ఈ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు నేను గమనించిన ముఖ్యమైన తేడా, మెటాడోర్లు రోడ్లపై కనిపించకపోవడం, వాటి స్థానంలో ఆటోలు వచ్చిచేరడం.
మెటాడోరు అంటే తెలియని వారికి దాన్ని గురించి కొంచెం వివరిస్తాను. మెటాడోరు అంటే ఒక నాలుగు చక్రాల వాహనం. చూడటానికి మారుతీ వ్యానులా ఉన్నా, ముందు సీట్లో డ్రైవరు కాక ఇద్దరు, మధ్య సీట్లో నలుగురు, వెనుక అటూ ఇటూ ఇద్దరు చొప్పున మొత్తం దాదాపుగా 9 నుండీ 10 మంది సుఖంగా ప్రయణం చేయగల వాహనం. ఇప్పుడంటే క్వాలిస్‌లు, సుమోలు వచ్చాయిగానీ, మా చిన్నతనంలో మెటాడోర్లు, అంబాసిడర్లు తప్ప వేరేవి ఎరుగం.
మా ఊరు పక్కనే కాలువ ఉండటం వల్ల, జాతీయ రహదారికి దూరంగా ఉండటం వల్ల, అవడానికి మండల రాజధాని అయినా, మా ఊరికి రైలు సదుపాయం లేదు. ఊర్లో చిన్నా, చితకా వస్తువులు దొరికినా, ఏ ముఖ్యమైన వస్తువు కావాలన్నా, చుట్టుపక్కల టౌన్లకి బయలుదేరాల్సిందే.. ఇంతేకాక, మా ఊరివారికి ముఖ్యమైన వినోదం సినిమా. పేరుకు రెండు సినిమా హాళ్ళు మినర్వా, ప్యాలస్ అని ఉన్నా రిలీజైన సంవత్సరానికిగాని సినిమాలు వాటిలోకి రావు. అంతవరకూ మా ఊరి జనం ఆగలేరు కనుక, ఇటు పాలకొల్లో, అటు తణుకో తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకని రోజూ మా ఊరినుంచి పొరుగూరు వెళ్ళి వచ్చే వారు ఎక్కువే.
ఎప్పుడో అరగంటకో, గంటకో ఆటు నరసాపురం, భీమవరం డిపోలనుంచో లేక ఇటు రావులపాలెం, గూడెం డిపోలనుంచో వచ్చే దైవాధీనం బస్సులను నమ్ముకోలేక సతమతమయ్యే ప్రయాణీకుల బలహీనతలను సొమ్ముచేసుకొంటూ మొదలయ్యాయి మెటాడోర్లు, సిటీ బస్సులు. తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యం చేర్చడానికి మెటాడోర్లు ఉపయోగపడితే, మారుమూల బస్సు సదుపాయంలేని గ్రామాలను కలుపుతూ పోతాయి సిటీ బస్సులు..
వీరిద్దరూ అవగాహనకు వచ్చి, పెరవలి నుంచి జాతియ రహదారి మీదుగా తణుకు వెళ్ళే రూటును మెటాడోర్లు, విప్పర్రు, ఇరగవరం మీదుగా తణుకు చేరే రూటును సిటీ బస్సులు వాడుతూ ఉంటారు. మా ఊరికి R.T.C బస్సులు సమయానికి రావడం నేనెరుగను కానీ, ఈ ప్రైవేటు వాహనాల సమయపాలనకు మాత్రం ముచ్చట వేయక మానదు. ఏ సమయాల్లో వాహనాలను తిప్పాలో, ఏ చోట్ల జనం తాకిడి ఎక్కువ ఉంటుందో, ఏ ఊరిలో ఎంత సమయం వేచి చూడాలో వీరికి క్షుణ్ణంగా తెలుసు. సరిగ్గా R.T.C బస్సు రావడానికి 5 నిమిషాలముందే వచ్చి ప్రభుత్వ బస్టాండులోనే ప్రయాణీకులను ఊడ్చుకుపోవడం వీరి స్పెషాలిటీ. తణుకు సినిమా వేళలకు అరగంట ముందుగా మాఊరు మీదుగా వెళ్తూ దారిలోని అన్ని ఊర్ల ప్రయణీకులనూ ఎక్కించుకొని సరిగ్గా సినిమా మొదలయ్యే వేళకు తణుకు చేరటం, అదేవిధంగా సినిమా విడిచే సమయానికి తణుకులో బయలుదేరి హాలు ముందే ప్రయాణికులను ఎక్కించుకొని అరగంటలో వారి గమ్యస్థానాలకు చేర్చటం.. ఇలా రోజూ ఎంతో క్రమపద్ధతిలో సాగిపోతూ వుంటుంది. అసలు నష్టాల నివారణకు IIM లతో అధ్యయనం జరిపించే బదులు ఒకరోజు ప్రయివేటు వాహనాల తీరును గమనిస్తే R.T.C ఎప్పుడో లాభాల బాట పట్టెది.
ఇకపోతే ప్రతీ మెటాడోరుకూ ఒక డ్రైవర్‌తో పాటూ ఒక కండక్టర్‌కూడా ఉంటాడు. కోతి చెట్టుకు తోకతో వేళ్ళాడినట్టు వీడు కూడా ఒక్క కాలు తప్ప మిగిలిన శరీరమంతా గాలిలో బయటకు పెట్టి, తలుపుకు వేళ్ళాడుతూ, ఆ మెటాడోరు ఏ ఊరువైపుగా వెళుతోందో గట్టిగా గొంతు చించుకు అరుస్తూ ప్రయాణీకులను ఆకర్షించటం, వచ్చిన ఆడవారిని ముందునుంచీ, మగవారిని వెనుకనించీ లోపల ఎంతో చోటువుందన్నట్టు భ్రమపెడుతూ వీలైనంతమందిని కుక్కటం, వారినించీ ముక్కుపిండి బస్సు చార్జీలకంటే ఒక అర్ధరూపాయ ఎక్కువే వసూలు చేయటం, మెటాడోరు ఆగటానికి, కదలటానికి సిగ్నల్‌గా ఈల వేయటం లాంటివి వీడు నిర్వర్తించే విధులు. పురాణాల్లో చదివిన పుష్పక విమానంలోనైనా చోటుకు లోటుంటుందేమో గాని, ఈ మేటాడోరులో మాత్రం ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది.
ఇక లోపల నిలబదటానికి మూడడుగుల మించి ఎత్తు ఉండదు కనుక, ఎంతటి వాడైనా తిరగేసిన “L” ఆకారంలో నడుం వంచాల్సిందే, దారిలో గతుకులకి, వేళ్ళే వెగానికీ, నెత్తిమీద మొట్టికాయలు తినాల్సిందే. ఇక వేసవి కాలంలో మేటాడోరు ప్రయాణం చేసి దిగిన వేంటనే మండుటెండ అయినా A.Cలా అనిపిస్తుంది. చెమటతో తడిసిన చొక్కా మీదుగా చల్లటిగాలి వెళ్తుంటే అప్పటిదాకా చేసిన ప్రయాణం బడలిక అంతా ఇట్టే మాయమవుతుంది..!!
ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందిని వారు చేరవలసిన చోటికి చేరుస్తూ మా వూరికి సేవ చేసిన ఈ మెటాడోర్లు ఎందుకు కనుమరుగయ్యాయని ఆరా తీస్తే తెలిసిన విషయమేమంటే.. ఈ మధ్య స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారులని అభివృద్ధి చేసినపుడు, తణుకు ఊరి పొలిమేరలో ఒక టోల్ గేటు పెట్టడం జరిగింది. ఈ గేటు ద్వారా తణుకు లోకి ప్రవేశించాలంటే ప్రతీ నాలుగు చక్రాల వాహనంఎనభై రూపాయల దాకా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాని త్రిచక్ర వాహనాలకు ఈ రుసుము లేదు. ఈ టొల్ గేట్ దెబ్బకు మా ఊరిలో మేటాడోర్లు మాయమై మూడు చక్రాల ఆటోలు ప్రత్యక్షమైపొయాయి. వాహనమేమైనా, మా ఊరి ప్రజల ఇక్కట్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి.
ఓటి డబ్బాలో గులకరాళ్ళేసుకిని పరుగ్గెట్టినట్టుగా…
మెటాడోర్ గురించి భలే చెప్పారు.
మార్టేరు సెంటర్ నుండి బస్సులు దొరకక ఇవి తప్ప మరో మార్గం లేకపోయేది దేవుడా అంటూ ఎలాగోలా ఆ కొంత సేపూ భరించే వాళ్ళం.
మర్చిపోయే వాటీని భలే గుర్తు చేస్తున్నారు.కృతజ్ఞతలు …
పల్లెట్టూర్ల ఇక్కట్లు బాగా చెప్పారు.మోటాడోర్లలో వేలాడుతూ వెళ్ళ్లే కండక్టర్ల ను చూస్తే ఫేక్షన్ సినిమాల్లో కత్తులు తిప్పుతూ వెళ్ళే విలన్ గాడి చెంచాలు గుర్తొస్తూవుంటారు నాకు.
దృశ్యానుభవం (కొవ్వలి సత్యసాయి గారిది ఈ మాట) కలిగించింది మీ జాబు.
మెటాడార్లు కాదుగానీ మాకు జీపులుండేవి మొన్నటిదాకా. ఈ మధ్య ఆటోలొచ్చి వాటిని పక్కకు నెట్టాయి.
జీపులకు ముందు – దాదాపు ముప్పై ఏళ్ళ కిందట – మూడు చక్రాల టెంపోలుండేవి. మూడు చక్రాలుండటం వరకే ఆటోతో పోలిక; దానికంటే బాగా పొడుగ్గా ఉండేవి. రెండేపులా తలుపులూ ఉండేవి. అంత పొడుగుండీ, మూడు చక్రాలతో అటో, ఇటో పడకుండా ఎలా ఉండేవో అర్థమయ్యేది కాదు, నాకు. తలుచుకుంటే ఇప్పటికీ అర్థం కాదు. మీరన్న ఆ కండక్టరు గాడు (ఇందులో క్లీనరన్న మాట..) ఎప్పుడూ టెంపోకి వెనకాల వేలాడుతూ అరుస్తూనే ఉండేవాడు.. చందోలూ, చెరుకుపల్లీ అంటూ. అన్నట్టు ఆ రోజుల్లోనే పెద్ద కార్లు కూడా ఉండేవండి.. వాటి పేరు గుర్తు రావడం లేదు. వింటేజి కార్లు చూస్తూ ఉంటాం కదా అలా ఉండేవి.
మొత్తమ్మీద పాత సంగతులు గుర్తు చేసారండి.
Chaala baaga wrasaru, Vintage Cars annaru gaani, ford model cars guntur & tenali madhyalo thirigeevi.
నీ బ్లొగ్ చదువుతుంటే నాకు మా ఊరి మెటడొర్లు గుర్తుకు వచ్హయి. ణా చిన్నతనంలొ నెను కూడ ఎక్కెవాడిని. మండపేట నుంచి రవులపలెం మెటడొర్లు ఉండెవి.