గోదావరి జిల్లాలంటే పచ్చని పైర్లు, ఎత్తైన కొబ్బరి చెట్లు, “ఆయ్”, “అండీ” అంటూ ఆప్యాయంగా పలుకరించే జనాలతో పాటుగా గుర్తుకు వచ్చేది.. “గోళీ సోడా”. ఇప్పటికీ నేను మా ఊరు వెళితే అన్నిటికన్నా ముందు చేసే పనులు, మా అమ్మ చేతి వంట తినడం, మా ఊరు గోంగూర తూము సెంటర్లో ఉన్న కిళ్ళీ కొట్టుకెళ్ళి గోళీ సోడా తాగడం.
ఈ గోళీ సోడా ఎప్పుడు పుట్టిందో తెలియదు గానీ, గోదావరి ప్రజల జీవితాలతో విడదీయరాని విధంగా పెనవేసుకు పోయింది. ఆకుపచ్చ లేదా నీలం రంగు లో అందంగా ఆరంగుళాలు పైన పొడవుండే ఈ సోడా, కింద వెడల్పు గా ఉండి, పైకి పోయెకొద్దీ సన్నంగా, చేతిలో వీలుగా ఇమిడిపోయేట్లు ఉంటుంది. దీని గొంతులో వాయుపీడనం తో ఇరుక్కొని ఉండే గోళీ, మూతికి అటూ, ఇటూ సోడాని ఎటువైపు ఎత్తిపెట్టి తాగాలో సూచించే రెండు గాట్లు.. ఇలా ఎవరో శ్రద్ధగా డిజైన్ చేసినట్లుంటుంది.
ఈ గోళీ సోడా తాగడంలో మజా ఒకటైతే, సోడా కొట్టటంలో వచ్చే మజా ఇంకొకటి. చంకలో పసిపిల్లాడిని అప్యాయంగా ఎత్తుకొన్నట్లుగా పట్టుకొని, చూపుడు వేలుతో గోళీ ని నెట్టి సోడా కొట్టేదొకడైతే, బల్ల మీద గుడ్డ వేసి, దానిపై సోడా పెట్టి, మాస్టారు స్టుడెంటు ని బెత్తంతో కొట్టినట్టుగా, చెక్కతో చేసి లోపల గోళీని నెట్టడానికి వీలుగా రబ్బరు ఉన్న గుండ్రటి పరికరంతో నెత్తి మీద మొట్టి సోడా కొట్టేదింకొకడు. ఇకపోతే, సోడా తాగడం మాట దేవుడెరుగు, సోడా కొట్టే సౌండుకే సగం కిక్కు వస్తుంది. ఎంత ఎక్కువ సౌండు వస్తే అంత గొప్ప. గాలి సరిగా నింపక తుస్సుమనే సోడాలు కొన్నైతే, కొట్టిన పది సెకన్లవరకూ చెవి గింగులెత్తేంత సౌండు వచ్చేవి కొన్ని.. అందుకే కామోసు, మన సినీ కవులు కూడా “నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ..!!” అని పాటలు రాసి సోడా మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక మా చిన్నప్పుడు, సోడాలని రెండు చక్రాల తోపుడుబండిని తోసుకొంటూ వీధి వీధి తిరిగి అమ్మేవారు. ఈ సోడాలపై వేసవిలో చల్లదనానికి, గోనెసంచి గాని లేదా ఎండుగడ్డి గాని వేసి నీళ్ళు చల్లుతూ ఉండేవారు.. ఇప్పటికీ, కూలరు లేని బడ్డీ కొట్టు వాళ్ళు ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు. ఇక ఈ గోళీ సోడాలలో రకరకాలు.. మామూలు సోడా, ఐస్ సోడా, నిమ్మ సోడా, కలర్ సోడా అంటూ..
ఈ సోడాని తయారు చేసే విధానం కూడా గమ్మత్తుగా వుంటుంది. ఒకేసారి మూడు, నాలుగు సోడాలు పట్టే ఒక పెట్టె, ఆ పెట్టె గిరగిరా తిరగడానికి అమరిక, సోడాలో నింపే గ్యాస్ సిలిండర్ ని పెట్టెకి కలుపుతూ ఒక ట్యూబు, దానికి పీడనాన్ని చూపించే ఒక మీటరు..సోడాలో కావలిసినట్లు నీటిని నింపాకా, ఈ పెట్టెలో పెట్టి, కావలసినంత పీడనాన్ని అమర్చుకొని, పెట్టెను గిరగిరా కాసేపు తిప్పి బయటకు తీసి చూస్తే సోడా తయార్..
ఈ గోళీ సోడా ఇంత ప్రాచుర్యం పొందడానికి చాలా కారణాలున్నాయి.. ముఖ్యంగా ఇది పేదవాడికి కూడా అందుబాటులో ఉండే పానీయం.. బాదంగీరులూ, బటరు మిల్కులూ ఉన్నా, అన్నింటికంటే చవుకగా లభించేది గోళీ సోడాయే.. ఇక ఎండలో దాహం తీరాలన్నా, విందు భొజనం ఆరగించిన తరువాత భుక్తాయాసం తీరాలన్నా, ఆటలు ఆడిన తరువాత అలసట తీరాలన్నా, సోడాని మించినది మరొకటి లేదు.
ఇటువంటి చరిత్ర కలిగిన గోళీ సోడా, నాకు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ఇక కూల్ డ్రింకులూ,ఫ్రూటీలూ, బిస్లరీ సోడాలూ వచ్చాకా, ఊర్లలో కూడా గోళీ సోడా నెమ్మదిగా కనుమరుగు అయిపోతోంది. మరికొన్ని సంవత్సరాలు పోతే, ఈ సోడాలను మ్యూజియంలో తప్ప బయట చూడలేమేమో.. అందుకే..ఇప్పుడే.. గోళీ సోడా.. తాగిచూడరా తెలుగోడా..!!
గోలీ సోడా సూపర్.
భలేగా రాసేసేరండీ
మీ పోస్టుకు 111 మార్కులిచ్హేస్తున్నాన్నోచ్…..
గొలీ సొడా ఘనత బాగుంది కానీ….ఇది ఒక్క గోదారి జిల్లాలకే పరిమితం కాదు.నెల్లూరు,ప్రకాశం,చిత్తూరు జిల్లాలలో కూడా ఆస్వాదించొచ్చు.
భలే రాసారు. కానీ నిమ్మసోడా గురించి కూడా కొంత రాయాల్సింది 🙂
ఈ గోళీ సోడాని ఎన్ని సార్లు తాగినా ఇప్పటికీ నాకు ఎటువైపు నుండి తాగాలో తెలీదు.తాతయ్య భోజనం ఎప్పుదు చేస్తాడా అని ఎదురుచూసేవాళ్ళం పిల్లకాయలంతా.ఎందుకంటే భోజనం అయ్యాకా గోళీ సోడా తాగుతాడు.అందులో వాటాకోసం కొంతమందయితే,కొంతమందేమో సోడాని కొట్టడానికి.మీ పోస్ట్ నా బాల్యాన్ని ఒక్కసారి గుర్తు చేసింది.థాంక్స్.
గోళీ సోడా గురించి బాగుంది, చాలా వివరంగా వ్రాసారు
గోలీ సోడా కాటన్ దొర ద్వారా వచ్చిందని విన్నాను . కానీ అది గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం కాదు .
చాలా బాగా ఉంది మీ రచన. నాకు కూడా కలర్ & నిమ్మ సొడా అంటె భలే ఇష్టం. ఇప్పటికీ ఎప్పుడన్నా చూస్తే తాగాలని అనిపిస్తుంది. చిన్ననాటి సంగతులని మళ్లీ గుర్తు చేసారు.
మ0డు వేసవి లొ ర0గుసొడా తాగినట్లు0ది. చుపుడు వేలుపెట్టి సొడా కొడితే అ0దులొ తెల్ల్లటి మెఘ0 పుట్టి ఆ మేఘ0 నున్డి అమ్రుత0 తాగినట్లు0టున్ది.
యువతరంలోకి వచ్చిన నాకు, రానిదేదిలేదు అనే భావన ఉండింది, ఇన్ని రోజులు… కానీ ఒక విధ్యను నేర్వడం మరచిపోయానని మీ టపా చూసాక తెలిసింది…..స్ప్రైట్ ని నోటితో తీయడం నేర్చుకున్నాను కానీ, గోళిసోడాని వేలితో తెరవడం నేర్చుకోలేకపోయినందుకు చింతిస్తున్నాను ఇప్పుడు… పరవాలేదులెండి, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాలేజి గ్రౌండ్లో 1-6 వ తరగతి వరకు దాన్ని తాగిన స్మృతులు ఉన్నాయిగా, అవి చాలు ! ధన్యవాదములు…
రజారావు గారు మీ బ్లాగు చాలా బాగుంది.నేను నా పీజి(యంసిఎ) మీ ఊళ్ళొనే చదివాను.నేను ఇప్పుడు హైదరాబాదు లో స్/వ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నను.మీ తదుపరి బ్లాగ్ లొ ఊరి గురించి వివరించ వలెనని నా ప్రార్ధన. నెను కూడ తెలుగు లో బ్లాగు రాయదలచితిని కాని యెట్ల రాయలూ తెలియడంలేదు దానికి మీ సలహా???????? ఇట్లు మీ ………………. mail id kartheekyns@yahoo.co.in/kartheek_yns@yahoomail.com
goleesoda gurinchi baagaa raasaaru, idi andhra, rayalaseemalaku maatrame parimitham kaadu telangaanalo kooda dorukutundi
nimma soda ippatikee maa oorlo endaakaalamlo daahaanni theerche adhbuthamaina paaneeyam, deeni meeda ee purugula mandu kooldrinkainaa balaadoore, deenii illa thayaaru chestaaru: mundu neell, immarasam, chekkara alipi sodaa seesalo posi ,gyas nimpestaru.
nice.
“నాకు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు”
నిజంగా!! నాకు ఆంధ్రాలో గోళీ సోడా కనబడని ప్రాంతమే లేదు.