నెరవేరిన నా జీవిత ఆశయం

ప్రతీ మనిషికీ జీవితంలో కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలకు రూపం ఏర్పడడానికి దోహదపడిన కొన్ని కారణాలూ ఉంటాయి. గత మూడు సంవత్సరాలుగా నేను తపన పడ్డ విషయం ఒక్కటే. మా నాన్నగారి షష్టిపూర్తి సమయానికి ఆయనకు ఒక ఇంటిని కానుకగా ఇవ్వాలి అని. .

మా తల్లితండ్రుల వివాహం అయినప్పటినుంచీ మా తాతగారి ఇంటిలోనే కాపురం ఉండేవారు. మా తాతగారికి నలుగురు కొడుకులు, మా నాన్నగారు మూడవవారు. పెద్దనాన్నలిద్దరూ వృత్తిరీత్యా వేరే ఊర్లలో స్థిరపడడం వల్ల ఆ ఇంటిలో మా కుటుంబం, మా బాబాయి కుటుంబం, మా తాతగారు, బామ్మలతో కలిపి పదిమంది దాకా ఉండేవాళ్ళం. అవడానికి ఆ ఇల్లు ఎంతో పెద్దదైనా, ఉన్నవి అయిదు గదులే. ఒకటి మా తాతగారికి, ఒకటి మాకు, ఒకటి మా బాబాయికీ పోగా, ఒకటి వంటిల్లుగానూ, ఒకటి దేవుడి గదిగానూ ఉండేవి. మా నాన్నగారి పెళ్ళినుంచీ, దాదాపు 30 ఏళ్ళ పాటూ మా కష్టసుఖాలకు సాక్ష్యంగా నిలిచింది మా గది. మా నాన్నగారికి జరిగిన మూడు ఆపరేషన్లు, మా అమ్మకి నేనూ, మా అక్కా పుట్టకముందే పోయిన రెండు కాన్పులు, మా చదువులు, పెళ్ళిళ్ళు, ఇలా ఎన్నో సంఘటనలు ఆ నాలుగు గోడల మధ్యే జరిగాయి. అటువంటి ఆ ఇంటితో రుణం 2005 సంక్రాంతితో తీరిపోయింది. మా తాతగారు చనిపోయే కొన్నిరోజుల ముందు రాసిన వీలు ప్రకారం, ఆ ఇల్లు మా బాబాయికి చెందితే, మా తాతగారి హాస్పిటల్ మాకు వచ్చింది. ఇంతకీ హాస్పిటల్ అంతే ఏదో భవనం అనుకొనేరు. అదేమీ కాదు. సున్నం, మట్టి కలిపిన గోడలతో కట్టిన అతి పురాతనమైన, నివాస యోగ్యం కాని ఒక కట్టడం. ఆ కారణంగా దాదాపు 58 సంవత్సరాల వయసులో మా నాన్నగారు అద్దె ఇంటిలో తలదాచుకోవలసి వచ్చింది.

అప్పటివరకూ, ఉన్నది ఒక్క గదైనా, దానినే సొంత ఇంటిలా భావించుకుంటూ, ఎంతో ఆనందంగా జీవించిన మా నాన్నగారు, ఆ ఇంటితో సంబంధం తెగిపోయినప్పటినుంచీ డీలా పడిపోయారు. దానికి తోడు 2005 చివర్లో మా తాతగారి మరణం ఆయన్ను మరింత కుంగదీసింది. ఉమ్మడి కుటుంబంలో సర్వశక్తులూ ధారబోసి, తల్లిదండ్రులకు ఎంతో సేవచేసి, తమ్ముడి కుటుంబాన్నీ, మమ్మల్నీ ఎంతో వృద్ధిలోకి తీసుకువచ్చిన మా నాన్నగారు, ఒక్కసారిగా ఏమీలేని ఒంటరి అయిపోయారు. ఈ ముప్పై ఏళ్ళలోనూ, వారసత్వంగా సంక్రమించిన ఆ ఒక్క హాస్పిటల్ తప్ప, తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు. సొంతఊరిలో, తనకంటూ ఒక సొంత ఇల్లులేక, అద్దె ఇంటిలో కాలం గడుపుతున్న మా నాన్నగారి కష్టాలు విని నా గుండె తరుక్కుపోయింది. దానికి తోడు మా నాన్నగారి ప్రాక్టీసు కూడా బాగా దెబ్బతింది. ఇవన్నీ తెలుసుకొన్న నేను ఒక నిశ్చయానికి వచ్చాను. మా నాన్నగారి షష్టిపూర్తి సమయానికి ఆయనకు ఒక ఇంటిని కానుకగా ఇవ్వాలి అని. అప్పటినుంచీ మా నాన్నగారిని ఇల్లు కట్టమని బలవంతం చేయడం ప్రారంభించాను. దానికి కావలసిన డబ్బు ఎంతైనా నేను సమకూరుస్తానని హామీ ఇచ్చాను.

అప్పటికి నేను అమెరికా వచ్చి రెండు సంవత్సరాలయ్యింది. ఆర్థికంగా అప్పుడప్పుడే నిలదొక్కుకొంటున్న పరిస్థితి. 2004లో బెంగుళూరులో అపార్టుమెంటు తీసుకోవడంవల్ల, ప్రతీ నెలా దానికి ఇన్‌స్టాల్‌మెంట్లు కడుతూ ఉండవలసి వచ్చేది. ఇదంతా తెలిసిన మా నాన్నగారు, నాకు ఇబ్బంది కలగకూడదని, ఎవో కారణాలు చూపిస్తూ, సొంత ఇంటి ప్రయత్నాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

2006లో మా తాతగారి సంవత్సరీకాలకై ఇండియా వెళ్ళిన నేను, మా నాన్నగారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసాను. అద్దె ఇంటిలో వారు పడుతున్న కష్టాలను ఆకళింపు చేసుకున్న నేను, మరి ఆలస్యం చేయకూడదని, నాన్నగారిని ఒప్పించి, హాస్పిటల్ స్థానాన్నే ఒక భవనం నిర్మించేలా, దానిలో ఒక గదిని నాన్నగారి హాస్పిటల్‌కై ఉపయోగించేలా ప్లాన్ తయారుచేయించి, వీలైనంత తొందరలో పని ప్రారంభం అయ్యేలా చూడమని, అమెరికా వచ్చేసాను. నా బలవంతం వల్ల, తప్పనిసరై 2007 ఫిబ్రవరిలో, హాస్పిటల్‌ను కూలగొట్టి, కొత్తింటికై శంకుస్థాపన చేసారు మా నాన్నగారు.

ఇదే సమయంలో మరో విచిత్రం జరిగింది. ఆ ఊళ్ళొనే, అప్పటికి పది సంవత్సరాలుగా కాపురం ఉంటున్న మా అక్క, బావగారు ఒక స్థలం కొనడం సంభవించింది. చేతిలో ఉన్న మొత్తం డబ్బుతో స్థలం కొనివేయడం వల్ల, అప్పట్లో ఇల్లు కట్టలేని ఆర్థిక పరిస్థితి వారిది. ఈ విషయం తెలియగానే, నా భార్య, “వారికి కూడా ఒక ఇల్లు కట్టిస్తే, రెండు ఇళ్ళూ ఒకే సమయానికి పూర్తి అవుతాయి కదా..?” అన్న సలహా ఇచ్చింది. ఒక్క పైసా కూడా లోను లేకుండా, ఈ రెండు ఇళ్ళకీ, దానితో పాటూ నా బెంగుళూరు ఇంటికీ అయ్యే ఖర్చు తట్టుకోగలనా అని మొదట్లో జంకినా, నా భార్య ప్రోత్సాహంతో, జీవితంలో ఒక మంచిపని చేస్తున్నానన్న తృప్తితో, ఏమైతే అయ్యిందని, మా అక్కా వాళ్ళ చేతకూడా 2007 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేయించాను.

గిర్రుమని నెలలు తిరిగిపోయాయి. నేను అవసరానికి సరిపడా వాయిదాలుగా డబ్బు పంపుతూ ఉండడం, మా నాన్నగారు, బావగారు, వారి వారి ఇంటిపనులను దగ్గరుండి చూసుకోవడం జరిగిపోయింది. అనుకున్నదానికి మించి ఖర్చు అయినా, నిర్విఘ్నంగా ఇళ్ళు పూర్తి అయిపోయాయి. నాన్నగారి ఇల్లు విలాసంగా, రెండు అంతస్థులతో కట్టడం వల్ల దాదాపుగా 30 లక్షలు, బావగారి ఇల్లు కొంచం తక్కువలో, ఒద్దికగా ఒక అంతస్థులోనే కట్టడంవల్ల 11 లక్షలు అయింది. వీటితో పాటుగా నా బెంగుళురు అపార్ట్‌మెంట్ కూడా పూర్తి అయ్యింది. క్రితం నెల నవంబరులో ఇండియా వెళ్ళినప్పుడు, 15వ తారీఖున నా బెంగుళురు అపార్ట్‌మెంట్ గృహప్రవేశం, 29న మా నాన్నగారి, మరియు బావగారి ఇళ్ళ గృహప్రవేశాలతో అందరం ఒకే నెలలో ఒక ఇంటివారం అయ్యాము. ఆ విధంగా 2007 నవంబరు నెల మా జీవితంలో మరపురాని నెలగా మిగిలిపోతుంది.

ఈ విధంగా, అనుకున్నట్టుగా షష్టిపూర్తి సమయానికి మా నాన్నగారికి సొంత ఇంటిని కానుకగా అందించగలిగాను. ఈ సందర్భంలో నా భార్యను గుర్తుచేసుకోవలసిన ధర్మం ఎంతైనా ఉంది. తన అంగీకారం, సహకారం, ప్రోత్సాహమే లేకపోతే, నా తల్లిదండ్రులకే కాక, మా అక్కనుకూడా ఒక ఇంటిదానిని చేయడమనే ఈ బృహత్తర కార్యం నెరవేరేదే కాదు. అందుకే అంటారేమో, ప్రతీ మగవాడి విజయం వెనుకా ఒక ఆడది ఉంటుందని. నా ఈ విజయం వెనుక వెన్నుదన్నుగా నిలిచిన నా భార్యకి ఈ బ్లాగు ద్వారా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

17 comments to నెరవేరిన నా జీవిత ఆశయం

  1. jyothi అంటున్నారు:

    అభినందనలు రాజారావుగారు, మీకు , మీ బాధ్యతను పంచుకుని మీ కలను సాకారం చేయడానికి సహకరించిన మీ భార్యకు కూడా అభినందనలు. తల్లితండ్రులకు సంతోషం కలిగించడం కంటే ఇంకా ఏం కావాలి? ఇప్పుడు మీ ఆనందాన్ని మేము పూర్తిగా అర్ధం చేసుకోగలం..ఇది విలువ కట్టలేనిది. ఎవరూ దోచుకోలేనిది..

  2. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

    చాలా బాగుందండీ…
    మీకు నా శుభాకాంక్షలు మరియు అభినందనలు.

    మన అనుకున్న వారి కోసం మీరు పడిన తపన మెచ్చతగ్గది. మీ నాన్న గారికి కూడా షష్టిపూర్తి శుభాకాంక్షలు. అలాగే మీ శ్రీమతికి కూడా అభినందనలు.

  3. pichukalu అంటున్నారు:

    శ్రీమతి రాజారావు గారికి,ఇన్ని వివరాలు చెప్పిన మీ వారు మీ పేరు చెప్పలేదు.అయినా సరే అందుకోండి నా అబినందనలు.భర్తను,అతనితోటి కుటుంబసభ్యులను ఒక లగేజీగా,ఒక లయబిలిటీగా,ఇదెక్కడి తద్దినంగ చూస్తున్న కోడళ్ళను నేను కనీసం 20మందిని చూశాను.అందులో ముగ్గురు డాక్టర్లు కాగా,5గురు ఇంజినీర్లు డిగ్రీకి తక్కువ చదివిన వారు ఎవరూ లేరు.అలాంటిది రాజారావు గారికి మీరిచ్చినసహకారం,దాన్ని ఆయన ఉపయోగించుకున్నా విధానం నాకు బాగా నచ్చాయి. నా భార్యకు మీ వారి లాంటి అన్నయ్యలు మరో ఇద్దరుంటే ఎంతబాగుండు?

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    http://visakhateeraana.blogspot.com

    http://charchaavedika.blogspot.com/

  4. వికటకవి అంటున్నారు:

    మిగిలిన పాదాలు పక్కనబెడితే, మీ ఆవిడ “కరణేషు మంత్రీ” లానే బాగా వ్యవహరించారు. ఆవిడకి అభినందనలు. నేను అమెరికా వచ్చేటప్పటికి మాదీ అప్పుచేసిపప్పుకూడు తింటున్న ఇల్లే. ఇప్పుడు అంతా స్థిరపడ్డామనుకోండి. కానీ ఆ కష్టాలు భవిష్యత్తులో సుఖజీవనం సాగించేటప్పుడు కూడా మనల్ని మన అస్థిత్వాన్నుంచి దూరం చేయనీయవు అని నా భావన.

  5. pichukalu అంటున్నారు:

    please remove my comment sir,i know now it hurts you

    rajendra kumar

  6. jyothi అంటున్నారు:

    if i am not wrong , is ur wife name vasundhara…

  7. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    జ్యోతి గారూ,
    మీరు సరిగానే ఊహించారు..!!

  8. రవి వైజాసత్య అంటున్నారు:

    చాలా ఆనందంగా ఉంది..శుభాకాంక్షలు..వే టు గో

  9. కొత్తపాళీ అంటున్నారు:

    Bravo.
    మీ దంపతులకి అభినందనలు.
    మంచి పని చేసి తలిదండ్రులు గర్వపడేలా చెయ్యటమే గాక .. ఈ అనుభవాన్ని చక్కగా .. అంటే అనవసరమైన సెంటిమెంటాలిటీ లేకుండా .. హృద్యంగా రాసి మాతో పంచుకున్నందుకు థాంకులు కూడా.

  10. jyothi అంటున్నారు:

    సో మీరు ద్వితీయ తెలుగు బ్లాగు దంపతులన్నమాట

  11. నేమాని రామక్రిష్ణ అంటున్నారు:

    రాజారావు గారు,ఛాలా అభినందిచదగిన పని చేసిన మీకు,మీ శ్రీమతి గారికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు.

  12. chandra shekar reddy అంటున్నారు:

    naa alochana meeku mundu vacchindanthe.meeku naa shubhakankshalu.

  13. సతీష్ అంటున్నారు:

    మీ వ్యాసం చదువుతున్నంత సేపు మా నాన్నగారి కలని ఎప్పుడు నిజం చేస్తానా అని ఒకటే ఆలోచన. ఇంతగా నన్ను స్పూర్తి పరిచినందుకు ధన్యవాదాలు

  14. bollojubaba అంటున్నారు:

    రాజారావుగారు,
    మీ బ్లాగు చదివాకా, కళ్లు చమర్చాయి.
    చాన్నాళ్ల తరువాత ఒక సజీవ అనుభవాన్ని, అనుభవించి మమేకమయ్యాను.
    థాంక్స్
    బొల్లోజు బాబా

    sahitheeyanam.blogspot.com/

  15. [...] అయినట్టుగా నా గత బ్లాగు “నెరవేరిన నా జీవిత ఆశయం” లో తెలియపరచాను. అప్పటివరకూ [...]

  16. common man అంటున్నారు:

    తల్లిదండ్రులని సంతోష పెట్టాలని అందరు అనుకుంటారు..కాని ఆ కోరికని బలపరచి అండగా నిలిచే భార్య అందరికీ దొరకరు…మీరు రెండు విధాలా అదృష్టవంతులు.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )