కుపిండి బస్సు చార్జీలకంటే ఒక అర్ధరూపాయ ఎక్కువే వసూలు చేయటం, మెటాడోరు ఆగటానికి, కదలటానికి సిగ్నల్‌గా ఈల వేయటం లాంటివి వీడు నిర్వర్తించే విధులు. పురాణాల్లో చదివిన పుష్పక విమానంలోనైనా చోటుకు లోటుంటుందేమో గాని, ఈ మేటాడోరులో మాత్రం ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. 

ఇక లోపల నిలబదటానికి మూడడుగుల మించి ఎత్తు ఉండదు కనుక, ఎంతటి వాడైనా తిరగేసిన “L” ఆకారంలో నడుం వంచాల్సిందే, దారిలో గతుకులకి, వేళ్ళే వెగానికీ, నెత్తిమీద మొట్టికాయలు తినాల్సిందే. ఇక వేసవి కాలంలో మేటాడోరు ప్రయాణం చేసి దిగిన వేంటనే మండుటెండ అయినా A.Cలా అనిపిస్తుంది. చెమటతో తడిసిన చొక్కా మీదుగా చల్లటిగాలి వెళ్తుంటే అప్పటిదాకా చేసిన ప్రయాణం బడలిక అంతా ఇట్టే మాయమవుతుంది..!!

ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందిని వారు చేరవలసిన చోటికి చేరుస్తూ మా వూరికి సేవ చేసిన ఈ మెటాడోర్లు ఎందుకు కనుమరుగయ్యాయని ఆరా తీస్తే తెలిసిన విషయమేమంటే.. ఈ మధ్య స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారులని అభివృద్ధి చేసినపుడు, తణుకు ఊరి పొలిమేరలో ఒక టోల్ గేటు పెట్టడం జరిగింది. ఈ గేటు ద్వారా తణుకు లోకి ప్రవేశించాలంటే ప్రతీ నాలుగు చక్రాల వాహనంఎనభై రూపాయల దాకా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాని త్రిచక్ర వాహనాలకు ఈ రుసుము లేదు. ఈ టొల్ గేట్ దెబ్బకు మా ఊరిలో మేటాడోర్లు మాయమై మూడు చక్రాల ఆటోలు ప్రత్యక్షమైపొయాయి. వాహనమేమైనా, మా ఊరి ప్రజల ఇక్కట్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి.

గోళీ సోడా.. తాగి చూడరా తెలుగోడా..!!

గోదావరి జిల్లాలంటే పచ్చని పైర్లు, ఎత్తైన కొబ్బరి చెట్లు, “ఆయ్”, “అండీ” అంటూ ఆప్యాయంగా పలుకరించే జనాలతో పాటుగా గుర్తుకు వచ్చేది.. “గోళీ సోడా”. ఇప్పటికీ నేను మా ఊరు వెళితే అన్నిటికన్నా ముందు చేసే పనులు, మా అమ్మ చేతి వంట తినడం, మా ఊరు గోంగూర తూము సెంటర్లో ఉన్న కిళ్ళీ కొట్టుకెళ్ళి గోళీ సోడా తాగడం.

ఈ గోళీ సోడా ఎప్పుడు పుట్టిందో తెలియదు గానీ, గోదావరి ప్రజల జీవితాలతో విడదీయరాని విధంగా పెనవేసుకు పోయింది. ఆకుపచ్చ లేదా నీలం రంగు లో అందంగా ఆరంగుళాలు పైన పొడవుండే ఈ సోడా, కింద వెడల్పు గా ఉండి, పైకి పోయెకొద్దీ సన్నంగా, చేతిలో వీలుగా ఇమిడిపోయేట్లు ఉంటుంది. దీని గొంతులో వాయుపీడనం తో ఇరుక్కొని ఉండే గోళీ, మూతికి అటూ, ఇటూ సోడాని ఎటువైపు ఎత్తిపెట్టి తాగాలో సూచించే రెండు గాట్లు.. ఇలా ఎవరో శ్రద్ధగా డిజైన్ చేసినట్లుంటుంది.

ఈ గోళీ సోడా తాగడంలో మజా ఒకటైతే, సోడా కొట్టటంలో వచ్చే మజా ఇంకొకటి. చంకలో పసిపిల్లాడిని అప్యాయంగా ఎత్తుకొన్నట్లుగా పట్టుకొని, చూపుడు వేలుతో గోళీ ని నెట్టి సోడా కొట్టేదొకడైతే, బల్ల మీద గుడ్డ వేసి, దానిపై సోడా పెట్టి, మాస్టారు స్టుడెంటు ని బెత్తంతో కొట్టినట్టుగా, చెక్కతో చేసి లోపల గోళీని నెట్టడానికి వీలుగా రబ్బరు ఉన్న గుండ్రటి పరికరంతో నెత్తి మీద మొట్టి సోడా కొట్టేదింకొకడు. ఇకపోతే, సోడా తాగడం మాట దేవుడెరుగు, సోడా కొట్టే సౌండుకే సగం కిక్కు వస్తుంది. ఎంత ఎక్కువ సౌండు వస్తే అంత గొప్ప. గాలి సరిగా నింపక తుస్సుమనే సోడాలు కొన్నైతే, కొట్టిన పది సెకన్లవరకూ చెవి గింగులెత్తేంత సౌండు వచ్చేవి కొన్ని.. అందుకే కామోసు, మన సినీ కవులు కూడా “నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ..!!” అని పాటలు రాసి సోడా మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక మా చిన్నప్పుడు, సోడాలని రెండు చక్రాల తోపుడుబండిని తోసుకొంటూ వీధి వీధి తిరిగి అమ్మేవారు. ఈ సోడాలపై వేసవిలో చల్లదనానికి, గోనెసంచి గాని లేదా ఎండుగడ్డి గాని వేసి నీళ్ళు చల్లుతూ ఉండేవారు.. ఇప్పటికీ, కూలరు లేని బడ్డీ కొట్టు వాళ్ళు ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు. ఇక ఈ గోళీ సోడాలలో రకరకాలు.. మామూలు సోడా, ఐస్ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా అంటూ..

ఈ సోడాని తయారు చేసే విధానం కూడా గమ్మత్తుగా వుంటుంది. ఒకేసారి మూడు, నాలుగు సోడాలు పట్టే ఒక పెట్టె, ఆ పెట్టె గిరగిరా తిరగడానికి అమరిక, సోడాలో నింపే గ్యాస్ సిలిండర్ ని పెట్టెకి కలుపుతూ ఒక ట్యూబు, దానికి పీడనాన్ని చూపించే ఒక మీటరు..సోడాలో కావలిసినట్లు నీటిని నింపాకా, ఈ పెట్టెలో పెట్టి, కావలసినంత పీడనాన్ని అమర్చుకొని, పెట్టెను గిరగిరా కాసేపు తిప్పి బయటకు తీసి చూస్తే సోడా తయార్..

ఈ గోళీ సోడా ఇంత ప్రాచుర్యం పొందడానికి చాలా కారణాలున్నాయి.. ముఖ్యంగా ఇది పేదవాడికి కూడా అందుబాటులో ఉండే పానీయం.. బాదంగీరులూ, బటరు మిల్కులూ ఉన్నా, అన్నింటికంటే చవుకగా లభించేది గోళీ సోడాయే.. ఇక ఎండలో దాహం తీరాలన్నా, విందు భొజనం ఆరగించిన తరువాత భుక్తాయాసం తీరాలన్నా, ఆటలు ఆడిన తరువాత అలసట తీరాలన్నా, సోడాని మించినది మరొకటి లేదు.

ఇటువంటి చరిత్ర కలిగిన గోళీ సోడా, నాకు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ఇక కూల్ డ్రింకులూ,ఫ్రూటీలూ, బిస్లరీ సోడాలూ వచ్చాకా, ఊర్లలో కూడా గోళీ సోడా నెమ్మదిగా కనుమరుగు అయిపోతోంది. మరికొన్ని సంవత్సరాలు పోతే, ఈ సోడాలను మ్యూజియంలో తప్ప బయట చూడలేమేమో.. అందుకే..ఇప్పుడే.. గోళీ సోడా.. తాగిచూడరా తెలుగోడా..!! 

మా ఊరిలో “రాజు” లెందుకుండరు..?

మా ఊరిలో ఎక్కడ చూసినా “నూలి” వారని, “బొడ్డు” వారని, “గ్రంధి” వారని, ఇలా వైశ్య (కోమటి) కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప, దుర్భిణి వేసి చూసినా ఒక్క “రాజు” ల కుటుంబం కూడా కనపడదు. ఎందుకో తెలుసా..?

పూర్వం మా ఊరిలో ఒక వైశ్య దంపతులు నివసించేవారు. వారికి “కన్యక” అనే ఒక అందమైన కూతురు వుండేది. ఆమె పెళ్ళీడు కు రావడంచే వివాహం చేయ సంకల్పించి ఒక మంచి వరునికై తల్లిదండ్రులు వేచి చూస్తుండగా, ఒకనాడు అటుగా వెళ్తున్న ఆ ప్రాంత రాజు కన్యక అందాన్ని చూసి, మోహించి, పెళ్ళాడమని బలవంతం చేసెను. ఆ రాజును ఎదిరించలేక, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళాడలేక, ఆ కన్యక “అగ్ని గుండం” లోకి దూకి ఆత్మత్యాగం చేసింది. అప్పటినుంచి ఆమె “కన్యకా పరమేశ్వరి” అమ్మవారిగా మా ఊరి ప్రజలచే, ముఖ్యంగా వైశ్యులచే పూజలందుకుంటోంది. ఆ “కన్యకా పరమేశ్వరి” ఇచ్చిన శాపం వలననే మా ఊరిలో “రాజు” లు నివసించరు. ఒకవేళ నివసించినా మా ఊరి పొలిమేర అయిన కాలువ దాటిన తరువాతనే ఇళ్ళు కట్టుకొంటారు. ఈ ఆచారం, నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. మా ఊరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆమె అగ్నిప్రవేశం చేస్తున్న ప్రతిమను చూడవచ్చు. ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, మా ఊరు “పెనుగొండ” అంటే, “ఓ.. అమ్మవారి ఊరా..!!” అని చేతులెత్తి భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు.

నా పేరు, కథా కమామీషూ..

నా పూర్తి పేరు తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు. కొల్లేటి చాంతాడంత ఈ పేరు పురుకోస గా మారిపోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే నా అక్క పేరుతో మొదలుపెట్టాలి.

నా అక్క పేరు తాడిమేటి వెంకట సత్య నాగ దుర్గ త్రినాథ రామ లక్ష్మీ గాయత్రి. నా అక్క పేరు హాజరు పట్టీ లోను, certificates లోను ఇదే విధంగా నమోదు చేసి మా నాన్నగారికి చుక్కలు కనిపించాయి. ప్రతి certificate లోను, ప్రతి hall ticket లోను ఎప్పుడూ తన పేరు లో అచ్చు తప్పులు దొర్లటం, సరిచేయటానికి వెనక్కి పంపించటం పరిపాటి అయిపొవటంతో ఆ తప్పు మళ్ళీ చేయకూడదని నిశ్చయించుకొని, నా పేరును తాడిమేటి రాజారావు గా కుదించేసారు.

ఇక నా పేరు లో ప్రతి పదం వెనుకా ఒక చరిత్రే ఉంది. తాడిమేటి మా ఇంటి పేరు. నేను “పునర్వసు” నక్షత్రం లో పుట్టటం, అది రాములవారి నక్షత్రం కావటం చేత “రామ” అనే పదం జతపరచారు. ఆందుకే నన్ను మా ఇంటిలో అందరూ “రాము” అని పిలుస్తారు. ఇక మా కులదైవం తిరుమలేశుడైన శ్రీ శ్రీనివాసుడు పేరు నా పేరు లో మరో పదం. నా ఇద్దరు తాతగార్ల పేర్లలో ఎవరి పేరు పెడితే ఎవరికి కోపం వస్తుందోననో ఏమో “లక్ష్మీ నారాయణ” అని మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు, “రాజారావు” అని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు తగిలించేసారు. ఇక శివుడు మా నాన్నగారికి ఇష్టమైన దేవుడు, “నాగ” అనే పదం పేరులో చేర్చటం మా ఆచారం. ఇదండి నా పేరులో ప్రతి పదం వెనుక వున్న రొద, సొద, బాధ, గాధ..!!

ఇక నన్ను నా చిన్ననాటి స్నేహితులు “రాము” అని పిలుస్తారు. కాని నా Engineering స్నేహితులకి నా ఇంటి పేరులో ఏమి కోతులాడాయో ఏమో కాని, “తాడి” అని ముద్దుగా పిలుచుకొంటారు. ఇక నా “M.Tech” స్నేహితులు మరియు నా సహోద్యోగులు “రాజా” అని పిలుచుకొంటారు.

అమెరికా కి వచ్చిన తరువాత “రాజా”, “రావు” లలో “రాజా” నా First Name గా, “రావు” నా Middle Name గా మరిపోయి, జనాలు నన్ను “రాజా తాడిమేటి” గా మార్చివేసారు. ఇక నోరు తిరగని, “జా” ని “హా” గా ఉఛ్ఛరించే Mexicans, నా పేరుని “రాహా” గా ఖూనీ చేసేస్తూంటారు. ఏది ఏమినా, సొంత ఊరుని, సొంత వారిని గుర్తుకు తెచ్చే “రాము” అనే పిలుపే నాకెంతో బావుంటుంది.

నాకూ ఉందో బ్లాగు..!!

నమస్కారం. తాడిమేటి రాజారావు బ్లాగ్ కు స్వాగతం. నేను Software Engineer నే అయినా ఎప్పుడూ నాకంటూ ఒక website ఉండాలని అనుకోలేదు. ఆ అవసరం ఇంతవరకు కనపడలేదు. ఈ మధ్యనే నా భార్య తెలుగు లో బ్లాగులు చూడటం, నాకు తెలియపరచటం జరిగింది. అవి చూసాక నాకు కూడా తెలుగు లో బ్లాగ్ తయారుచేయాలన్న కోరిక పుట్టింది. నాకు అరంభశూరత్వం ఎక్కువ కనుక మొదలు పెట్టటం అయితే చేసేసాను కాని, ఎంతవరకు తరచుగా update చేస్తానో కాలమే నిర్ణయించాలి. 

నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సొంత భాష లో అభిప్రాయాలను వ్యక్తపరచటం సులభం. “లేఖిని” వంటి software సహాయం తో తెలుగు లో బ్లాగ్ తయారుచేయటం నల్లేరు పై నడక అయిపోయింది. ఆందుకు వారికి ఎంతయినా ఋణపడి వుంటాను.

ఈ బ్లాగ్ లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. తరచు విచ్చేసి మీ అభిప్రాయాలను నాకు తెలియపరచండి.