నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత భావాలను చక్కగా పలికించాడు. ముఖ్యంగా అతని వయసుకు తగ్గ పాత్రలో రాణించాడు. గత కొన్ని చిత్రాలలో కొంత వయసు మీద పడ్డట్టు కనిపించినా, ఈ చిత్రంలో మాత్రం అందంగా కనిపించాడు. “స్వదేశ్” చిత్రం తరువాత ఇది అతనికి మరో మంచి చిత్రం అవుతుంది.
ఇక కథాంశానికి వస్తే, ప్రస్తుత భారతదేశ క్రీడాచిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిందీ చిత్రం. భారతదేశంలో క్రికెటేతర క్రీడలకు కరువవుతున్న ప్రోత్సాహం, ఆదరణ, ముఖ్యంగా జాతీయ క్రీడ “హాకీ” కి పట్టిన దుస్థితి, మహిళా క్రీడాకారులపై చులకనాభావం, సెలెక్షన్ ప్రక్రియలోని లోపాలు, బోర్డు సభ్యుల రాజకీయాలు, క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా కాక, రాష్ట్రాల వారీగా ఎంపిక చేయటం, మహిళలకు కుటుంబ సభ్యులనుండి, సమాజం నుండి తగిన ప్రోత్సాహం లేక పోవడం, క్రీడాకారులలో అనైక్యత, సమిష్టి తత్వం, పోరాట తత్వం కొరవడడం, క్రికెట్ పై ఉన్న మోజు జనానికి ఇతర క్రీడలపై లేక పోవడం, క్రీడాకారులకు లభిస్తున్న అరకొర సదుపాయాలు, క్రీడాకారులు వ్యక్తిగత రికార్డులకై పాకులాడుతూ జట్టును నిర్లక్ష్యం చేయడం, క్రీడాకారులలో గ్రూపు తగాదాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, జాతీయ జట్టుకు ఎంపికైపోయాములే అన్న నిర్లక్ష్యం, అహంభావం, కోచింగ్ ప్రమాణాలు, క్రీడాకారులకు కావలసిన మంచి లక్షణాలైన సమన్వయం, అవగాహన, క్రీడలకు రాజకీయాలను, మతాన్నీ ముడి పెట్టడం , క్రీడలను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించడం, గెలిస్తే క్రీడాకారులను అందలం ఎక్కించటం, ఓడితే పాతాళానికి తోసివేయటం, ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్నో.. ఇన్ని అంశాలను స్పృశించినా, ఎక్కడా అసభ్యత, అశ్లీలత వంటి వాటికి తావీయకుండా, సాగదీయకుండా సంక్షిప్త మైన మాటలతో, మనసుకు హత్తుకొనే దృశ్యాలతో, మధురమైన, ఉత్తేజపూరితమైన నేపథ్య సంగీతంతో సినిమా సాగిపోయింది. ఇటువంటి చిత్రాన్ని తీసిన యూనిట్ సభ్యులందరూ అభినందనీయులు. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం “చక్ దే ఇండియా”.
గమనిక : ఇందులో భారత క్రికెట్ వైస్ కెప్టెన్ “అభిమన్యు సింగ్” పాత్ర, భారతీయ క్రికెటర్ “యువరాజ్ సింగ్” ను పోలివుండడం యాదృచ్చికం కాదనుకుంటాను.
వరెవ్వా! నేనూ సినిమా చూసి ఇలాంటివే రాద్దామనుకున్నాను. మీరింకా బాగా రాశారు. సరేగానీ, క్రికెటరు యువీకీ సినిమాలోని అభీకి ఏమిటి కనెక్షను?
రానారె గారూ,
యువరాజ్ సింగ్ కూడా మన భారత జట్టు 20-20 వైస్ కెప్టెన్. అతని వ్యక్తిగత జీవితం పైన ఎప్పుడూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూంటాయి.ఎందుకో అభిమన్యు సింగ్ పాత్రను పోషించిన వ్యక్తి యువరాజ్ సింగ్ పోలికల్లోనే ఉన్నాడని నాకనిపించింది. పేర్లు కూడా ఎందుకో ఒకేలా అనిపించాయి.