ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

నేను ఈ మధ్య నెల రోజులకై ఇండియా వెళ్ళినప్పుడు, అంతటి హడావిడిలోనూ, తీరిక చేసుకొని మూడు పుస్తకాలు చదువగలిగాను.

ఎప్పటినించో నేను చాణక్యుడి గురించి వినడమే గానీ, అతని చరిత్ర గురించి తెలియదు. అర్థశాస్త్రం రచించాడనీ, చంద్రగుప్తుడిని రాజును చేయడంలో తెరవెనుక పాత్ర పోషించాడనీ, నందరాజ్య నిర్మూలనకై శపథం చేసాడనీ.. ఇలా పైపైన వివరాలు తప్ప, పూర్తి కథ తెలియదు. అందుకే రాజమండ్రి పుస్తక ప్రదర్శన లో “ఆర్య చాణక్య” అనే పుస్తకం కనపడగానే కొనివేసాను. “తాడంకి వేంకట లక్ష్మీ నరసింహరావు” గారు మొత్తం కథను ఉత్కంఠభరితంగా, నాటకీయ ఫక్కీలో, కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వర్ణించారు. న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతటి కుటిలమార్గమైనా అవలంబించడంలో తప్పులేదనీ, న్యాయాన్ని అందివ్వనప్పుడు అది ఎంత ధర్మమార్గమైనా అనుసరించరాదనీ ఉదాహరణలతో సహా వివరించారు. అందులో ఒక ఉదాహరణ ఇలా ఉంది. చాణక్యుని శిష్యుడైన ఒక బాలుడు అడవిలో చెట్టు కింద విశ్రాంతి తీసుకొంటూండగా, ఒక ఆవు, బెదరుతూ, ఎవరో తరుముకొస్తున్నట్టుగా అటు వైపుగా వస్తుంది. ఆ బాలుడు నెమ్మదిగా ఆ ఆవును పక్కకు తోలుకుపోయి, ఎవరూ చూడని ప్రదేశంలో దాచివేసి, మరల చెట్టు కింద కూర్చొంటాడు. ఇంతలోనే ఆ ఆవుకై వెతుకుతున్న కసాయివాడు అటుగా వచ్చి, ఆవు గురించి ప్రశ్నిస్తాడు. ఆ బాలుడు ఎక్కడా తొణకకుండా, నిబ్బరంగా, అసలు ఏ ఆవూ ఇటుగా రాలేదని అబద్ధం చెప్తాడు. కసాయివాడు వేరే దిక్కుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ బాలుడిని, “సత్యమునే పలుకవలెను” అనే ధర్మాన్ని ఎందుకు పాటించలేదని నిలదీస్తాడు. దానికి ఆ బాలుడు, “నేను సత్యమే పలికి ఉంటే, ఆ ఆవు ఈసరికి కసాయివాని చేతిలో హతమై ఉండేది. న్యాయాన్ని అందివ్వడానికి, ధర్మాన్ని పాటించకపోయినా తప్పులేదని మా గురువులు చాణక్యులు చెప్పారు. ఆ ఆవుకు న్యాయం చేకూర్చడానికే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది” అని సమాధానమిస్తాడు. ఇటువంటి ఉదాహరణలు ఈ కథలో ఎన్నో ఉన్నాయి. సామ్రాజ్య విస్తరణకై రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు పారించి, ఎందరో సైనికుల ప్రాణాలు బలిగొనే కన్నా, భేదోపాయం ఉపయోగించి, శత్రువుల మధ్య విభేదాలు సృష్టించి, వారి వేలితో వారి కన్నునే పొడుచుకొనేలా చేయడమే చాణక్యనీతి. చంద్రగుప్తుడిని మౌర్యసామ్రాజ్యాధీశుడిని చేసే క్రమంలో వేసిన ఎత్తులు, పై ఎత్తులు, అలెగ్జాండర్ అంటటివాడినే ఎదురొడ్డి నిలచిన ధైర్యసాహసాలు, ఇలా చాణక్యుడిలోని ఎన్నో పార్శ్వాలను రసవత్తరంగా కళ్ళముందుంచింది ఈ పుస్తకం. కొసమెరపు ఏమిటంటే, చాణక్యుడికే “వాత్స్యాయనుడు” అనే మరో పేరు ఉందనీ, “వాత్స్యాయన కామ సూత్రాలు” ఆయన రచించినవే అనీ తెలిసి ఆశ్చర్యం వేసింది.

నేను చదివిన మరో పుస్తకం “శ్రీ ఇచ్ఛాపురం రామచంద్రం” గారు రచించిన “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి”. “అపూర్వ చింతామణి” అనే రాకుమారి, తన గురువు ఇచ్చిన సలహాపై, తన స్వయంవరానికై ఒక వ్రతాన్ని ఆచరిస్తుంది. స్వయంవరానికై వచ్చిన రాకుమారులలో, తను అడిగే అయిదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగన రాకుమారుడినే ఆమె వరిస్తుంది. కానీ, ఒకవేళ సరిఅయిన సమాధానాలు చెప్పలేకపోతే, తన కత్తితో ఆ రాకుమారుడి శిరస్సు ఖండించి కోటగుమ్మానికి వ్రేలాడదీయిస్తుంది. ఈ విధంగా, ఆమెను స్వయంవరంలో ఓడించడానికై వచ్చి వెయ్యిమంది రాకుమారులు ఆమె కరవాలానికి బలి అయిపోతారు. ఇంతకీ అంత క్లిష్టమైన ఆ అయిదు ప్రశ్నలు ఏమిటి..? వాటివెనుక మర్మం ఏమిటి..? ఎవరైనా ఆ ప్రశ్నలకు సమధానం చెప్పగలిగారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే, ఎంతో ఉత్కంఠతో సాగిపోయే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే.

ఇక నేను చదివిన మరో మంచి పుస్తకం, “స్వామి వివేకానందుడు” చే రచింపబడిన “రాజ యోగ” అనే ఆంగ్ల పుస్తకం. రాజయోగంలోని ముఖ్యభాగాలైన యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధిలను గురించి క్లుప్తంగా, అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరింపబడింది. వెన్నుముక దిగువభాగంలో, మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉండే కుండలినీ శక్తి గురించి, ఆ శక్తిని మెదడులో వేయి రేకులతో వికసించే పద్మాన్ని పోలివుండే సహస్రార చక్రానికి తీసుకుపోయే ఇడ, పింగళ నాడుల గురించి, ఆ క్రమంలో జరిగే పరిణామాల గురించీ చక్కగా వివరించారు. మనిషి బయట చూసే ప్రపంచానికన్నా విశాలమైన ప్రపంచం మనిషి లోపల కూడా ఉందనీ, రాజయోగ సాధన ద్వారా ఆ ప్రపంచాన్ని చూడవచ్చనీ, దానికి సాధన ఎంతో ముఖ్యమనీ వివరింపబడింది. సైన్స్‌కీ, అధ్యాత్మికతకూ ముఖ్య భేదాన్ని కూడా వివేకానందుడు చక్కగా వివరించాడు. నిరూపింపబడేంతవరకూ దేనినీ నమ్మదు సైన్స్. కానీ, ముందు నమ్మకం ఉంచితే, నిజం నీకే అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది ఆధ్యాత్మికత. ఈ పుస్తకంలో చెప్పినవి మన అనుభవంలోకి రావాలంటే ఎన్నో సంవత్సరాల సాధన అవసరం. అది ఈ బిజీ జీవితంలో ఎంతవరకూ సాధ్యమో తెలియదుగానీ, ప్రతీ వ్యక్తీ కనీసం ఒకసారి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. తీరిక దొరికినప్పుడు తప్పక చదవండి.

9 comments on “ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

  1. vbsowmya అంటున్నారు:

    వాత్సాయనుడు, చాణక్యుడు ఒకరేనా!!!!!
    చాలా వింతగా ఉంది ఈ విషయం వినడానికి!!

  2. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    సౌమ్యగారూ,
    నేనూ మొదట ఆశ్చర్యపోయాను. చాణక్యుడికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నాయి. తండ్రిగారైన చణకుని పేరు ద్వారా “చాణక్యుడు” అనీ, తండ్రి గోత్రం “కుటిల” మహాముని గోత్రం అవడంచే “కౌటిల్యుడు” అనీ, తల్లి విష్ణు భక్తురాలు కావడంచే “విష్ణుగుప్తుడు” అనీ, తల్లి గోత్రం “శ్రీవత్స” కావడం వల్ల “వాత్సాయనుడు” అనీ ఆ పేర్లు వచ్చాయి. ఒక సందర్భంలో చాణక్యుడు, ధర్మార్థకామమోక్షాలలో “అర్థం” పైన “అర్థశాస్త్రం” నూ, కామంపైన “కామ సూత్రాలు” నూ రచించడం తన జీవితాశయంగా చెప్తాడు. చంద్రగుప్తుని పట్టాభిషిక్తుడిని కావించి, అతని ద్వారా తన అర్థశాస్త్రానికి ప్రాచుర్యతను కలిపించిన తరువాత, తల్లి గోత్రానికి సంబంధించిన “వాత్సాయన” నామంచే కామసూత్ర రచనను చేసినట్టుగా నేను చదివిన పుస్తకంలో చెప్పబడింది. ఆ కామసూత్రాలకు సంబంధించిన కొంత సమాచారంకూడా నేను చదివిన పుస్తకంలో ఇవ్వబడింది. అది నేను ఇప్పటికే చదివిన “వాత్స్యాయన కామ సూత్రాలు”తో సరిపోయింది.

  3. లక్ష్మణ్ అంటున్నారు:

    వాత్సాయనుడు, చాణక్యుడు ఒకరేనా? థాంకులు రాజా గారూ.

  4. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

    ఓ ఇదేదో కొత్త విషయం…
    చాణక్యుడూ, వాత్స్యానడూ ఒక్కరేనా ? ఆశ్చర్యంగా ఉంది.

  5. సుగాత్రి అంటున్నారు:

    “చణక” అనే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి చాణక్యుడని, “కుటిల” గోత్రానికి చెందినవాడు కాబట్టి కౌటిల్యుడని, అసలు పేరు విష్ణుగుప్తుడని తెలిసిన విషయాలే. ఐతే ‘కామసుత్ర’ గ్రంథకర్త వాత్సాయనుడు గుప్తుల కాలానికి (క్రీ.శ. 4-6 శతాబ్దాలు)చెందినవాడు కదా? ఆయన, మౌర్యుల కాలానికి చెందిన కౌటిల్యుడు (క్రీ.పూ. 350-283) ఒకరే ఎలా అవుతారు?

  6. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    సౌమ్య గారూ, లక్ష్మణ్ గారూ, ప్రవీణ్ గారూ మరియు సుగాత్రి గారూ,
    చాణక్యుడు, వాత్సాయనుడూ ఒక్కరేనా అన్న విషయం నాకు రూడీగా తెలియదు. నేను పుస్తకంలో చదివిన విషయం బ్లాగులో రాసానంతే. కానీ సుగాత్రి గారు చెప్పిన కాలమానాల ప్రకారం చూస్తే ఈ ఇద్దరూ ఒకటయ్యే అవకాశం లేదు. నేను ఈ విషయమై కొంత గూగుల్ లో శోధించాను. ఎక్కడా ఈ ఇద్దరూ ఒక్కరే అన్న ఆధారాలు లభించలేదు. కానీ ఎక్కడో ఒక చర్చాహారంలో ఎవరో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను చదివిన పుస్తక రచయిత కూడా ఆ సమాచారాన్ని ఎక్కడో సేకరించో, ఏ పురాతన గ్రంథ ఆధారంగానో ప్రస్తావించి ఉండాలి. ఏది ఏమైనా, ఆ ఇద్దరూ ఒకరైతే మాత్రం, ఒకదానికి ఒకటి పొంతన లేని అర్థ, కామ శాస్త్రాలపై, ఇంతటి ప్రామాణిక గ్రంథాలను రచించిన అతని జ్ఞానానికి తప్పక జోహార్లు అర్పించాలి.

  7. బ్లాగాగ్ని అంటున్నారు:

    రాజారావుగారూ, సహస్ర శిరశ్చేద చింతామణి పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి? వివరాలు బ్లాగ్ముఖంగా చెప్పినా సరే లేదా నాకు ఒక వేగు పంపినా సరే. ముందస్తు ధన్యవాదాలు.

  8. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    బ్లాగాగ్ని గారూ,
    ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షమించగలరు. నేను ఈ పుస్తకాన్ని రాజమండ్రి లో జరిగిన ఒక పుస్తక ప్రదర్శన లో కొన్నాను. పుస్తకం పైన “రోహిణి పబ్లికేషన్స్, పాత కూరగాయల మార్కెట్, మెయిన్ రోడ్, రాజమండ్రి -1” అని ఉంది. ఫోను నంబర్ – 2473444. నాకు తెలిసి ఈ పుస్తకం http://www.avkf.org ద్వారా కూడా లభించగలదు. ప్రయత్నించి చూడండి.

  9. BSV Narasimha Rao అంటున్నారు:

    blaagni garu,

    nenu meeru vrasina amsaalu chadivaanu, naaku సహస్ర శిరశ్చేద చింతామణి పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి konukkontanu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s