చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట

మా చిన్నతనంలో ఇష్టపడి ఆడిన మరొక ఆట: ఏడు ఫెంకులాట. నా ఏడో తరగతి సమయంలో క్రికెట్ పిచ్చి తగులుకోక ముందు వరకూ ఈ ఆట ఆడడానికి ఎంతో ఉత్సాహపడే వాళ్ళం. ఈ ఆటని మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం వెనుక ఉన్న ఖాళీస్థలం లో ఆడేవాళ్ళం. ఈ ఆట గురించి పరిచయం లేని వారి గురించి కొంచెం వివరిస్తాను.

ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. టాస్ అంటే బొమ్మ-బొరుసు అనుకొనేరు. అంత సీనేం లేదు. అప్పట్లో ఈడ్చి తంతే మా జేబులోంచి ఒక్క పైసా కూడా రాలేది కాదు. అందుకే, ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి టాస్ వేసేవాళ్ళం. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు. ఈ టాస్ ను వేయడానికి మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మరెప్పుడైనా వివరిస్తాను.

ఇక ఆట విషయానికొస్తే, టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

బంతితో ఒకరిని కొట్టినప్పుడు అవతలి వ్యక్తి దానిని మోచేతులతో లేదా మోకాళ్ళతో అడ్డుకోవచ్చు. ఈ భాగాలలో బంతి తగిలినా లెక్కలోకి రాదు. పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది. ఈ ఆట ఆడి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, తలచుకొంటే ఇప్పటికీ ఆ చప్పట్లు చెవిలో రింగుమంటుంటాయి..!!

     

16 comments on “చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట

 1. రాకేశ్వర రావు అంటున్నారు:

  వాహ్ ,
  అద్భుతుంగా వ్రాసారు.
  ఇందులో అంతర్జాతీయ పోటీలు ఎందుకు జరగవో…
  మా చిన్నప్పుడు మోకాళ్లకు, మోచేతులకు తగిలితే మాఫీ ఉండేదికాదు..
  ఆ సౌకర్యం కింగ్ అని వేరే ఆటలో వుండేది…

  సమయం చూసుకొని కింగ్ గురించి, జోరుబాల్ గురించి కూడా వ్రాయగలరు. ఆ రెండు ఏడు పెంకుల కంటే, సాంకేతికంగా కొద్దిగా వెనకబడివుంటాయనుకోండి. ఐనా వాటి మజా వాటిది.

  ఇక ఏడు పెంకులాటలో, అందరూ ఆత్రుతగా ఎదురు చూసే, ఆలౌట్ క్యాచ్ గురించి వ్రాయడం మరచిపోయారు …

 2. రాకేశ్వర రావు అంటున్నారు:

  ఈ వ్యాసాన్ని చిన్న చిన్న మార్పులతో వికీలో చేర్చితే చాలా బాగుంటుంది.
  http://te.wikipedia.org/wiki/ఏడు_పెంకులాట

 3. Viswanath అంటున్నారు:

  చాలాబాగా రాసారు.
  ఖచ్చితంగా అంతే.
  అలానే మేమూ ఆడేవాళ్ళం.

  మెల్లగా ఈ ఆటకూడా కనుమరుగైపోవచ్చు-
  వుద్యుదాదారిత వినోధం ద్వారా.

 4. వెంకట రమణ అంటున్నారు:

  ఈ ఆట మన వైపే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ప్రాచుర్యం చెందినదే. ఆ మద్య(ఒక సంవత్సరం కిందట) మా కంపనీ పిక్నిక్‌లో ఈ ఆట ఆడాము. ఇప్పుడప్పుడే ఈ ఆట మరుగున పడే అవకాశంలేదులే..

 5. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  అవును చిన్నప్పుడు చాలా సార్లు ఆడాము ఈ ఆట మేము కూడా. స్కూళ్ళో కూడా ఆడేవాళ్ళము.
  ఇది వికీలో ఉందా లేకపోతే ఎక్కించండి.

 6. అశోక్ గార్ల అంటున్నారు:

  మేమైతే ఏడో క్లాస్ లో ఉన్నప్పుడు, ప్రతిరోజూ లంచ్ బ్రేక్ లో, పీ టీ పీరియడ్ లో బలే ఆడే వాళ్ళం. ఇద్దరు ముగ్గురు వుండేవాళ్ళు, ఎంత దూరం నుంచి ఐనా సరే సూటి గా వెసే వారు.వీపులు మోగిపోయేటివి.బలే ఎంజాయ్ చేసాం.

  ఆల్ హ్యపీస్..

 7. అశోక్ గార్ల అంటున్నారు:

  స్కూల్లోనే కాదు, శివ రాత్రి అప్పుడు కూడా ఆడే వాళ్ళం.

  ఆల్ హ్యపీస్..

 8. radhika అంటున్నారు:

  అమ్మో ఈ ఆట గుర్తుచేసుకుంటే వీపు విమానం మోత ఎక్కిపోయి,కళ్ళల్లోంచి నీళ్ళు కారిన క్షణాలే ఎక్కువ గుర్తొస్తాయి నాకు.

 9. వికటకవి అంటున్నారు:

  బాగా గుర్తు చేశారు. మేము హైదరాబాదులో ఈ ఆటను లింగోచ్ అని ఆడేవాళ్ళము. కానీ, మీరన్నట్లు గాక, మోకాళ్ళ కింద మాత్రమే కొట్టాలి. వేసవి సెలవల్లో రోజుల తరబడి ఆడేవాళ్ళం.

 10. రాజారావు తాడిమేటి అంటున్నారు:

  ముందుగా ఈ టపా చూసిన వెంటనే ఉత్సాహంగా వ్యాఖ్యలు రాసినందుకు నా కృతజ్ఞతలు.

  @రాకేశ్వరరావు గారూ,
  మీరన్నట్టుగా నేను మన చిన్నతనంలో ఆడిన వివిధ ఆటలను గూర్చి రాయాలనే ఉద్దేశ్యంతోనే “చిన్ననాటి ఆటలు” అనే ధారావాహికను మొదలుపెట్టాను. దీనికన్నా ముందుగా “సబ్జా-విండూర్” అనే ఆటను గురించి కూడా రాసాను. తీరిక సమయంలో చదవండి. దాదాపు ప్రతీ వారానికీ ఒకటి లేదా రెండు ఆటలను గుర్తు చేద్దామనే నా ప్రయత్నం.

  @రాకేశ్వరరావు గారూ, ప్రవీణ్ గారూ,
  మీ సూచన ప్రకారం ఈ విషయాలను తెవికీ లో పొందుపరచడానికి ప్రయత్నిస్తాను.

  @విశ్వనాథ్ గారూ,
  మీరన్నది నిజం. తొందరలోనే ఈ ఆటలు కనుమరుగయిపోయే ప్రమాదం ఉంది.

  @వెంకట రమణ గారూ,
  అమెరికాలో మా మిత్రులందరం కలిపి ఒకసారి ఒక పార్కులో నాలుగు స్థంభాలాట కూడా ఆడాము 🙂

  @అశోక్ గారూ, వికటకవి గారూ,
  చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మరపు రాని మధుర క్షణాలే.

  @రాధిక గారూ,
  నా ప్రతీ టపాకూ మీ వ్యాఖ్యలతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మీకు నా కృతజ్ఞతలు.

 11. phani అంటున్నారు:

  చిన్న నాటి ఆటను గుర్తు చేసినందుకు చాలా థాంక్స్. మేము గూడ 7వ తరగతి దాక ఈ ఆట ఊకె ఆడేటోళ్ళం. అంతే గాదు పెంకుతో టాస్ — నాకైతే మస్తు మజా ఒచ్చింది నీ బ్లాగు చదివి .
  చిన్న నాటి రోజులే రోజులు.

  ఫణి

 12. Subrahmanyam Manuguri అంటున్నారు:

  రాజా గారు,
  మీ ఎడు పెంకులాట టపా చాలా బాగున్నది. చిన్ననాటి రొజులు గుర్తుకు వచ్హాయి. ఈ ఆట తొ పాటు మేము ముద్ర బాలు కూడ బాగ ఆడేవాళ్ళము. ఆ రోజులు మళ్ళి రావు. రోజు బడి నుంచి ఇంటికి రాగనే మొదట చేసే పని, అమ్మ చేసిన చిరుతిండ్లు తినటం తరువాత స్నేహితులుతొ కలిసి ఆడే ఆటలు గుర్తుకు వఛ్హాయి. చాలా ధన్యవాదలు.
  సుబ్రహ్మణ్యం

 13. రాకేశ్వరరావు గారన్నట్లు మాకు కూడా మోకాళ్లకు, మోచేతులకు తగిలితే మాఫీ ఉండేదికాదు..

  రాకేశ్వరరావు గారంటే నాకు గుర్తుకొచ్చింది, “ఆలౌట్ క్యాచ్” గురించి తాడిమేటి రాజారావు గారూ వ్రాయలేదు. దానిగురించి కొద్దిగా.

  1. బంతి పెంకులకు తగలకుండా గనుక పడితే, ఆ బంతి విసిరిన వాడు అవుటు.
  2. అదే ఆ బంతి పెంకులకు తగిలి అవి చెల్లాచెదురైనప్పుడు(నాకు గుర్తున్నంతవరకు కనీసం ఒక పెంకన్నా కింద పడాలి) కనుక ఈ బంతిని పట్టుకుంటే, ఆ బంతి విసిరిన సభ్యుడు భాగంగా గల జట్టు మొత్తానికి అవుటు(ఆలౌట్ క్యాచ్).

 14. Srinivas అంటున్నారు:

  రాజా గారు,

  చాలా బాగుంది మీ ఈ టపా. చిన్నప్పటి ఆటలని మళ్ళీ గుర్తు చేశారు. మాకు కూడా మోచేతికి, మోకాలికి తగలితే మాఫీ ఉండేది కాదు. మేం జట్టు సభ్యులు ఒక్కొక్కరు 3 సార్లు బంతిని పెంకులకేసి కొట్టేవాళ్ళం. వీపు బాగా మోగేదండి బాబు!ఈ మధ్య ఫ్రెండ్స్ తో పార్క్ లో ఆడాము. మంచి సరదా గేం ఇది.

  శ్రీనివాస్

 15. రమేష్ అంటున్నారు:

  నమస్కారం,
  చేనేతకు సంబందించిన పదజాలం ఇవ్వగలరు

 16. Chiranjeevi GupthA అంటున్నారు:

  7penkulatA. Ipude andrajyoti adivarAM book lo LAGORI peruto vartanu chusi na chinnappati santoshamyna rojulu gurtocchay.ventane mobile lo vedikite na kante munduga spandanalu chusanuNA GATA SMRUTULANU enjoy chestunnanu.Naku 5years vayasu lonche ee ata adutunnanu.apudu memmunna veedi lo JAMACHETTU GALA INTIMUNDU PLACE lo adevallam.aa inti VEERAMMA AVVA KI KODUKULU MANUMALU SELAVULAKU MATRAME VUNTARU.TARWATA AVVA OKKATE.ATALO LAKSHALENTANTE__ata lnepamto jamakayalu kosukovatam. Mana batch ki itam leni vadi meedaku aa nepam tosesi AVVA to bandabutu tittinchatM. Tarwate gelupu otami.ala 8years gadchindi.seaniars juniors ammayilu andaram afevallam.criket

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s