అవి నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు..!! అప్పటివరకూ ఏడు పెంకులాట, వీపుచట్నీలు లాంటి సాంప్రదాయక ఆటలతో కాలక్షేపం చేస్తున్న మా కుర్రకారు జీవితాలలలో జంటిల్మన్ క్రీడ ప్రవేశించిన రోజులు. నాలాంటి చాలామంది జీవితాలనే మార్చివేసిన క్రికెట్ క్రీడను మాకు పరిచయం చేసిన వ్యక్తి “మధుబాబ”..!!
మధుబాబ మా తాతగారి తమ్ముడి కొడుకు. అవడానికి బాబాయ్ అయినా, నాకన్నా చదువులో మూడేళ్ళు మాత్రమే సీనియర్. అప్పట్లో వాళ్ళ అమ్మగారు పోవడంతో మొత్తం కుటుంబం పెనుగొండ వచ్చి స్థిరపడ్డారు. మా మధుబాబ రాకతో అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న మా పెనుగొండ మొత్తం పూనకంతో ఒక్కసారి ఊగిపోయింది. తన అల్లరి, పోకిరి వేషాలతో మొత్తం పెనుగొండలో ఉండే పిల్లకాయల దగ్గిరనుంచీ, టీనేజ్ కుర్రాళ్ళ వరకూ అందరినీ ఎంతో కొంత ప్రభావితం చేసాడు మధుబాబ. అప్పట్లో C.P (ChakraPAni, మా మధుబాబ అసలు పేరు) పేరు చెప్తే పెనుగొండలో చాలామంది తల్లిదండ్రులు ఉలిక్కిపడేవారు. అటువంటి మధుబాబ పరిచయం చేసిన క్రీడే క్రికెట్..!!
మా మధుబాబ చుట్టుపక్కల కుర్రాళ్ళందరినీ పోగుచేసి క్రికెట్ ఆడేవాడు. క్రమంగా ఈ పిచ్చి దావానలంలా వ్యాపించి, లాగు వేసుకోవడం రానివాడు కూడా క్రికెట్ బ్యాట్ పుచ్చుకొని వాడి లెవల్‌కి తగ్గ స్నేహితులతో క్రికెట్ ఆడేయడం సాధారణం అయిపోయింది. ఆ బంతి చుట్టుపక్కల ఇళ్ళలో పడి, వాళ్ళు పెట్టే శాపనార్థాలతో, తిట్లతో, పెనుగొండ వీథులు ప్రతిధ్వనించేవి. ఆ కొత్తగా తయారైన పిచ్చివాళ్ళలో నేనూ ఒకడిని..!! నా ఈ కొత్త సరదాను చూసి, ముచ్చటపడి, మా నాన్నగారు ఒక క్రికెట్ కిట్ కూడా కొని ఇచ్చారు. మంచి బ్యాట్, కొన్ని లెదర్ బాల్స్, వికెట్స్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ గ్లవ్స్ లతో సహా అన్నీ ఉండేవి. మా మధుబాబ కన్ను వెంటనే ఆ కిట్ మీద పడింది. అప్పటినుంచీ పెద్దపిల్లలు ఆడే క్రికెట్ జట్టులో నేనుకూడా సభ్యుడిని అయిపోయాను..!! చివర్లో ఏదో రెండు బంతులు ఆడడానికి ఇచ్చి, నాతో తూతూ మంత్రంగా రెండు బంతులు బౌలింగ్ చేయించి, మొత్తం కిట్‌ను అప్పనంగా వాడేసుకొనేవారు మధుబాబ మరియు అతని స్నేహితులు.. ఈ రాజకీయం అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అప్పటినుంచీ క్రికెట్కు బయలుదేరినప్పుడల్లా, మొత్తం ప్యాడ్లు, బ్యాటింగ్ గ్లవ్స్, చివరికి గార్డ్‌తో సహా అన్నీ నా వంటిమీద తగిలించుకొని అప్పుడే ఆటకు బయలుదేరేవాడిని. జట్టు కూర్పు ఎలా ఉన్నా ఓపెనర్‌ను మాత్రం ఎప్పుడూ నేనే..!! అదికూడా వెంటనే రెండు బంతులకే అవుటయిపోతే మొత్తం కిట్ తీసుకొని ఇంటికి చెక్కేసేవాడిని. లేదా మా అమ్మతో రికమెండేషన్ తీసుకొచ్చి ఇంకో ఓవరో, రెండు ఓవర్లో ఎక్కువ ఆడేవాడిని. ఇదంతా చూసి కుతకుతలాడిపోతున్నా, ఎలాగో ఓర్చుకొని, క్రికెట్ కిట్‌ను వదులుకోలేక నన్ను చచ్చినట్టు ఆడించుకొనేవారు.
ఇక ఈ క్రికెట్ పిచ్చి ఎంతగా ముదిరిందంటే, అప్పటి క్రికెటర్ల బౌలింగ్, బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ ఉండేవాడిని. దూరంనించీ కోతి కొబ్బరికాయ పట్టుకొచ్చినట్లు వచ్చే వెస్టిండీస్ బౌలర్ ప్యాట్రిక్ ప్యాటర్సన్, వేగంగా పరుగు మొదలు పెట్టి, చివరికి నీరసించి బౌలింగ్ చేసే అమర్‌నాథ్, రెండు చేతులనూ గిరగిరా తిప్పి స్పిన్ బౌలింగ్ చేసే అబ్దుల్ ఖాదిర్, కాళ్ళు వెడల్పుగా పెట్టి నిల్చుని బ్యాట్ చేసే శ్రీకాంత్, కాళ్ళు దగ్గిరగా పెట్టి మునివేళ్ళపై బ్యాట్ను ఆనించి నుంచుని బ్యాట్ చేసే గవాస్కర్.. ఇలా అందరినీ అనుకరించేసే వాడిని. మొదట్లో సరదాగా చూసినా, ఇక నా క్రికెట్ పిచ్చి ముదిరి పాకాన పడినట్లు గుర్తించి, ఇలా అయితే నా ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలు కొండెక్కుతాయని గ్రహించి, తిట్లు, దెబ్బలు లాంటివేమీ పనిచేయక.. చివరాఖరిగా.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది మా అమ్మ ..!! ఏడవతరగతి పరీక్షలు అయ్యేంతవరకూ క్రికెట్ ఆడితే తనమీద ఒట్టేనంది.. ఒక్కసారి బ్యాట్ పట్టుకొన్నా తనని చంపుకొని తిన్నట్టే అంది.. ఆపై ఇక జీవితంలో నాతో మాట్లాడనంది.. గుడ్లనీరు కుక్కుకొంది.. కొంగు నోట్లో దోపుకొంది.. ఎక్కడో సినిమాల్లో తప్ప ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ సన్నివేశాలు నిజజీవితంలో ఎరుగని నేను, బుట్టలో పడిపోయాను. ఏదో హిప్నాటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మాట ఇచ్చేసాను..!! అంతటితో ఊరుకోక, నా పరివర్తనను నిరూపించుకోవాలనే వేడిలో మొత్తం క్రికెట్ కిట్ తీసుకెళ్ళి మండుతున్న బాయిలర్‌లో పడేసాను..!! కొంచం వేడి చల్లారాకా గానీ నేను చేసిందేమిటో అర్థంకాలేదు..కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఏడవతరగతి పరీక్షలయ్యేంత వరకూ ఒట్టుపేరు చెప్పి బెదిరిస్తూ నన్ను గుప్పెట్లో ఉంచుకోగలిగింది మా అమ్మ. మొత్తానికి ఆమె ఆశించినట్టు స్కూల్ ఫస్ట్ కాకున్నా, మూడవ స్థానం సంపాదించుకోగలిగాను..
అప్పటికి మా మధుబాబ ఇంకా పెనుగొండలో ఉంటే పాడైపోతాడని గ్రహించిన మా తాతగారి మరో తమ్ముడు, మధుబాబను ఆయనతో బెంగుళూర్‌కు తీసుకుపోయారు. దాంతో పెనుగొండ అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకొంది. కానీ అప్పటికే అతడు నాటిన బీజాలు మాలో లోతుగా నాటుకుపోయాయి. దానికి తోడు నేను అమ్మకి ఇచ్చిన ఒట్టు గడువు ముగియడంతో మరల క్రికెట్ మొదలుపెట్టాను. “కాదేది క్రికెట్‌కి అనర్హం..!!” అన్న రీతిలో రకరకాలుగా క్రికెట్ ఆడేవాళ్ళం. పరీక్షలు రాసే అట్టతో, షటిల్ కాక్ తో క్రికెట్.. తూటు కర్రలను బ్యాట్, బంతిగా చేసుకొని క్రికెట్.. కాగితాలను ఉండలుగా చుట్టి, పైన పురుకోస కట్టి, దానిని బంతిగా ఉపయోగించి క్రికెట్.. షటిల్ బ్యాట్, కాక్‌తో క్రికెట్.. పుస్తకాల పేజీ నంబర్లతో తరగతి గదులలో క్రికెట్.. ఇలా రకరకాలుగా ఆడేవాళ్ళం. పిల్లి పిల్లలను ఇళ్ళు మార్చినట్టు, ఒకేచోట ఎక్కువరోజులు ఆడి జనాల నోళ్ళళ్ళో నానడమెందుకని, కొన్నాళ్ళు మా మేడ మీద.. కొన్నాళ్ళు కృష్ణ వాళ్ళింటి పెరడులో.. కొన్నాళ్ళు రామాలయం వెనుకాలా.. మరికొన్నాళ్ళు మార్కెట్‌యార్డులో.. ఇలా రకరకాల చోట్లలో ఆడేవాళ్ళం. ఎనిమిది, తొమ్మిదో తరగతులలో పబ్లిక్ పరీక్షలు లేకపోవడంవల్ల మా అమ్మకూడా చూసీ చూడనట్టు వదిలేసేది.
కానీ పదవ తరగతికి వచ్చేసరికీ మరల నన్ను అదుపులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించింది మా అమ్మ. కానీ ఈసారి సెంటిమెంట్‌కు లొంగనని ముందే అర్థం చేసుకొని, తెలివిగా.. మా స్కూల్‌లో కెల్లా అత్యంత చండశాశనుడిగా పెరుపొందిన జయంతి వెంకట శాస్త్రులు గారు అనే లెక్కలు మాష్టారు దగ్గిర ప్రయివేట్‌కు కుదిర్చింది. ఆ ప్రయివేటు సరిగ్గా సాయంత్రం స్కూలు వదలగానే 5 గంటలకు మొదలయ్యేది. దానితో నా క్రికెట్ ఆటకు అడ్డు పడిపోయింది. ఎప్పుడో సెలవలు, ఆదివారాలలో తప్ప క్రికెట్ ఆడడానికి సమయం చిక్కేది కాదు. ఆ విధంగా మొత్తానికి నన్ను దారిలో పెట్టి పదవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చేలా చేయగలిగింది మా అమ్మ..!!
తరువాత క్రికెట్ ఆడడం తగ్గిపోయింది. EAMCET ర్యాంకు సంపాదించి, చదువు విలువ తెలుసుకొన్నాకా ఇంజనీరింగ్‌లో ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ క్రికెట్ మ్యాచ్‌లు వస్తే మాత్రం మొత్తం హాస్టల్ అంతా మెస్‌లోని టీవీకే అతుక్కుపోయేవాళ్ళం. ఆఖరుకు IISc బెంగుళూరులో M.S చేసినప్పుడుకూడా, ఎంతటి కఠినమైన చదువు కొనసాగించినా, కనీసం క్రికెట్ స్కోరు చూడడానికైనా ఖాళీ చేసుకొనేవాడిని.
భూకంపం తరువాత అప్పుడప్పుడూ ప్రకంపనలు వచ్చినట్టు, ఇప్పటికీ నాలో క్రికెట్ పిచ్చి రగులుకొంటూనే ఉంటుంది. నా ఈ క్రికెట్ మ్యాచ్ పిచ్చి చూసి, 2003 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఇండియా చేరుకొందన్న విషయం తెలిసి, పాపం నాతో కూర్చుని ఓపికగా మ్యాచ్‌ను వీక్షించింది నా భార్య. అందులో ఏమిజరిగిందో ఎవరికీ గుర్తు చేయనవసరం లేదనుకొంటాను.. మరలా తిన్నగా ఉండక.. 2007 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రసారాన్ని Dish Network ద్వారా 200 డాలర్లకి కొన్నాను. మొదటి రౌండ్ లోనే ఇండియా చేతులెత్తేసాకా, ఇక క్రికెట్ చూడను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన నేను.., మరల కుక్కతోక వంకర కనుక.. 20-20 వరల్డ్ కప్‌నుంచీ షరా మామూలే..!!
అమెరికా వచ్చిన కొత్తలో ఇక్కడి స్నేహితులందరినీ టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడదామని బలవంతం చేసేవాడిని. దానితో అందరూ నన్ను తప్పించుకు తిరిగేవారు. ఇలా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా యాదృచ్ఛికంగా ఇక్కడ కొంతమంది నాలాంటి పిచ్చివాళ్ళు తగిలారు. వాళ్ళు ప్రతీ శనివారం ఉదయం 7 గంటలనుంచీ 10 గంటలవరకూ ఒక పార్క్‌లో క్రికెట్ ఆడతారు. వాళ్ళు పరిచయం అయినప్పటినుంచీ శనివారం క్రికెట్ నా జీవితంలో భాగం అయిపోయింది. మామూలుగా ఉదయం 8:30 కి గానీ ముసుగు తీయని నేను, శనివారం మాత్రం 6:30 కల్లా తయారు అయిపోతాను. వారంలో ఎప్పుడూ ఒళ్ళు వంచని నేను, శనివారం మాత్రం చెమటోడ్చి ఆడతాను. ఇక బుధవారం నుంచీ ఇంటర్నెట్‌లో వారాంతానికి వాతావరణం ఎలావుంటుందోనన్న బెంగతో శాటిలైట్ నివేదికలు చూస్తూ ఉంటాను. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది..!!
సేం మీరు చెప్పినలాంటి సన్నివేశాలే నా చిన్నతనం లో కూడా చాలా జరిగాయి.కానీ ఆడేది తమ్ముడు,అన్నయ్యలు.మంచి నీళ్ళు అందించడం, బాలు దూరం గా వెళ్ళిపోతే తెచ్చివ్వడం నాలాంటి అక్కల,చెల్లెళ్ళ పని.మీ పుణ్యమా అని ఒక సారి అన్నీ గుర్తుచేసుకున్నాను.నెనర్లు.
నా క్రికెట్ పిచ్చి ఇ౦కా తగ్గలేద౦డి…..బె౦గుళురు లొ ప్రతి శనివార౦ ఉదయ౦ ఐదు గ౦టలకు లేచి …అ౦దరికి ఫొన్ చేసి ..గ్రౌన్ద్ కి బాట్ , రె౦డు మూడు బ౦తులు … స్ట౦మ్స్ …తిసుకొని పొతె …..
నాకు బౌలింగ్ ఇవ్వరు …బ్యాటి౦గ్ ….కూడా ఇవ్వరు……ఇచ్చినా రె౦డు లేదా ముడు బ౦తులు కే ఔట్ …..
ఐనా నా పిచ్చి తగ్గడ౦ లేదు ….
బౌలింగ్ , బ్యాటి౦గ్ రె౦డు … రాకపోయినా …. ఇ౦కా కల క౦టునే..వు౦టా ….కు౦బ్లె….తరు వాత …నేనె …ఇ౦డియా టీమ్ …కు లెగ్ స్పిన్ బౌలర్ …ఐనట్టు….
మన లాంటి వాళ్ళను ఎవరూ బాగు చెయ్యలేరు. 🙂
మనం మనం ఒకటే. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు క్రికెట్టాడదాము లెండి.
ఇదంతా చూస్తుంటే నాకూ నా క్రికెట్ అనుభవాలు రాయాలీ అనిపిస్తుంది
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మన దేశం లో క్రికెట్ ఆట కాదు ఓ మతం
బా రాశారు
ఇది చదివిన వారికి ఖచ్చితముగా తమ తమ క్రికెట్ జ్ణాపకాలు గుర్తుకువస్తాయి
@ రాజారావు
పాత తెలుగు సినిమాలా .. నవరస భరితంగా ఉంది మీ కథనం.
వసంతం వచ్చాక మిషిగన్ రండి .. ఇక్కడ లీగ్ కూడా ఉంది.
@ రాజేంద్ర – ఉపక్రమించండి .. ఎందుకు ఆలస్యం?
Annayya…
memu 10th class lo vunnappudu meeru daaba pina cricket aadukuntooo mammalni disturb chestoo maaku kooda cricket pichi ni tagilinchaaru… Avi gurtu vastuntey bhaley vuntundi ley….
[…] తన చిన్ననాటి క్రికెట్టు అనుభవాలతో ఓ జాబు […]
[…] Tadimeti Rajarao has come out with a beauty on his childhood cricketing days. Nostalgia is writ large on the post. Several posts have appeared […]
ore ramu,naa gurinchi koncheme cheppavu.migatadi evadu rastadu?
madhu baba
తాడిమేటి రాజారావు అంటే రాము ఏనా? నేను శ్రీధర్, మా చిన్నపుడు కాసిభట్ల రామంగారి ఇంట్లో అద్దెకుండే వాళ్ళం..శ్రీధర్, శ్రీకాంత్… గుర్తొచ్చానా?
[…] తన చిన్ననాటి క్రికెట్టు అనుభవాలతో ఓ జాబు […]