ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు.
చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు, “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” అన్నట్లు ఏడవలేక వచ్చే నవ్వులు చాలాసార్లు వినిపించాయి.
కథ విషయానికి వస్తే, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడం, తండ్రిని చంపిన విలన్‌పై పగ తీర్చుకోవడం, పొగరుబోతు హీరోయిన్ తిక్క కుదిర్చి ప్రేమాయణం సాగించడం.. ఇలాంటి కథతో ఎన్ని సినిమాలు రాలేదు..? కొడుకు కెరీర్‌ను శ్రద్ధగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, తన కొడుకు తొలి సినిమాకు ఇంత మూస కథను ఎన్నుకోవడం విచిత్రమే.
ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం పెద్ద మైనస్. పాటలు ఎక్కడా వినసొంపుగా లేవు. చిరంజీవి కొడుకు సినిమా కనుక పాటలు ఆ మాత్రం అన్నా పాపులర్ అయ్యాయి. చిరంజీవితో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ, ఈ చిత్రానికి ఇంత నాసిరకం సంగీతాన్ని అందించాడంటే ఆశ్చర్యమే.
ఇక చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలందరికీ హీరోయిన్లను ఎన్నుకోవడంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల ఇటీవలి సినిమాలకు హీరోయిన్‌లు ఎంత మైనస్ అయ్యారో తెలిసిన విషయమే. అదే జాడ్యం ఈ సినిమాకూ పట్టుకొంది. ఒక్కోసారి హీరోయిన్‌ను మిగిలిన స్నేహితురాళ్ళతో కలిపి చూపిస్తే గుర్తించడమే కష్టం అయ్యింది.
ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి, ఎంత చెత్త సినిమానైనా “ఏరా”, “ఒరే”, “ఏమ్మా”, “పోమ్మా” లాంటి మాస్ పదాలతో లాగించేయచ్చనే కాన్‌ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది. ఇందులోనూ హీరో, హీరోయిన్ల మధ్యన అతి సంభాషణా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాల్లో ఈ సంభాషణలు క్లిక్ అయినా, ప్రతీ సినిమాకీ అదే కొనసాగిస్తే ఎప్పుడో ప్రేక్షకులు తిప్పికొడతారన్న విషయం పూరీ గుర్తించాలి. అదే విధంగా క్లాస్ సినిమాగా తీయాలా, లేక మాస్‌ను ఆకర్షించాలా అనే విషయంలో కూడా పూరీ కన్‌ఫ్యూజన్ స్పష్టంగానే కనిపించిపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ కొన్నిచోట్ల “సూపర్” సినిమాను తలపించింది. ముఖ్యంగా వాటర్ స్కూటర్ ఫైట్ అయితే “సూపర్” క్లైమాక్స్ సన్నివేశాన్నే గుర్తుకు తెచ్చింది.
ఈ సినిమాలో కొద్దో గొప్పో హాస్యం అంటే ఆలీ గూర్చే చెప్పుకోవాలి. “యు వాంట్ థాయ్ మస్సా..” అంటూ పర్యాటకులను మసాజ్‌తో ఆకట్టుకొనే ఆడ బ్రోకర్ పాత్రను పోషించాడు. ఆలీకి ఆడవేషం కొత్త కాకపోయినా, సాధ్యమైనంత వరకూ కొత్త మేనరిజంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
ఇక అమెరికాలో, చిరంజీవి ఇమేజ్‌ను సొమ్ముచేసుకోవడానికి టిక్కెట్టు రేటును 15 డాలర్లు చేయడం కోపం తెప్పించింది. ఈ మధ్య అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో రేట్లు కూడా బాగా గుంజి జనాలను దోచుకొంటున్నారు.
చివరిగా, రాంచరణ్ నటన ఫరవాలేదు. ఎక్కడా మొదటి సినిమా అన్న బెరకు కనిపించలేదు. డైలాగ్ డెలివరీ కొంత మెరగుపరచుకోవలసి ఉంది. డాన్స్‌లు, ఫైట్‌లు భాగా చేశాడు. కానీ, నటనలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల ఛాయలు కనిపించాయి. వాటిని పోగొట్టుకొని సొంత స్టైల్‌ను అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక రాంచరణ్ రెండవ సినిమా రాజమౌళితోనట. హింస, అశ్లీలతలపై ఆధారపడి పబ్బం గడుపుకొనే రాజమౌళి చేతిలో పడితే మాస్ మూసలో పడి ఇతని భవిష్యత్ కొట్టుకుపోవడం ఖాయం. ఇటువంటి దర్శకులను ఎన్నుకొనేబదులు, కథాబలం గల సినిమాలు తీస్తూ టాలెంట్ పుష్కలంగా గల “శేఖర్ కమ్ముల”, “చంద్ర శేఖర్ యేలేటి”, “శేఖర్ సూరి”, “చంద్ర సిధ్ధార్థ” లాంటి దర్శకుల చేతిలో పడితే ఇతని భవిష్యత్‌కు ఇంకా ఉపకరిస్తుందని నా అభిప్రాయం.