కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

ఎవరినైనా “నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఏవి..?” అని ప్రశ్నిస్తే, చాలామంది చెప్పే సమాధానం “కాలేజీ రోజులు” అనే. అదే ఆ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఆ అనుభూతులే ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే రెండున్నర గంటల సినిమాగా మలచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

కథ విషయానికి వస్తే, నాలుగు జంటల ఇంజనీరింగ్ కాలేజీ  అనుభవాలే “హ్యాపీ డేస్”. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు రోజూ ఎదురయ్యే అన్ని అనుభవాలనీ రంగరించి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. కాలేజీ తొలినాళ్ళలో ఎదురయ్యే ర్యాగింగ్ అనుభవాలు, పొగరుగా ప్రవర్తించే జూనియర్ల కొమ్ములు వంచే సీనియర్లు, కొత్త పరిచయాలు, ఫ్రెషర్స్ పార్టీ, సంవత్సరమంతా ఎంజాయ్ చేసి చివర్లో నైట్అవుట్‌లతో, కాపీలతో గట్టెక్కే విద్యార్థులు, ఆ వయస్సులో క్లాస్‌మేట్, సీనియర్, లెక్చరర్ అన్న బేధం లేకుండా ఆపోజిట్ సెక్స్ పై కలిగే ఆకర్షణ, ప్రేమ, స్నేహితుల మధ్య చిన్న చిన్న పంతాలు, పట్టింపులు, కష్టసుఖాలను పంచుకోవడం, చివరిగా ఫేర్‌వెల్ పార్టీ సమయానికి కళ్ళు చెమర్చడం.. ఇలాంటి అన్ని అనుభవాలకు దృశ్యరూపమే “హ్యాపీ డేస్”.

ఈ సినిమాలోని నటీనటులందరూ కొత్తవారే. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకుగా నటించిన “రాజేష్” పాత్రధారి నటనలో ఈజ్ బావుంది. సీనియర్ అమ్మాయి “స్రవంతి” కూడా భావాలను బాగా ప్రదర్శించింది. కమలినీ ముఖర్జీ ఒక యంగ్ లెక్చరర్‌గా తళుక్కుమంది. విద్యార్థులకు యంగ్ లేడీ లెక్చరర్లపై ఉండే ఆకర్షణను మోతాదు మించకుండా చిత్రీకరించడం, ఆ లెక్చరర్ పాత్రకు కమలినీను ఎన్నుకోవడం శెఖర్ కమ్ముల పరిణతిని చూపించింది. సినిమాలో కమెడియన్లు ఎవ్వరూ లేకపోయినా, శేఖర్ కమ్ముల రాసిన సంభాషణలు, ప్రేక్షకుల పెదవులమీద చిన్న చిరునవ్వును మొదటినుంచీ చివరివరకూ చెరగకుండా చేసాయి.

ఇక సంగీతం విషయానికి వస్తే, రాధాకృష్ణన్‌ను కాక, మిక్కీ జీ మేయర్‌ను ఎంచుకొని దర్శకుడు మంచిపని చేసాడనిపించింది. పాటలన్నీ శ్రావ్యంగా ఉండడమే కాక, చిత్రీకరణపరంగా కూడా బాగున్నాయి.

ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన గురించి చెప్పాలి. చిరంజీవి కొడుకు నటించిన “చిరుత” కూడా ఇదే సమయంలో విడుదల అవటంచేత ఈ సినిమా థియేటర్ ఖాళీగా ఉంటుందని ఊహించిన నా అంచనా తప్పయ్యింది. బారులు తీరిన క్యూచివర్లో నుంచుని, ముందునుంచి రెండో వరుసలో కూర్చొని, సినిమా చూడవలసి వచ్చింది 🙂 సినిమా సాగుతున్నంత సేఫూ జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేసారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న ఆదరణ ఈ చిత్రంతో మరోసారి రుజువయ్యింది.

వ్యక్తిగతంగా చూస్తే, నాకు “ఆనంద్”, “గోదావరి” చిత్రాలకన్నా ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బావున్నట్టు అనింపించింది. సినిమాలో కథ ఏమీ లేకుండా రెండున్నర గంటలు నడపడమంటే కత్తిమీద సామే. ఈ సినిమాలో కూడా కొన్ని అవసరం లేని సన్నివేశాలు, సాగదీయబడిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే ఈ సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా చూడచ్చు.

తెలుగులో ఈ మధ్యకాలంలో కాలేజీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు రాలేదు.  “హృదయం”, “ప్రేమదేశం” లాంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలయినా ఎంత సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులందరూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అయినా తమని తాము అయిడెంటిఫై చేసుకొంటే, ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

4 comments on “కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

 1. Poetic Thoughts అంటున్నారు:

  అరెరె అరెరె మనసే జారె…
  అరెరె అరెరె వరసే మారె….
  ఇదివరకెపుడూ లేదె…
  ఇది నా మనసె కాదె….
  ఏవరేమన్నా వినదె….
  తన దారేదొ తనదె…
  ..

  ఛెప్పొద్దు? ఇరోజంతా ఈ పాటలె వింటున్నా.. ఏంతమంచి భావానికి కి మరెంతో మంచి సంగీతం మెలవించిన సెల్యులాయిడ్ మీద చిత్రించిన చిత్రం.. ఏప్పుడో మనం మరిచిపోయిన మధురూహల మనొహర రూపం ఈ సిన్మా ..
  Nice review..

 2. స్మైల్ అంటున్నారు:

  ఒకేసారి రెండు చిత్రాలా? అని ప్రస్తుతానికి వాయిదా వేసాను. ప్రతిభావంతుడైన దర్శకుడి నుంచి మంచి చిత్రమే ఆశించవచ్చు.అయినా కమ్ముల గారి గడుసుతనం చూశారా, తన సినిమాలకు పెట్టనికోట అయిన అమెరికాలో మొదట విడుదల చేసి, తద్వారా వచ్చే మంచి ప్రతిస్పందనని ఆంధ్రదేశ విడుదలకు పెట్టుబడిగా మార్చుకొన్నాడు. ప్రతిభతో పాటు లౌక్యమూ తెలిసిఉండాలి మరి:)

 3. Sowmya అంటున్నారు:

  Oh! రిలీజ్ ఐపోయిందా అప్పుడే! నాకు తెలీలేదు… నేనింకా వచ్చే వారం ఏమో అనుకుంటున్నా! ఎదురుచూస్తున్నా ఈ సినిమా కోసం. నా యూజీ రోజులు గుర్తుచేసుకోవచ్చని. ఇప్పుడూ కాలేజీలోనే చదువుత్ఉన్నా కానీ, ఇంజినీరింగ్ అప్పటి రొజులే వేరు.

 4. రాజు సైకం అంటున్నారు:

  మాకిక్కడ ఇంకా రిలీజ్ అవలేదండి….నిజమే..ఎంత ఆదరణ, నమ్మకం లేకపోతే… చిరుతతోపాటే, అక్కడ రిలీజ్ చేస్తారు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే..సిన్మా బాగుందన్నమాట. ఇంకేముంది…ఇంజనీరింగ్ కాలెజి వాళ్ళు తెగ చూస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s