“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది.

ఈ పుస్తకంలో రకరకాలైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అనుభవాలు రచయిత విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు, వాటిని ఆయన పరిష్కరించిన విధానం, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు, వీటికి సంబంధించినవి అయితే, మరికొన్ని అనుభవాలు ఆయన పదవీకాలంలో అగుపడ్డ విచిత్రమైన, హేతువుకు అందని సంఘటనలు. వీటితో పాటుగా, T.T.D పై ఆ నాటి రాజకీయ నాయకుల ప్రభావం, కార్యనిర్వహణ అధికారికికి గల విశేష అధికారాలు, వాటికి గల పరిమితులు మొదలైనవి కూడా చక్కగా వివరింపబడ్డాయి.

తిరుమలలో 1978-82 మధ్య జరిగిన అనేక రకాలైన అబివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు, వాటి వెనుక ఉన్న కృషీ, నిబద్ధతా, అమలు జరుపబడ్డ పటిస్టమైన ప్రణాళికలూ  ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది తిరుమలలలో అమలుజరపబడ్డ మాస్టర్ ప్లాన్ వివరాలు.  అక్రమ కట్టడాల కూల్చివేత, సన్నిధి వీధి విస్తరణ, అధునాతన క్యూ కాంప్లెక్స్, ఆస్థాన మండపం, గెస్ట్‌హవుస్‌లు, భోజన శాలలు, కల్యాణకట్టల నిర్మాణాల సమయంలో ఎదురైన అనుభవాలు, స్థానికుల వ్యతిరేకత, వాటిని అధిగమించిన విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.  తిరుమలలో ధ్వజస్థంభం పుచ్చిపోతే, ఆ స్థానంలో కొత్త ధ్వజస్థంభ ప్రతిష్టాపనకై ఆగమ శాస్త్ర ప్రకారం కొమ్మలు, తొర్రలు లేని ఎత్తైన చెట్లకై సాగిన అన్వేషణ,  చివరకు అవి కర్ణాటకలోని అడవుల్లో లభ్యం కావటం, వాటిని అతి కష్టం మీద తిరుమలకు చేర్చడం వంటి వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తిరుమలలో ఏడవ నంబరు మైలు రాయి వద్ద నడక దారిలో జరిగిన స్త్రీ హత్య వివరాలు, ఆ తరువాత నడకదారిలోని ప్రయాణికుల భద్రత పెంచడానికి T.T.D తీసుకొన్న చర్యలు, వాటితో పాటుగా ఆంజనేయ స్వామి ఎత్తైన విగ్రహాన్ని అదే మైలు రాయి వద్ద ప్రతిష్టించడం వంటి వివరాలు ఆలోచింపచేస్తాయి. ఇక పెద్ద కళ్యాణోత్సవం సమయంలో వృధా అయ్యే పూజా ద్రవ్య వివరాలు, ప్రసాదం తయారీలో ఉన్న ఇబ్బందులు, ఆలయంలోని వివిధ మిరాసీదార్ల లాభాపేక్ష, ప్రత్యేక కళ్యాణోత్సవం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఒకప్పుడు 12 గంటలకు పైగా పట్టే ధర్మ దర్శనం సమయాన్ని క్రమంగా గంట, రెండు గంటలకు కుదించగలిగిన వైనం, వాటికై అమలుపరిచిన ప్రణాళికలు అబ్బుర పరుస్తాయి.

తిరుమలకు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేయవలసిన V.I.P దర్శన ఏర్పాట్లు, కల్పించవలసిన భద్రత, సిబ్బందికి చూపించవలసిన వసతి సదుపాయాలు, ఆ క్రమంలో సాధారణ భక్తులు పడే ఇబ్బందులు, వాటికి పరిష్కారంగా నిర్మింపబడ్డ “పద్మావతీ గెస్ట్‌హవుస్”, ఆ నిర్మాణ సమయంలో T.T.D పై వచ్చిన ప్రజాధన దుర్వినియోగ ఆరోపణలు వంటి విషయాలు చక్కగా వివరింపబడ్డాయి.

ఇక రచయితకి ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలకు వస్తే, తిరుమలలో 1978లో వచ్చిన తీవ్రమైన కరవు, నీటి కొరత, ఆ సమయంలో మూడురోజుల పాటు జరిపిన వరుణ జపం, అది పూర్తయిన వెంటనే కురిసిన కుండపోత వాన వంటి వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. శ్రీనివాసుని భక్తులకు పూర్తి నేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించే ప్రయత్నంలో వెడల్పుగా వుండే నామాన్ని చిన్నది చేయడం, ఆ తరువాత జరిగిన పర్యవసానాలు గగుర్పాటును కలిగిస్తాయి. ప్రతీ ఏటా తమిళనాడులోని శ్రివిల్లి పుత్తూరులోని గోదాదేవి కళ్యాణానికి తిరుమలనుంచీ పట్టుచీరను పంపే సాంప్రదాయం పుట్టుకకు సంబందించి రచయితకు ఎదురైన అనుభవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతే కాక రచయిత T.T.D కార్యనిర్వహక శాఖను తీసుకోవడానికి మొదట ఆయిష్టత కనపరచడం, ఆ తదుపరి ఎదురైన అనుభవాలు, పదవీకాలం చివరలో ఎదురైన అనుభవాలు మొదలుగునవి శ్రీనివాసుని భక్తులను ఆకట్టుకొంటాయి.

వీటితో పాటుగా, హిందూ ధర్మ పరిరక్షణకై T.T.D చేసిన విశేష కృషి, రామకృష్ణ మఠ నిర్మాణంలో పాత్ర, అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడం, ఆ క్రమంలో ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం, దాససాహిత్య ప్రాజెక్టు మొదలైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అదే విధంగా చెన్నారెడ్డి, వెంగళరావు, అంజయ్య, ఎన్.టి.ఆర్ వంటి ముఖ్య మంత్రులతో పనిచేసిన అనుభవాలు, వారి ఆగ్రహ ఆవేశాలకు లోనయిన సందర్భాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వివరాలు, ఇంకా మరెన్నో ఉన్నాయి.

మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి. అందుకే వీలు కుదిరితే తప్పక చదవండి. ఒకవేళ మీరు ఇప్పటికే చదివి ఉంటే మీ అభిప్రాయాలను పంచుకోండి.

ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

నేను ఈ మధ్య నెల రోజులకై ఇండియా వెళ్ళినప్పుడు, అంతటి హడావిడిలోనూ, తీరిక చేసుకొని మూడు పుస్తకాలు చదువగలిగాను.

ఎప్పటినించో నేను చాణక్యుడి గురించి వినడమే గానీ, అతని చరిత్ర గురించి తెలియదు. అర్థశాస్త్రం రచించాడనీ, చంద్రగుప్తుడిని రాజును చేయడంలో తెరవెనుక పాత్ర పోషించాడనీ, నందరాజ్య నిర్మూలనకై శపథం చేసాడనీ.. ఇలా పైపైన వివరాలు తప్ప, పూర్తి కథ తెలియదు. అందుకే రాజమండ్రి పుస్తక ప్రదర్శన లో “ఆర్య చాణక్య” అనే పుస్తకం కనపడగానే కొనివేసాను. “తాడంకి వేంకట లక్ష్మీ నరసింహరావు” గారు మొత్తం కథను ఉత్కంఠభరితంగా, నాటకీయ ఫక్కీలో, కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వర్ణించారు. న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతటి కుటిలమార్గమైనా అవలంబించడంలో తప్పులేదనీ, న్యాయాన్ని అందివ్వనప్పుడు అది ఎంత ధర్మమార్గమైనా అనుసరించరాదనీ ఉదాహరణలతో సహా వివరించారు. అందులో ఒక ఉదాహరణ ఇలా ఉంది. చాణక్యుని శిష్యుడైన ఒక బాలుడు అడవిలో చెట్టు కింద విశ్రాంతి తీసుకొంటూండగా, ఒక ఆవు, బెదరుతూ, ఎవరో తరుముకొస్తున్నట్టుగా అటు వైపుగా వస్తుంది. ఆ బాలుడు నెమ్మదిగా ఆ ఆవును పక్కకు తోలుకుపోయి, ఎవరూ చూడని ప్రదేశంలో దాచివేసి, మరల చెట్టు కింద కూర్చొంటాడు. ఇంతలోనే ఆ ఆవుకై వెతుకుతున్న కసాయివాడు అటుగా వచ్చి, ఆవు గురించి ప్రశ్నిస్తాడు. ఆ బాలుడు ఎక్కడా తొణకకుండా, నిబ్బరంగా, అసలు ఏ ఆవూ ఇటుగా రాలేదని అబద్ధం చెప్తాడు. కసాయివాడు వేరే దిక్కుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ బాలుడిని, “సత్యమునే పలుకవలెను” అనే ధర్మాన్ని ఎందుకు పాటించలేదని నిలదీస్తాడు. దానికి ఆ బాలుడు, “నేను సత్యమే పలికి ఉంటే, ఆ ఆవు ఈసరికి కసాయివాని చేతిలో హతమై ఉండేది. న్యాయాన్ని అందివ్వడానికి, ధర్మాన్ని పాటించకపోయినా తప్పులేదని మా గురువులు చాణక్యులు చెప్పారు. ఆ ఆవుకు న్యాయం చేకూర్చడానికే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది” అని సమాధానమిస్తాడు. ఇటువంటి ఉదాహరణలు ఈ కథలో ఎన్నో ఉన్నాయి. సామ్రాజ్య విస్తరణకై రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు పారించి, ఎందరో సైనికుల ప్రాణాలు బలిగొనే కన్నా, భేదోపాయం ఉపయోగించి, శత్రువుల మధ్య విభేదాలు సృష్టించి, వారి వేలితో వారి కన్నునే పొడుచుకొనేలా చేయడమే చాణక్యనీతి. చంద్రగుప్తుడిని మౌర్యసామ్రాజ్యాధీశుడిని చేసే క్రమంలో వేసిన ఎత్తులు, పై ఎత్తులు, అలెగ్జాండర్ అంటటివాడినే ఎదురొడ్డి నిలచిన ధైర్యసాహసాలు, ఇలా చాణక్యుడిలోని ఎన్నో పార్శ్వాలను రసవత్తరంగా కళ్ళముందుంచింది ఈ పుస్తకం. కొసమెరపు ఏమిటంటే, చాణక్యుడికే “వాత్స్యాయనుడు” అనే మరో పేరు ఉందనీ, “వాత్స్యాయన కామ సూత్రాలు” ఆయన రచించినవే అనీ తెలిసి ఆశ్చర్యం వేసింది.

నేను చదివిన మరో పుస్తకం “శ్రీ ఇచ్ఛాపురం రామచంద్రం” గారు రచించిన “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి”. “అపూర్వ చింతామణి” అనే రాకుమారి, తన గురువు ఇచ్చిన సలహాపై, తన స్వయంవరానికై ఒక వ్రతాన్ని ఆచరిస్తుంది. స్వయంవరానికై వచ్చిన రాకుమారులలో, తను అడిగే అయిదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగన రాకుమారుడినే ఆమె వరిస్తుంది. కానీ, ఒకవేళ సరిఅయిన సమాధానాలు చెప్పలేకపోతే, తన కత్తితో ఆ రాకుమారుడి శిరస్సు ఖండించి కోటగుమ్మానికి వ్రేలాడదీయిస్తుంది. ఈ విధంగా, ఆమెను స్వయంవరంలో ఓడించడానికై వచ్చి వెయ్యిమంది రాకుమారులు ఆమె కరవాలానికి బలి అయిపోతారు. ఇంతకీ అంత క్లిష్టమైన ఆ అయిదు ప్రశ్నలు ఏమిటి..? వాటివెనుక మర్మం ఏమిటి..? ఎవరైనా ఆ ప్రశ్నలకు సమధానం చెప్పగలిగారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే, ఎంతో ఉత్కంఠతో సాగిపోయే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే.

ఇక నేను చదివిన మరో మంచి పుస్తకం, “స్వామి వివేకానందుడు” చే రచింపబడిన “రాజ యోగ” అనే ఆంగ్ల పుస్తకం. రాజయోగంలోని ముఖ్యభాగాలైన యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధిలను గురించి క్లుప్తంగా, అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరింపబడింది. వెన్నుముక దిగువభాగంలో, మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉండే కుండలినీ శక్తి గురించి, ఆ శక్తిని మెదడులో వేయి రేకులతో వికసించే పద్మాన్ని పోలివుండే సహస్రార చక్రానికి తీసుకుపోయే ఇడ, పింగళ నాడుల గురించి, ఆ క్రమంలో జరిగే పరిణామాల గురించీ చక్కగా వివరించారు. మనిషి బయట చూసే ప్రపంచానికన్నా విశాలమైన ప్రపంచం మనిషి లోపల కూడా ఉందనీ, రాజయోగ సాధన ద్వారా ఆ ప్రపంచాన్ని చూడవచ్చనీ, దానికి సాధన ఎంతో ముఖ్యమనీ వివరింపబడింది. సైన్స్‌కీ, అధ్యాత్మికతకూ ముఖ్య భేదాన్ని కూడా వివేకానందుడు చక్కగా వివరించాడు. నిరూపింపబడేంతవరకూ దేనినీ నమ్మదు సైన్స్. కానీ, ముందు నమ్మకం ఉంచితే, నిజం నీకే అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది ఆధ్యాత్మికత. ఈ పుస్తకంలో చెప్పినవి మన అనుభవంలోకి రావాలంటే ఎన్నో సంవత్సరాల సాధన అవసరం. అది ఈ బిజీ జీవితంలో ఎంతవరకూ సాధ్యమో తెలియదుగానీ, ప్రతీ వ్యక్తీ కనీసం ఒకసారి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. తీరిక దొరికినప్పుడు తప్పక చదవండి.

అంతగా ఆకట్టుకోలేకపోయిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

సిలికానాంధ్ర సంస్థ ప్రతీ సంవత్సరం ఆంధ్ర సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా నిన్న, అనగా అక్టోబర్ 6వ తారీఖున సాంస్కృతికోత్సవాన్ని జరుపుకుంది. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వివరాలలోకి వెళ్తే..

సిలికానంధ్ర సాంస్కృతికోత్సవాలకు ముఖ్య ఆకర్షణ కూచిపూడి నృత్యరూపకం. 2005లో “ఉషా పరిణయం”, 2006లో “ధృవ చరితం” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. ఎప్పుడూ కూచిపూడి నృత్యానికి పెద్దపీట వేసే సిలికానాంధ్ర ఈసారి ఎందుకో చిన్నచూపు చూసింది. “స్వరాభినయ సారస్వం” అనే కార్యక్రమం ఉన్నా, మొత్తం రంగస్థలం గాయనీగాయకులతో నిండిపోవడంతో, కూచిపూడి నర్తకీమణులకు నర్తించడానికి సరిపడినంత చోటు లేకపోయింది. గతంలో 45 నిమిషాలనుండీ గంట వరకూ కథాపరంగా, వివిధ సన్నివేశాలు, దానికి తగిన పరదాలు, హంగులు, సెట్టింగులతో సాగిన నృత్యరూపకాలతో పోలిస్తే, వివిధ త్యాగరాజ కృతులతో పది పది నిమిషాలుగా సాగిన కూచిపూడి నృత్యం ఎందుకో నన్ను అంత ఆకట్టుకోలేకపోయింది. “జగదానందకారకా..” అనే కృతి మాత్రం ఎంతో వీనులవిందుగా ఉంది.

ఈ సంవత్సర కార్యక్రమాల్లో మరో ముఖ్య కార్యక్రమం “జగమంత జనని”. తల్లి ప్రేమను మరోసారి అందరికీ గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఓలేటి పార్వతీశంగారు సాహిత్యం అందించిన ఈ సంగీత నృత్యరూపకంలో ఏడు విధాలైన తల్లిప్రేమను చూపించారు. జన్మనిచ్చిన తల్లి, పెంచిన తల్లి, గోమాత, బ్రాహ్మణి, గురుపత్ని, రాజమాత, భూమాత లలో మాతృత్వాన్ని హరివిల్లులోని ఏడు రంగులతో పోలుస్తూ కార్యక్రమం సాగింది. దృశ్యాపరంగా చూస్తే ఈ కార్యక్రమం ఎంతో బాగుంది. రంగస్థల ముందు భాగంలో చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే, వెనుక అమ్మ పాత్రలోని మహిళ, పాపను ఎత్తుకొని లాలించడం, ఆమెపై ఫ్లాష్‌లైట్ పడి, ఆ నీడ వెనుక పరదాపై పడడం, ఎంతో ఆకట్టుకొంది. అదేవిధంగా పిల్లలు నృత్యంచేస్తుంటే, వారి అమ్మలు వచ్చి వారిని ముద్దాడి గుండెలకు హత్తుకోవడం, ఇద్దరు పిల్లలు గోమాత రూపంలో వచ్చి నాలుగు కాళ్ళతో నర్తించడం, చివరిలో భారతీయ జెండాను ప్రదర్శించడం చాలా బావుంది. నిజానికి ఈ కార్యక్రమం జనాలను ఎంతగానో ఆకట్టుకొని ఉండాలి. కానీ సౌండ్ సిస్టం సమస్యో లేదా రికార్డింగ్ లోపమో తెలియదుకానీ, ఈ కార్యక్రమానికి ఆయువుపట్టయిన సాహిత్యం సరిగా వినబడనే లేదు. దానితో రావలసినంత ఫీల్ రాలేదు. వ్యక్తిగతంగా చూస్తే, గత సంవత్సరం జరిగిన “సరిగంచు చీర” కార్యక్రమం ఆకట్టుకొన్నంతగా ఈ కార్యక్రమం  ఆకట్టుకోలేకపోయింది.

ఇక హాస్య నాటిక విషయానికి వస్తే, చాయా చిత్రాన్నీ, రంగ స్థలాన్నీ కలిపి “ఛాయారంగం” కార్యక్రమంతో విన్నూత్న ప్రయోగం చేసినందుకు సిలికానాంధ్రను అభినందించాలి. వెనుక వీడియో క్లిప్పింగ్‌లో వస్తున్న పాత్రలను వాస్తవంగా భావిస్తూ, దానికి ప్రతిస్పందించడం పాత్రధారులకు కత్తిమీద సామే. దీనికి, వెనుక వీడియో క్లిప్పింగ్ నడుపుతున్నవారికీ, ముందు నటిస్తున్న వారికీ మధ్య ఎంతో సమన్వయం ఉండాలీ. లేకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. ఈ సాహస ప్రయోగంలో  చాలావరకూ సిలికానాంధ్రవారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. కానీ, ఇంత కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించినవారు కథాపరంగా తగిన శ్రద్ధ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. కథలో హాస్యంపాలు చాలా తక్కువగాను, చాలా సన్నివేశాలు అసహజంగాను ఉన్నాయి. క్రితం సంవత్సరం “బాబోయ్ సెల్‌ఫోన్” హాస్యనాటికతో పోలిస్తే “చాయారంగం” తేలిపోయిందనే చెప్పాలి.

ఇక మరో కార్యక్రమం జానపద నృత్యరూపకం “ధినాక్ ధిం ధిం”. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొన్న ఈ కార్యక్రమంలో హరిదాసు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, బావా మరదళ్ళ సరసాలతో కూడిన పాటలు, దంపుళ్ళ పాటలు ఇలా దాదాపు కనుమరుగైపోతున్న జానపద పాటలను గుర్తుచేసే ప్రయత్నం చేసారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తయారు చేసిన సెట్టింగులు, ఏనుగు బొమ్మ, ఎంతో ఆకట్టుకొన్నాయి. నర్తించినవారు కూడా ఆద్యంతం ఎంతో చలాకీగా, హుషారుగా నాట్యం చేసారు. కానీ ఈ కార్యక్రమంలోనూ సౌండ్ సిస్టం సమస్య వల్ల సాహిత్యం సరిగా వినబడకపోవడం లోటే.  

చివరిగా చెప్పుకోవలసినది “చాణక్య శపథం” నాటకం. చాణక్యుడిగా “దిలీప్ కొండిపర్తి” గారి అభినయం చాలా బాగుంది. ఆరంభంలో కొంత తడబడ్డా, చివరిలో ఏకబిగిన 4-5 నిమిషాలపాటు, ఆవేశంతో సాగే సంభాషణలను ఎంతో రక్తి కట్టించారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ రౌద్రాన్ని సూచిస్తూ ఎరుపు రంగులోకి మారటం ఎంతో ఆకట్టుకొంది. కానీ, ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతంగా కథని సంక్షిప్తంగా వివరించివుంటే ఇంకా బాగుండేదని అనిపించింది.

ఇక ప్రేక్షకులను అసహనానికి గురిచేసినవి కొన్ని ఉన్నాయి. ప్రతీ కార్యక్రమానికీ మధ్య దాతలను సన్మానించడం, లేక మేయర్లను సన్మానించడం, సిలికానాంధ్ర గొప్పతనాన్ని వివరించడం వంటివి విసుగు తెప్పించాయి. ముందు కార్యక్రమంలో పొందిన తృప్తి, ఆనందం వంటివి మధ్యలో వస్తూ ఉన్న ఈ విరామాలవల్ల ఆవిరయిపోయాయి. వీటిని కుదించి, ఒకేసారి కానిచ్చి ఉంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పేది. వీటిలో కూడా సమన్వయ లోపాలు కనిపించాయి. చెప్పిన విషయాన్నే మరల మరల ఇద్దరు ముగ్గురు చెప్పడం, పిలిచిన దాతలనే మరల పిలవడం, వారి పేర్లను తప్పుగా పరిచయం చేయడం, సన్మానించవలసిన వారి పేర్ల చిట్టా ముందుగా సిద్ధం చేసుకోక పోవడం, ఒక్కోసారి ఒక్క సిలికానాంధ్ర సభ్యుడు కూడా లేకుండా స్టేజిమీద అతిథులను వదిలివేయడం, ప్రేక్షకులను పదే పదేదే అడిగి చప్పట్లు కొట్టించుకోవడం, స్టేజీ కిందనుంచి స్టేజీ పైన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి సమాచారం పంపిస్తూ సమచారలోపాన్ని బహిర్గతం చేసుకోవడం, కార్యక్రమం చివరిలో కూడా వీడ్కోలు పలకాలా లేక గుర్తించవలసినవారెవరైనా మిగిలిపోయారా అన్న సందేహంలో ఉండిపోవడం ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యనిర్వహణాలోపాలు ఈసారి కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా పకడ్బందీ ప్రణాళిక కావాలి. అది ఈసారి ఎందుకో సరిగా జరగలేదు. గత సంవత్సరాలలో తాను నెలకొల్పుకొన్న ప్రమాణాలను తానే అందుకోలేకపోయింది ఈసారి సిలికానాంధ్ర. ఇక ఈ సారి కార్యక్రమాల్లొ, గతసారి జరిగినట్లుగా ఏ తెలుగు ప్రముఖులనీ సన్మానించుకోలేకపోవడం కూడా ఒక లోటే.
  

  
       

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు.

కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” అని కొందరు అనువదించినా ఆ అనువాదము సంపూర్ణము కాదు. ఎందుకంటే పొగను విడిచే వాహనాలు ఎన్నో వున్నాయి. అదేవిధంగా ప్రతి సామాన్యుడికీ అర్ధమయ్యే రైలు అనే పదాన్ని పై విధంగా అనువదించటం కూడా సరి కాదు. అంతెందుకు..? మనం రోజూ చేసే బ్లాగింగు అనే ఆంగ్ల పదాన్ని అదే విధంగా తెలుగులో ఉపయోగించట్లేదా..? ఇంకా వాటిపై చమత్కార చణుకులు జల్లి, బ్లాగరి, బ్లాగర్లు, బ్లాగ్లోకం ఇలా ఎన్నో తెలుగులో లేని పదాలను సృష్టించుకున్నామే, మరి ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ లాంటి పదాలను అదే పేరుతో తెలుగులో ఉపయోగిస్తే తప్పేముంది..?

మనం తెలుగును ఉపయోగించేటప్పుడు, పరభాషా పదాలకు అదే అర్థం స్ఫురింపచేసే తెలుగు పదాలు ఉంటే వాడటంలో తప్పు లేదు. కానీ, అదే పనిగా ప్రతీ పరభాషా పదాన్నీ ముక్కలుగా తెగ్గోసి తెలుగులోకి అనువదించటం వల్ల బ్లాగులు సామాన్యుడికి అర్ధం కాని విధంగా తయారవుతాయని నా అభిప్రాయం. భారతీయ పదాలైన “యోగా”, “దేశీ”, “గురు” లాంటి వాటిని ఆంగ్లంలో ఉపయోగిస్తున్నప్పుడు “ఇంటర్‌నెట్” లాంటి పదాలను తెలుగులో అదే విధంగా వాడుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. అంతే తప్ప “వెబ్”ను “సాలెగూడు” గానూ “హార్డ్ డిస్క్” ను “కఠిన చట్రం” గానూ అనువదిస్తూపోతే తెలుగు బ్లాగులు హాస్యాస్పదంగా తయారవుతాయి. మరి మీరేమంటారు..?