సిలికానాంధ్ర సంస్థ ప్రతీ సంవత్సరం ఆంధ్ర సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా నిన్న, అనగా అక్టోబర్ 6వ తారీఖున సాంస్కృతికోత్సవాన్ని జరుపుకుంది. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వివరాలలోకి వెళ్తే..
సిలికానంధ్ర సాంస్కృతికోత్సవాలకు ముఖ్య ఆకర్షణ కూచిపూడి నృత్యరూపకం. 2005లో “ఉషా పరిణయం”, 2006లో “ధృవ చరితం” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. ఎప్పుడూ కూచిపూడి నృత్యానికి పెద్దపీట వేసే సిలికానాంధ్ర ఈసారి ఎందుకో చిన్నచూపు చూసింది. “స్వరాభినయ సారస్వం” అనే కార్యక్రమం ఉన్నా, మొత్తం రంగస్థలం గాయనీగాయకులతో నిండిపోవడంతో, కూచిపూడి నర్తకీమణులకు నర్తించడానికి సరిపడినంత చోటు లేకపోయింది. గతంలో 45 నిమిషాలనుండీ గంట వరకూ కథాపరంగా, వివిధ సన్నివేశాలు, దానికి తగిన పరదాలు, హంగులు, సెట్టింగులతో సాగిన నృత్యరూపకాలతో పోలిస్తే, వివిధ త్యాగరాజ కృతులతో పది పది నిమిషాలుగా సాగిన కూచిపూడి నృత్యం ఎందుకో నన్ను అంత ఆకట్టుకోలేకపోయింది. “జగదానందకారకా..” అనే కృతి మాత్రం ఎంతో వీనులవిందుగా ఉంది.
ఈ సంవత్సర కార్యక్రమాల్లో మరో ముఖ్య కార్యక్రమం “జగమంత జనని”. తల్లి ప్రేమను మరోసారి అందరికీ గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఓలేటి పార్వతీశంగారు సాహిత్యం అందించిన ఈ సంగీత నృత్యరూపకంలో ఏడు విధాలైన తల్లిప్రేమను చూపించారు. జన్మనిచ్చిన తల్లి, పెంచిన తల్లి, గోమాత, బ్రాహ్మణి, గురుపత్ని, రాజమాత, భూమాత లలో మాతృత్వాన్ని హరివిల్లులోని ఏడు రంగులతో పోలుస్తూ కార్యక్రమం సాగింది. దృశ్యాపరంగా చూస్తే ఈ కార్యక్రమం ఎంతో బాగుంది. రంగస్థల ముందు భాగంలో చిన్నపిల్లలు నృత్యం చేస్తుంటే, వెనుక అమ్మ పాత్రలోని మహిళ, పాపను ఎత్తుకొని లాలించడం, ఆమెపై ఫ్లాష్‌లైట్ పడి, ఆ నీడ వెనుక పరదాపై పడడం, ఎంతో ఆకట్టుకొంది. అదేవిధంగా పిల్లలు నృత్యంచేస్తుంటే, వారి అమ్మలు వచ్చి వారిని ముద్దాడి గుండెలకు హత్తుకోవడం, ఇద్దరు పిల్లలు గోమాత రూపంలో వచ్చి నాలుగు కాళ్ళతో నర్తించడం, చివరిలో భారతీయ జెండాను ప్రదర్శించడం చాలా బావుంది. నిజానికి ఈ కార్యక్రమం జనాలను ఎంతగానో ఆకట్టుకొని ఉండాలి. కానీ సౌండ్ సిస్టం సమస్యో లేదా రికార్డింగ్ లోపమో తెలియదుకానీ, ఈ కార్యక్రమానికి ఆయువుపట్టయిన సాహిత్యం సరిగా వినబడనే లేదు. దానితో రావలసినంత ఫీల్ రాలేదు. వ్యక్తిగతంగా చూస్తే, గత సంవత్సరం జరిగిన “సరిగంచు చీర” కార్యక్రమం ఆకట్టుకొన్నంతగా ఈ కార్యక్రమం ఆకట్టుకోలేకపోయింది.
ఇక హాస్య నాటిక విషయానికి వస్తే, చాయా చిత్రాన్నీ, రంగ స్థలాన్నీ కలిపి “ఛాయారంగం” కార్యక్రమంతో విన్నూత్న ప్రయోగం చేసినందుకు సిలికానాంధ్రను అభినందించాలి. వెనుక వీడియో క్లిప్పింగ్‌లో వస్తున్న పాత్రలను వాస్తవంగా భావిస్తూ, దానికి ప్రతిస్పందించడం పాత్రధారులకు కత్తిమీద సామే. దీనికి, వెనుక వీడియో క్లిప్పింగ్ నడుపుతున్నవారికీ, ముందు నటిస్తున్న వారికీ మధ్య ఎంతో సమన్వయం ఉండాలీ. లేకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. ఈ సాహస ప్రయోగంలో చాలావరకూ సిలికానాంధ్రవారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. కానీ, ఇంత కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించినవారు కథాపరంగా తగిన శ్రద్ధ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. కథలో హాస్యంపాలు చాలా తక్కువగాను, చాలా సన్నివేశాలు అసహజంగాను ఉన్నాయి. క్రితం సంవత్సరం “బాబోయ్ సెల్‌ఫోన్” హాస్యనాటికతో పోలిస్తే “చాయారంగం” తేలిపోయిందనే చెప్పాలి.
ఇక మరో కార్యక్రమం జానపద నృత్యరూపకం “ధినాక్ ధిం ధిం”. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొన్న ఈ కార్యక్రమంలో హరిదాసు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, బావా మరదళ్ళ సరసాలతో కూడిన పాటలు, దంపుళ్ళ పాటలు ఇలా దాదాపు కనుమరుగైపోతున్న జానపద పాటలను గుర్తుచేసే ప్రయత్నం చేసారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తయారు చేసిన సెట్టింగులు, ఏనుగు బొమ్మ, ఎంతో ఆకట్టుకొన్నాయి. నర్తించినవారు కూడా ఆద్యంతం ఎంతో చలాకీగా, హుషారుగా నాట్యం చేసారు. కానీ ఈ కార్యక్రమంలోనూ సౌండ్ సిస్టం సమస్య వల్ల సాహిత్యం సరిగా వినబడకపోవడం లోటే.
చివరిగా చెప్పుకోవలసినది “చాణక్య శపథం” నాటకం. చాణక్యుడిగా “దిలీప్ కొండిపర్తి” గారి అభినయం చాలా బాగుంది. ఆరంభంలో కొంత తడబడ్డా, చివరిలో ఏకబిగిన 4-5 నిమిషాలపాటు, ఆవేశంతో సాగే సంభాషణలను ఎంతో రక్తి కట్టించారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ రౌద్రాన్ని సూచిస్తూ ఎరుపు రంగులోకి మారటం ఎంతో ఆకట్టుకొంది. కానీ, ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతంగా కథని సంక్షిప్తంగా వివరించివుంటే ఇంకా బాగుండేదని అనిపించింది.
ఇక ప్రేక్షకులను అసహనానికి గురిచేసినవి కొన్ని ఉన్నాయి. ప్రతీ కార్యక్రమానికీ మధ్య దాతలను సన్మానించడం, లేక మేయర్లను సన్మానించడం, సిలికానాంధ్ర గొప్పతనాన్ని వివరించడం వంటివి విసుగు తెప్పించాయి. ముందు కార్యక్రమంలో పొందిన తృప్తి, ఆనందం వంటివి మధ్యలో వస్తూ ఉన్న ఈ విరామాలవల్ల ఆవిరయిపోయాయి. వీటిని కుదించి, ఒకేసారి కానిచ్చి ఉంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పేది. వీటిలో కూడా సమన్వయ లోపాలు కనిపించాయి. చెప్పిన విషయాన్నే మరల మరల ఇద్దరు ముగ్గురు చెప్పడం, పిలిచిన దాతలనే మరల పిలవడం, వారి పేర్లను తప్పుగా పరిచయం చేయడం, సన్మానించవలసిన వారి పేర్ల చిట్టా ముందుగా సిద్ధం చేసుకోక పోవడం, ఒక్కోసారి ఒక్క సిలికానాంధ్ర సభ్యుడు కూడా లేకుండా స్టేజిమీద అతిథులను వదిలివేయడం, ప్రేక్షకులను పదే పదేదే అడిగి చప్పట్లు కొట్టించుకోవడం, స్టేజీ కిందనుంచి స్టేజీ పైన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి సమాచారం పంపిస్తూ సమచారలోపాన్ని బహిర్గతం చేసుకోవడం, కార్యక్రమం చివరిలో కూడా వీడ్కోలు పలకాలా లేక గుర్తించవలసినవారెవరైనా మిగిలిపోయారా అన్న సందేహంలో ఉండిపోవడం ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యనిర్వహణాలోపాలు ఈసారి కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా పకడ్బందీ ప్రణాళిక కావాలి. అది ఈసారి ఎందుకో సరిగా జరగలేదు. గత సంవత్సరాలలో తాను నెలకొల్పుకొన్న ప్రమాణాలను తానే అందుకోలేకపోయింది ఈసారి సిలికానాంధ్ర. ఇక ఈ సారి కార్యక్రమాల్లొ, గతసారి జరిగినట్లుగా ఏ తెలుగు ప్రముఖులనీ సన్మానించుకోలేకపోవడం కూడా ఒక లోటే.