సాధారణంగా పల్లెటూర్లలో పండుగ వచ్చిందంటే ఎంత హడావిడి వాతావరణం నెలకొని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరాల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఆ పండుగ పదిరోజులూ పొద్దున్న ఆరింటికి మొదలు పెట్టి సాయంత్రం వరకూ ఆగకుండా సాగే లౌడు స్పీకర్ల హోరు ఒక ఎత్తైతే, ప్రతీ సాయంత్రం వీధిలో రోడ్డుకు అడ్డంగా తెర కట్టి ప్రదర్శించే సినిమాలు మరొక ఎత్తు.
ఈ పండుగల హడావిడి సాధారణంగా ఒక నెల ముందే మొదలవుతుంది. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించే కార్య నిర్వాహక వర్గం అన్నింటికంటా ముందుగా చేసే పని.. చందాలు వసూలు చేయడం. ఉత్సవాలు నిర్వహించే ప్రదేశానికి చుట్టుపక్కన ఉండే మూడు నాలుగు వీధులలోని ప్రతీ ఇంటికీ వీరు వెళ్ళి చందాలు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏ ఇంటిలో ఎంత చందా వసూలు చేయాలో, అలా వసూలు చేయాలంటే ఎవరు ఆ ఇంటికి వెళ్ళాలో, వాళ్ళని బుట్టలో ఎలా వెయ్యలో అంతా ప్రణాళిక వీరి దగ్గిర సిద్ధంగా ఉంటుంది. ఇలా వసూలైన చందాలను వీధుల్లో సీరియల్ బల్బులు, ట్యూబులైట్లు వేయడానికీ, మైకు సెట్లను పెట్టడానికీ, ఇంకా ఇతర ప్రచార కార్యక్రమాలకూ వాడుతూంటారు. కానీ ప్రతీ రోజూ రాత్రి ప్రదర్శించబోయే సినిమాల చందా విషయం మాత్రం కొంచం వేరుగా ఉంటుంది.
ఈ సినిమాలకు సాధారణంగా ఆ నాలుగు వీధులలో పరపతి గల.. లేదా పరపతికి పాకులాడే కుటుంబాలు స్పాన్సర్ చేస్తుంటాయి. ప్రతీ సంవత్సరం మనస్ఫూర్తిగా సినిమాకు చందా ఇచ్చే కుటుంబాలు కొన్నైతే, అస్సలు ఇష్టమే లేకపోయినా, వేరే వారిముందు తీసికట్టుగా ఉండకూడదని మొహం మాడ్చుకొని చందా ఇచ్చేవారు మరికొందరు. ఈ విధంగా పండుగ పది రోజులూ రోజుకొక కుటుంబం చొప్పున చందా ఇస్తూ ఉంటుంది.
ఈ సినిమాల ప్రదర్శనలు ప్రారంభమయ్యే రోజు రోడ్డుకు ఇరుపక్కలా గునపాలతో గోతులు తవ్వి రెండు కర్రలను నిలపెడతారు. వీటి మధ్యలో ఒక తెల్లటి తెరను వ్రేలాడదీసి దాని నాలుగు కొనలనూ కర్రలకు గట్టిగా బిగించి కడతారు. ఆ పదిరోజులూ ఏ పెద్ద వాహనాలు అటుగా రాకుండా కర్రలతో కొద్ది దూరంలో రోడ్డుకు అడ్డుకట్టి పక్క వీధిగుండా దారి మళ్ళిస్తారు.
ఇక సినిమా ప్రారంభమయ్యే రోజు పొద్దున్నే హంగామా మొదలవుతుంది. ఆ కూడలి నుంచీ మైకు సెట్టూ, లౌడు స్పీకర్తో కూడిన ఒక రిక్షా బయలు దేరుతుంది. దీనిలో ఒక మనిషి కూర్చొని నాలుగు వీధులూ తిరుగుతూ.. ఆ రోజు ప్రదర్శింపబడే సినిమా పేరు, నటీ నటుల వివరాలు, ప్రదర్శింపబడే సమయం, ప్రదేశం.. దానికి చందా ఇచ్చిన వారి వివరాలతో ప్రచారం చేస్తాడు.
సినిమా ప్రారంభం సాధారణంగా రాత్రి తొమ్మిది, పది గంటల మధ్య మొదలవుతుంది. ఈ ఉత్సవాల సమయంలో ఆ ప్రదేశమంతా వెలుగు జిలుగులతో ఉండడం వల్ల పిల్లలందరూ పెందలాడే అన్నం తిని ఆటలు మొదలు పెడతారు. పెద్దలందరూ నెమ్మదిగా భోజనాలు ముగించుకొని ఆ ప్రదేశానికి చేరుకొంటారు.. ఈ సినిమాకు జనాలు చాలా పకడ్బందీగా సిద్ధమవుతారు. రోడ్డు మీదనే కూర్చొని సినిమా చూడడానికి వీలుగా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు చాపలు, బొంతలు, కొంతమంది మడత కుర్చీలతో వస్తారు. ఇక రోడ్డు పక్కనే ఉండే మురికి కాలువల వల్ల ముసిరే దోమలనుండీ తప్పించుకోవడానికి ఓడోమాస్ రాసుకొని కొందరు బయలుదేరితే, అరుగులపై కూర్చొని సినిమా చూసేవారు మస్కిటో కాయిల్స్ వెలిగించుకొంటారు. ఇక రాత్రి మంచు పడే అవకాశముంటే మప్లర్లు, మంకీ కాప్‌లూ, చెవిలో దూదీ..వగైరా.. వగైరా..
ఇక సినిమాను ప్రదర్శించే ప్రొజెక్టర్ తెరకు దాదాపు పదిహేను అడుగుల దూరంలో ఉంటుంది. దానిపక్కనే ప్రొజెక్టర్ నడిపే మనిషి కూర్చునేందుకు ఒక కుర్చీ, ఆ ప్రొజెక్టర్‌కు కావలసిన కరెంటుకు దగ్గిరలో ఉన్న ఇంటినుంచీ లాగిన కరెంటు వైరూ, ఒక జంక్షను బాక్సూ ఉంటాయి. అప్పటిదాకా రణగొణ ధ్వనులతో నిండిన వాతావరణం, సినిమా ప్రారంభమవుతోందంటే నిశ్శబ్దంగా మారిపోతుంది. ప్రొజెక్టర్‌లోంచి వచ్చే కాంతి తెరమీద పడి.. చిత్రంగా..చిత్రంగా మారుతోంటే మా చిన్నతనంలో ఎంతో ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఇక ఆ తెరపై పేర్లు పడుతుండగా చూడడం ఒక మరపు రాని అనుభూతి. తెర ముందువైపు పడే పేర్లు సరిగా ఉంటే.. వెనుక వైపునుంచీ చూస్తే తిరగేసిపడి ఏదో వేరే భాషను చూస్తున్నట్లుగా వింతగా ఉండేది.
ఇక సినిమా ప్రారంభమైన దాదాపు ప్రతీ అరగంటకూ రీళ్ళు మార్చడానికి ప్రొజెక్టర్‌ను నిలుపు చేయడం వల్ల పది నిముషాలు విరామం ఉంటుంది. ఈ సమయంలో మరలా ఆ సినిమాకు చందా ఇచ్చినవారి పేర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో పనిలో పనిగా వ్యాపారాన్ని చేసుకొనే వేరుశనగ బండి, పిడతకింది పప్పుల వ్యాపారులగురించి చెప్పనే అక్కర్లేదు. ఈ విధంగా విరామాలతో కలిపి సినిమా పూర్తయ్యేసరికీ దాదాపు రాత్రి ఒంటిగంట దాటుతుంది. అప్పటిదాకా ఆగిపోయిన వీధి లైట్లూ, సీరియల్ బల్బులూ మరల యధావిధిగా వెలగడం మొదలుపెడతాయి.
ఇప్పుడు ప్రతీ ఇంట్లో టెలివిజన్ సెట్లూ, కేబుల్ కనెక్షన్లూ రావడంచేత వీధి సినిమాలు తగ్గిపోతున్నా, మా చిన్నతనంలో వీటికి విపరీతమైన ప్రజాదరణ ఉండేది.
Mee Rachana saili enthoo saralam gaa pakkane vundi maatladutunnatlu vrastaaru…
Mari meeru cheppina ee veedhi cinima prahasanam, kaasto koosto veedhi naatakala, hari kadhala, burra kadhala prahasanam ki samaanam gaa vuntundi..
Meeru ela chakkani vishayalu cheppandi vinataaniki chevulu rikkinchi memu eduruchoostuntaam..
ఇప్పుడు అలా వీది సినిమా ప్రదర్శనకు వెళ్ళీ కూర్చుని చూసే జానాలే లేరు. ఒకప్పటి దాని గురించి బాగా రాసారు. ఈ మద్య వీది సినిమా గురించి పల్లెల్లో ఎలా ఉంటుందనేది స్వదేశ్ సినిమాలో చూసాను. సహజంగా తీసే ప్రయత్నం చేసారు.
ఆ అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. అచ్చం మీరు చెప్పినట్టే.
మా పెద్దతాతయ్య (అమ్మమ్మ నాన్న) గారి మేడ మీద నుంచి చక్కగా తెర కనిపించేది. ఇక అక్కడే మకాం తినుబండారాలన్నిటితోనూ. దోమలతో వేట గురించయితే చెప్పనవసరంలేదు.
ఇప్పుడు తలచుకుంటే భలే వింతగా ఉంది.
మీ పొస్టులు చాలా బాగున్నాయి, నేను మీరు రాసినవి నా ఫేస్ బుక్ లొ పోస్టు చేస్తున్నాను !