చిన్ననాటి ఆటలను గురించి ఆలోచించుకొంటున్నప్పుడు తప్పక గుర్తుకు వచ్చే ఆట – చింతగింజలు. ఈ ఆటను ఎక్కువగా ఆడవారు ఆడుతూ ఉండేవారు. అందువల్ల ఈ ఆటలో పెద్దగా ప్రవేశం లేకపోయినా, మా అక్క, ఆమె స్నేహితురాళ్ళు ఆడుతున్నప్పుడో, లేక మా అమ్మ, పిన్ని ఆడుతున్నప్పుడో చూడడం వల్ల ఈ ఆటను గురించిన కొన్ని విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి.
ఈ చింతగింజలతో దాదాపు మూడు-నాలుగు రకాలైన ఆటను ఆడుతూ ఉండేవారు. ఏ ఆటలో అయినా ఎవరికి ఎన్ని ఎక్కువ చింతగింజలు వస్తే వారు గెలిచినట్లు లెక్క. ఈ చింతగింజలను లెక్కించడానికీ ఒక కొలమానం ఉంది..!! అదేమిటంటే: నాలుగు గింజలను ఒక “పుంజి” అంటారు. రెండు పుంజిలు కలిస్తే ఒక “కచ్చట”. అయిదు కచ్చట్లు ఒక “గుర్రం”. అయిదు గుర్రాలు ఒక “ఏనుగు”..!! ఈ విధంగా లెక్కించి ఆట చివర్లో ఎవరికి ఎక్కువ గింజలు వస్తే వారిని విజేతగా నిర్ణయిస్తారు.
ఇక చింతగింజలతో ఆడే ఆటల వివరాలలోకి వెళ్దాము. మొదటి రకం ఆటలో చింతగింజలన్నీ కొంచం చెదురుమదురుగా నేలపై పరుస్తారు. మొదటగా ఆట ఆడే వ్యక్తి ఒక చింతగింజను తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ గింజ తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న చింతగింజలలో కొన్నింటిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర గింజలూ కదలకూడదు. అదే సమయంలో పైనున్న గింజ నేలకు తాకకుండా అదే గుప్పిటతో మరల అందుకోవాలి. పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, లేక కిందనున్న ఏ ఇతరగింజలు కదిలినా ఆ వ్యక్తికి ఆటను కొనసాగించే అవకాశం పోతుంది. ఈ లోపుగా సేకరించగలిగిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. ఈ విధంగా ఆట ఒకరినుంచి ఇంకొకరికి మారుతూ కిందనున్న గింజలన్నీ అయిపోయేదాకా కొనసాగుతుంది. చూడడానికి ఎంతో సులువుగా అనిపించినా, ఎంతో ఏకాగ్రత, కళ్ళు – చేతులు మధ్య ఎంతో సమన్వయం ఉంటేగాని సాధ్యపడని ఆట ఇది.
ఇక రెండో రకం ఆటను మేము “ఊదే ఆట” అని పిలుచుకొనే వాళ్ళం. ఈ ఆట ఆడడం చాలా సులువు. మొదటగా చింతగింజలన్నీ నేలపై ఒక కుప్పగా పోస్తారు. ప్రతీ వ్యక్తీ, తన అవకాశం వచ్చినప్పుడు, బాగా.. నోటితో గాలి పీల్చి, నేలపై ఉన్న గింజలన్నిటినీ గట్టిగా ఊదాలి. ఆ ఊదిన వేగాన్ని బట్టీ గింజలు కొంత చెల్లాచెదురవుతాయి. అప్పుడు ఒక్కొక్క గింజనే, పక్కనున్న గింజలు కదలకుండా పక్కకు తీస్తూ పోవాలి. ఈ విధంగా సేకరించిన గింజలన్నీ ఆ వ్యక్తి ఖాతాలోకి చేరతాయి. బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఆట చాలా ఇష్టంగా ఉండేది.
ఇక మూడోరకం ఆటలో కూడా నేలపై చింతగింజలను చెదురుమదురుగా పరుస్తారు. ఆట ఆడే వ్యక్తి తన ఎడంచేతి బొటన, చూపుడు వేళ్ళను నేలపై నిటారుగా ఆనించి , వాటి మధ్య తిరగేసిన “U” అకారంలో చోటు వచ్చేలా నిలిపి ఉంచాలి. ఇక కుడిచేత్తో ఒక చింతగింజను గాలిలోకి ఎగురవేస్తూ, అది కిందకుపడేలోపుగా, కిందనున్న చింతగింజలను ఒక్కొకటినీ, పక్కన గింజలకు తగులకుండా ఇంతకు ముందు చెప్పిన “U” ఆకారంగల చోటులోకి తోస్తూపోవాలి. అంటే ఫుట్‌బాల్ ఆటగాడు గోల్ చేసినట్లన్నమాట..!! పైకి ఎగురవేసిన గింజ నేలను తాకినా, కిందనున్న గింజలు కదిలినా అవకాశం పక్కన వ్యక్తికి వెళ్ళిపోతుంది.
పైన చెప్పిన మూడు రకాల ఆటలనే కాక, చింతగింజలతో “వామన గుంటలు” అనే ఆటను కూడా ఆడేవాళ్ళం. దీనినే ఇప్పుడు “మంకాలా” అనే పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ ఆటకూడా మెదనుకు పదును పెట్టే విధంగా ఉంటుంది. ఇంట్లో చింతకాయతో ఊరగాయలు లాంటివి పెట్టేటప్పుడు పోగయ్యిన చింతగింజలన్నీ తీసి అవతల పారవేయకుండా, వాటిని భద్రపరచి, మెదడుకు పదును పెట్టే ఆటలకు ఉపయోగించడం మనవారికే చెల్లింది. మరే ఇతర ప్రాచీన ఆటలవల్లే ఈ చింతగింజల ఆటలుకూడా క్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
rajarao garu,
‘vamanaguntalu’ ane aata ela adatharo meeku telesthe mee blog loo rayagalaru.
Raja rao garu,
Naa comment publish chesinanduku thanks.Ma entlo oka purathanamaina vamanaguntala box dorikindi.Adi maavari (husband) ammamma garidi.Vallandaru chinnappudu adevaruta.Kani eppudu ela adaalo marchipoyaru.Maa pillalu aa aata eppudu adalani interest chopistunnaru.Aa process meeku telesthe cheppagalaru.
Than q.
i want that