“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది.

ఈ పుస్తకంలో రకరకాలైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అనుభవాలు రచయిత విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు, వాటిని ఆయన పరిష్కరించిన విధానం, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు, వీటికి సంబంధించినవి అయితే, మరికొన్ని అనుభవాలు ఆయన పదవీకాలంలో అగుపడ్డ విచిత్రమైన, హేతువుకు అందని సంఘటనలు. వీటితో పాటుగా, T.T.D పై ఆ నాటి రాజకీయ నాయకుల ప్రభావం, కార్యనిర్వహణ అధికారికికి గల విశేష అధికారాలు, వాటికి గల పరిమితులు మొదలైనవి కూడా చక్కగా వివరింపబడ్డాయి.

తిరుమలలో 1978-82 మధ్య జరిగిన అనేక రకాలైన అబివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు, వాటి వెనుక ఉన్న కృషీ, నిబద్ధతా, అమలు జరుపబడ్డ పటిస్టమైన ప్రణాళికలూ  ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది తిరుమలలలో అమలుజరపబడ్డ మాస్టర్ ప్లాన్ వివరాలు.  అక్రమ కట్టడాల కూల్చివేత, సన్నిధి వీధి విస్తరణ, అధునాతన క్యూ కాంప్లెక్స్, ఆస్థాన మండపం, గెస్ట్‌హవుస్‌లు, భోజన శాలలు, కల్యాణకట్టల నిర్మాణాల సమయంలో ఎదురైన అనుభవాలు, స్థానికుల వ్యతిరేకత, వాటిని అధిగమించిన విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.  తిరుమలలో ధ్వజస్థంభం పుచ్చిపోతే, ఆ స్థానంలో కొత్త ధ్వజస్థంభ ప్రతిష్టాపనకై ఆగమ శాస్త్ర ప్రకారం కొమ్మలు, తొర్రలు లేని ఎత్తైన చెట్లకై సాగిన అన్వేషణ,  చివరకు అవి కర్ణాటకలోని అడవుల్లో లభ్యం కావటం, వాటిని అతి కష్టం మీద తిరుమలకు చేర్చడం వంటి వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తిరుమలలో ఏడవ నంబరు మైలు రాయి వద్ద నడక దారిలో జరిగిన స్త్రీ హత్య వివరాలు, ఆ తరువాత నడకదారిలోని ప్రయాణికుల భద్రత పెంచడానికి T.T.D తీసుకొన్న చర్యలు, వాటితో పాటుగా ఆంజనేయ స్వామి ఎత్తైన విగ్రహాన్ని అదే మైలు రాయి వద్ద ప్రతిష్టించడం వంటి వివరాలు ఆలోచింపచేస్తాయి. ఇక పెద్ద కళ్యాణోత్సవం సమయంలో వృధా అయ్యే పూజా ద్రవ్య వివరాలు, ప్రసాదం తయారీలో ఉన్న ఇబ్బందులు, ఆలయంలోని వివిధ మిరాసీదార్ల లాభాపేక్ష, ప్రత్యేక కళ్యాణోత్సవం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించిన తీరు ముచ్చట గొలుపుతుంది. ఒకప్పుడు 12 గంటలకు పైగా పట్టే ధర్మ దర్శనం సమయాన్ని క్రమంగా గంట, రెండు గంటలకు కుదించగలిగిన వైనం, వాటికై అమలుపరిచిన ప్రణాళికలు అబ్బుర పరుస్తాయి.

తిరుమలకు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేయవలసిన V.I.P దర్శన ఏర్పాట్లు, కల్పించవలసిన భద్రత, సిబ్బందికి చూపించవలసిన వసతి సదుపాయాలు, ఆ క్రమంలో సాధారణ భక్తులు పడే ఇబ్బందులు, వాటికి పరిష్కారంగా నిర్మింపబడ్డ “పద్మావతీ గెస్ట్‌హవుస్”, ఆ నిర్మాణ సమయంలో T.T.D పై వచ్చిన ప్రజాధన దుర్వినియోగ ఆరోపణలు వంటి విషయాలు చక్కగా వివరింపబడ్డాయి.

ఇక రచయితకి ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలకు వస్తే, తిరుమలలో 1978లో వచ్చిన తీవ్రమైన కరవు, నీటి కొరత, ఆ సమయంలో మూడురోజుల పాటు జరిపిన వరుణ జపం, అది పూర్తయిన వెంటనే కురిసిన కుండపోత వాన వంటి వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. శ్రీనివాసుని భక్తులకు పూర్తి నేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించే ప్రయత్నంలో వెడల్పుగా వుండే నామాన్ని చిన్నది చేయడం, ఆ తరువాత జరిగిన పర్యవసానాలు గగుర్పాటును కలిగిస్తాయి. ప్రతీ ఏటా తమిళనాడులోని శ్రివిల్లి పుత్తూరులోని గోదాదేవి కళ్యాణానికి తిరుమలనుంచీ పట్టుచీరను పంపే సాంప్రదాయం పుట్టుకకు సంబందించి రచయితకు ఎదురైన అనుభవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతే కాక రచయిత T.T.D కార్యనిర్వహక శాఖను తీసుకోవడానికి మొదట ఆయిష్టత కనపరచడం, ఆ తదుపరి ఎదురైన అనుభవాలు, పదవీకాలం చివరలో ఎదురైన అనుభవాలు మొదలుగునవి శ్రీనివాసుని భక్తులను ఆకట్టుకొంటాయి.

వీటితో పాటుగా, హిందూ ధర్మ పరిరక్షణకై T.T.D చేసిన విశేష కృషి, రామకృష్ణ మఠ నిర్మాణంలో పాత్ర, అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడం, ఆ క్రమంలో ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం, దాససాహిత్య ప్రాజెక్టు మొదలైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అదే విధంగా చెన్నారెడ్డి, వెంగళరావు, అంజయ్య, ఎన్.టి.ఆర్ వంటి ముఖ్య మంత్రులతో పనిచేసిన అనుభవాలు, వారి ఆగ్రహ ఆవేశాలకు లోనయిన సందర్భాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వివరాలు, ఇంకా మరెన్నో ఉన్నాయి.

మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి. అందుకే వీలు కుదిరితే తప్పక చదవండి. ఒకవేళ మీరు ఇప్పటికే చదివి ఉంటే మీ అభిప్రాయాలను పంచుకోండి.

11 comments on ““సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

  1. చిలమకూరు విజయమోహన్ అంటున్నారు:

    నిజంగా చాలా అద్భుతమైన పుస్తకం.

  2. zilebi అంటున్నారు:

    Ee Sarva Sambhavaam ( Naa ham Kartaa – Kartaa Hari hi) pustakam really a marvellous book. As you mentioned its really a great book in terms of inner spiritual journey vs Management of external aspects of life. When I read that I wished Shri Prasad translates this in English for a wider audience of Civil Servants which may be of great help to many people who are in different cadres of management. I personally told many of my friends who are keen in management line and who know telugu to read this inspirational book. After all = Naa Ham Kartaa Kartaa Hari hi is the greatest approach which Lord Krishna proposes in terms of “Maa Karma Phaleshu Kadaachana”.

    Regards
    Zilebi.

  3. “మొత్తం మీద ఆస్తికులను, నాస్తికులను ఒకే విధంగా అలరించే పుస్తకం ఇది. ఒక ఆధ్యాత్మిక లేదా భక్తి పుస్తకంగానే కాక, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఎన్నో నిజజీవిత ఉదాహరణలు ఈ పుస్తకం లో కనిపిస్తాయి.” ఈ వాక్యాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.

  4. అరిపిరాల అంటున్నారు:

    అద్భుతమైన పుస్తకం. ఇప్పటికి ఒక పదిసార్లైనా చదివుంటాను. ఒక నలుగురికి బహుమతిగా కొనిచ్చాను. స్వాతిలో వున్న బాపు బొమ్మలు పుస్తకంలో లేకపోవటం పెద్ద లోటు అనిపించింది. “కాసుల హారం”, “16 గంటల అజ్ఞానం” కథలకి బాపు బొమ్మలు ఇప్పటికీ కథ చదువుతుంటే కళ్ళముందు కనపడతాయి. ఈ కథలు అప్పట్లో అంతర్జాలంలో కూడా చూసిన గుర్తు (బాపూ బొమ్మలతో) ఎవరికైనా దొరికితే లంకె ఇవ్వగలరు.

  5. Jagadeesh అంటున్నారు:

    నిజంగానే చాలా మంచి పుస్తకం. నేను చదివాను. గతంలో స్వాతి వార పత్రికలో వచ్చినప్పుడు చదివాను, మరల, ఈ పుస్తకం కూడా కొన్నాను. IAS ఆఫీసర్ అవ్వడం వల్లనో ఏమో, ప్రసాద్ గారు తనకు జరిగిన సంఘటనలని విశ్లేషించిన తీరు, కధనం, వాడిన భాష చదువరుల్ని కట్టి పడేస్తాయి. సమయం కుదిరితే, ఏకబిగిన పుస్తకం మొత్తాన్ని చదివించగల శక్తి ప్రసాద్ గారి రచనలో ఉంది. అందరూ చదవదగిన ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.

  6. మున్నీ అంటున్నారు:

    నేను కూడా స్వాతిలో వచ్చినప్పుడు చదివాను. పుస్తకరూపములో ఉంది అని చదివి ఎంతో సంతోషిస్తున్నాను. దయచేసి ఈ పుస్తకం అంతర్‌జాలం ద్వారా ఎలా కోనుగోలు చేయ్యవచ్చో తెలుపగలరు. కనీసం పబ్లిషర్ మొదలగు వివిరములు తెలపండి.

    • రాజారావు తాడిమేటి అంటున్నారు:

      మున్నీ గారూ,

      ఇది ఎమెస్కో వారి ప్రచురణ. వారి చిరునామా:

      ఎమెస్కో బుక్స్,

      ఏలూరు రోడ్,
      విజయవాడ – 2.
      ఫోన్: 0866-2577498, 2575281.

      మాసబ్ ట్యాంక్,
      హైదరాబాద్.
      ఫోన్: 040-23373103.

      అంతర్జాలంలో http://www.avkf.org లో లభించవచ్చు. ప్రయత్నించి చూడండి.

  7. బోనగిరి అప్పారావు అంటున్నారు:

    ఈ పుస్తకం నేను చదవలేదు కాని తిరుమల ఆలయం, పరిసరాల అభివృద్ది మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని నేను తెలుగు పీపుల్. కం లో వ్రాసాను. వాటిని మీరు కూడా ఈ కింద లింకులో చదివి మీ అభిప్రాయాలు చెబుతారని ఆశిస్తున్నాను.
    http://www.telugupeople.com/discussion/article.asp?id=48443

  8. బోనగిరి అప్పారావు అంటున్నారు:

    I have posted the above article in my blog http://www.bonagiri.wordpress.com also.

    you may read and comment there.

  9. common man అంటున్నారు:

    ఈ పుస్తకం చదువుతుంటే నేను తిరుమల లో తిరుగుతున్న అనుభూతిని పొందుతాను..ఆ మూలవిరాట్ ని వర్ణిస్తున్నప్పుడల్లా ఆ విగ్రహం చూస్తున్నట్టే వుంటుంది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s